నెల్లూరు(టౌన్): ప్రభుత్వ పాఠశాలలను సర్కార్ గాలికొదిలేసింది. పాఠశాలలు శుక్రవారం పునఃప్రారంభం కానున్నా, అక్కడ మౌలిక వసతులను కల్పించే దిశగా ఎలాంటి చొరవ చూపడంలేదు. మరోవైపు వీటిపై సీఎం చంద్రబాబు హడావుడి చేస్తున్నా, క్షేత్రస్థాయిలో పరిస్థితి అందుకు విరుద్ధంగా ఉంది. ప్రభుత్వం ఏటా చెప్పే మాటలే కావడంతో జిల్లా విద్యాశాఖ, సమగ్రశిక్ష అధికారులు లైట్ తీసుకున్నారని సమాచారం. వీటి కోసం రూ.55 కోట్లను మంజూరు చేశామని చెప్తున్నా, ఒక్కపైసానూ ఇవ్వలేదని తెలుస్తోంది.
ఎక్కడి పనులక్కడే..
● కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండేళ్లు పూర్తవుతోంది. అయితే సర్కార్ బడుల్లో నిలిచిపోయిన నిర్మాణ పనులు ఈ కాలంలో ఒక్క అడుగు సైతం ముందుకెళ్లలేదు.
● నాడు – నేడు రెండో విడతలో అసంపూర్తిగా ఉన్న పనులకు ఒక్క పైసాను సైతం విదిల్చకపోవడం విస్మయాన్ని కలిగిస్తోంది.
● గత వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ హయాంలో విద్యార్థుల సౌకర్యార్థం ఏర్పాటు చేసిన 727 ఆర్వో ప్లాంట్లలో, ప్రస్తుతం 342 మరమ్మతులకు గురయ్యాయి. వీటిని బాగు చేసే దిశగా ఎలాంటి చొరవ చూపడంలేదు.
● 919 పాఠశాలల్లో 342 టాయ్‌లెట్లను గతంలో పూర్తి చేశారు. 554 మరుగుదొడ్లలో కేవలం తలుపులనే బిగించాల్సి ఉంది.
● 412 కిచెన్ షెడ్లకు గానూ 158 నిర్మాణాలను పూర్తి చేశారు. మరో 229 చోట్ల తలుపులను ఏర్పాటు చేయాల్సి ఉన్నా, ప్రస్తుతం అతీగతీ లేదు. 20 షెడ్ల నిర్మాణ పనులు పూర్తి కాలేదు.
● 882 తరగతి గదుల నిర్మాణాలను చేపట్టగా, ఇందులో 385 పూర్తయ్యాయి. మరో 485 గదులకు తలుపులను బిగించాల్సి ఉంది. 12 నిర్మాణాలు వివిధ దశల్లో ఉన్నాయి.
● 696 టాయ్‌లెట్లకు మరమ్మతులు చేపట్టాలని నిర్ణయించగా, ఇందులో 371 మేర పూర్తి చేశారు. మరో 319 మరుగుదొడ్లకు తలుపులను రిపేర్ చేయాల్సి ఉంది. ఆరు మరమ్మతులు వివిధ దశల్లో ఉన్నాయి.
● 579 ఇంగ్లిష్ ల్యాబ్‌లను ఏర్పాటు చేయాలని నిర్ణయించగా, 353ను పూర్తి చేశారు. ఇంకా 226ను ఏర్పాటు చేయాల్సి ఉంది.
నాడంతా సాఫీగా..
గత వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ హయాంలో నాటి సీఎం జగన్‌మోహన్‌రెడ్డి.. సర్కార్ బడులను కార్పొరేట్ స్థాయిలో తీర్చిదిద్దాలనే లక్ష్యంతో నాడు – నేడు పథకానికి శ్రీకారం చుట్టారు. తొలి విడతలో రూ.231.6 కోట్లతో 1059 పాఠశాలల్లో పది రకాల మౌలిక వసతులను కల్పించారు. అనంతరం రెండో విడతలో భాగంగా రూ.466.94 కోట్లతో 1356 స్కూళ్లలో సౌకర్యాల కల్పనకు నిర్ణయించారు. దీనికి గానూ రూ.190.45 కోట్లను విడుదల చేశారు. పేద విద్యార్థుల కోసం ఇంగ్లిష్ మీడియం అమలు, టోఫెల్ విధానం, సీబీఎస్‌ఈ సిలబస్, ఎనిమిదో తరగతి స్టూడెంట్స్‌కు ట్యాబ్‌ల పంపిణీ తదితరాలకు శ్రీకారం చుట్టారు. అంతా సాఫీగా సాగుతున్న తరుణంలో ఎన్నికలు రావడం.. అందులో గెలిచి కూటమి ప్రభుత్వం కొలువుదీరడంతో కథ మొదటికొచ్చింది.
కొన్ని పాఠశాలల్లో కనీసం లైట్లు, ఫ్యాన్లు, బల్లలూ పూర్తి స్థాయిలో లేవు. రూ.20 కోట్లతో తాత్కాలిక మరమ్మతులను పూర్తి చేసే అవకాశం ఉన్నా, ప్రభుత్వం ఆసక్తి చూపడంలేదు. పేరెంట్స్ కమిటీ అకౌంట్లలో రూ.తొమ్మిది కోట్లున్నా, వాటిని వినియోగించిన దాఖలాల్లేవు.
పాఠశాలల పునఃప్రారంభం నేడు
మొండిగోడలు, వసతుల లేమితో దర్శనం
అసంపూర్తిగా పనులు
నిధుల్లేక ఎక్కడికక్కడే నిలిచిపోయిన వైనం
తొలుత హడావుడి..
ఆపై విస్మరిస్తున్న ప్రభుత్వం


