● మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డి
ముత్తుకూరు(పొదలకూరు): పరిశ్రమల స్థాపనలో స్థానికులు కీలక పాత్ర పోషిస్తున్నారని, ఉద్యోగావకాశాల్లో వీరికే ప్రాధాన్యమివ్వాలని మాజీ మంత్రి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు కాకాణి గోవర్ధన్‌రెడ్డి పేర్కొన్నారు. ముత్తుకూరుకు గురువారం విచ్చేసిన ఆయన విలేకరులతో మాట్లాడారు. పరిశ్రమల యాజమాన్యాలు స్థానిక యువతకు 75 శాతం ఉద్యోగాలను కేటాయించాల్సిందేనంటూ చట్టాన్ని నాటి సీఎం జగన్‌మోహన్‌రెడ్డి తీసుకొచ్చిన అంశాన్ని గుర్తుచేశారు. అయితే వీటిని అతిక్రమించి స్థానిక యువతకు ఉద్యోగాలను సక్రమంగా ఇవ్వడంలేదని ఆరోపించారు. సీఎస్సార్ నిధులను కొందరికి ఎరవేసి ఉద్యోగులకు కనీస వేతనాన్ని చెల్లించకుండా వెట్టి చాకిరీ చేయించుకుంటుంటున్నారని తెలిపారు. వేతనాలను పెంచాలంటూ సర్వేపల్లి నియోజకవర్గంలోని ఎస్‌ఈఐఎల్ కంపెనీలో పనిచేస్తున్న కార్మికులు నెల పాటు సమ్మె చేసిన అంశాన్ని ప్రస్తావించారు. కొందరు కార్మికులు తన వద్దకొచ్చి కలెక్టర్‌తో మాట్లాడి కార్మిక చట్టం మేరకు వేతనాలను చెల్లించేలా చూడాలని కోరారని తెలిపారు. కలెక్టర్ సానుకూలంగా స్పందించి.. కార్మిక శాఖ అధికారులను పంపి విచారణ చేయించి చర్యలు చేపడతామని హామీ ఇచ్చారన్నారు. ఎట్టకేలకు యాజమాన్యం దిగొచ్చి వేతనాలను పెంచడం ఆహ్వానించదగ్గ పరిణామమని తెలిపారు. సీఎస్సార్ నిధుల పేరిట ఆస్పత్రుల నిర్మాణమంటూ ప్రకటనలు చేసి కాంట్రాక్టులు దక్కించుకొని రూ.కోట్లు కూడబెట్టకుంటున్నారని ధ్వజమెత్తారు. ఏపీ జెన్‌కోలో మూడో యూనిట్‌ను నాటి సీఎం జగన్‌మోహన్‌రెడ్డి ప్రారంభించిన సందర్భంగా భూములిచ్చిన రైతుల కుటుంబాలకు ఉద్యోగాలు కల్పించాలని కోరారని తెలిపారు. అప్పట్లో సానుకూలంగా స్పందించిన ఆయన 200 మందికి ఉద్యోగావకాశాలు కల్పించారని గుర్తుచేశారు. సర్వేపల్లిలో సోమిరెడ్డి ఆయన కుమారుడు చిన్నపాటి ఉద్యోగాలకు సైతం రూ.నాలుగైదు లక్షలను వసూలు చేస్తున్నారని ధ్వజమెత్తారు. అనంతరం బాపనపాటి ప్రకాష్, సృజన వివాహ వేడుకలకు హాజరై వధూవరులను ఆశీర్వదించారు. పార్టీ మండల కన్వీనర్ మెట్టా విష్ణువర్ధన్‌రెడ్డి, నెల్లూరు శివప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.


