సాక్షి ప్రతినిధి, నెల్లూరు: కూటమి ప్రభుత్వ మోసాలపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పోరుబాట పట్టింది. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేయాలని డిమాండ్ చేస్తూ మండల, నియోజకవర్గ, జిల్లా కేంద్రాల్లో నిరసన కార్యక్రమాలను ఈ నెల నాలుగు నుంచి చేపట్టింది. చంద్రబాబు అధికారంలోకి వచ్చి రెండేళ్లు పూర్తయిన సందర్భంగా నియోజవర్గ కేంద్రాల్లో ప్రజలతో కలిసి పెద్ద ఎత్తున నిరసన ర్యాలీలను శుక్రవారం చేపట్టాలని పార్టీ అధినేత, మాజీ సీఎం జగన్‌మోహన్‌రెడ్డి పిలుపునిచ్చారు. ఈ నేపథ్యంలో నిరసన ర్యాలీలను భారీగా చేపట్టేందుకు ఇన్‌చార్జీలు, మాజీ ఎమ్మెల్యేలు, పార్టీ నేతలు సమాయత్తమవుతున్నారు. ప్రజలను కలుపుకొని చంద్రబాబు చేసిన మోసాలపై గళం విప్పనున్నారు.
ఆచరణ సాధ్యం కాని వాగ్దానాలు
అధికారమే పరమావధిగా గత ఎన్నికలకు ముందు అలివికాని హామీలను చంద్రబాబు గుప్పించారు. అధికారంలోకి వచ్చి రెండేళ్లవుతున్నా, వీటిని ఏ మాత్రం నెరవేర్చలేదు. ఆడబిడ్డ నిధి కింద ప్రతి ఇంట్లో 18 ఏళ్లు నిండిన ప్రతి మహిళకూ నెలకు రూ.1500 చొప్పున.. నిరుద్యోగ భృతి కింద డిగ్రీ చేసిన యువతకు నెలకు రూ.మూడు వేల చొప్పున.. 50 ఏళ్లు నిండిన బీసీ, ఎస్సీ, ఎస్టీలకు పింఛన్ అంటూ ఊకదంపుడు ఉపన్యాసాలిచ్చారు. ఏడాదికి మూడు ఉచిత గ్యాస్ సిలిండర్లను ఇస్తామని చెప్పి, ఈ రెండేళ్ల కాలంలో కొద్దిమందికే అందజేసి చేతులు దులుపుకొన్నారు. జాబ్ క్యాలెండర్‌ను ఏటా ప్రకటిస్తామని చెప్పి, ఇంత వరకు ఒక్కటంటే ఒక్కటీ ప్రకటించలేదు. అన్నదాత సుఖీభవ కింద రూ.20 వేలను ఇస్తామని చెప్పి వంచించారు. ఫీజు రీయింబర్స్‌మెంట్ నిధులనూ అరకొరగా విడుదల చేశారు. ఆరోగ్యశ్రీని ప్రైవేట్ యాజమాన్యాలకు అప్పజెప్పేందుకు అడుగులేస్తున్నారు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అని చెప్పి, బస్సులను ప్రైవేట్‌పరం చేసే యత్నాలూ సాగుతున్నాయి. ప్రైవేట్ పాఠశాలల యాజమాన్యాలకు వెన్నుదన్నుగా నిలుస్తూ, ప్రభుత్వ స్కూళ్లను నిర్వీర్యం చేస్తున్నారు. తల్లికి వందనం కింద ఎంత మంది బిడ్డలు చదువుతుంటే అందరికీ ఏడాదికి రూ.15 వేలిస్తామని చెప్పి, ఆ తర్వాత లబ్ధిదారులను కుదించడంతో పాటు ఒక్కో విద్యార్థికి రూ.13 వేలనే ఖాతాల్లో జమ చేశారు. పట్టణ ప్రాంతాల్లో 12.. గ్రామీణ ప్రాంతాల్లో 18 అంకణాల ఇంటి స్థలాన్ని ఇస్తామని చెప్పి విస్మరించారు. హామీలను నెరవేర్చకుండా కల్లిబొల్లి కబుర్లు చెప్తూ కాలం వెళ్లదీస్తున్నారు.
అమలు చేయాల్సిందే..
హామీలను కూటమి ప్రభుత్వం తప్పకుండా అమలు చేయాల్సిందేని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు డిమాండ్ చేస్తున్నారు. ఈ అంశంపై జనపోరు బాట పట్టింది. చంద్రబాబు చేసిన మోసాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని పార్టీ పిలుపునిచ్చింది. కూటమి ప్రభుత్వం హామీ ఇచ్చి మోసం చేసిన ప్రతి పథకాన్నీ ప్రజలకు వివరించాలని స్పష్టం చేసింది. ప్రజల పక్షాన పోరాడేందుకు పార్టీ శ్రేణులు సంసిద్ధమయ్యారు. నియోజకవర్గ కేంద్రాల్లో భారీ నిరసన ర్యాలీలు చేపట్టేందుకు సిద్ధమయ్యారు.
ఎన్నికల సమయంలో
అలివికాని హామీలు
అధికారంలోకి వచ్చాక విస్మరణ
కూటమి ప్రభుత్వ మోసాలపై
వైఎస్సార్సీపీ పోరుబాట
నియోజకవర్గ కేంద్రాల్లో నిరసన ర్యాలీలు నేడు


