యూరియా కోసం మళ్లీ తిప్పలు | - | Sakshi
Sakshi News home page

యూరియా కోసం మళ్లీ తిప్పలు

Jun 11 2026 12:07 AM | Updated on Jun 11 2026 12:07 AM

రాష్ట్రంలో ఎక్కడ చూసినా అరాచకమే

మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డి

ముత్తుకూరు(పొదలకూరు): ఎడగారులో వరి సాగు చేస్తున్న రైతులు యూరియా కోసం మళ్లీ తిప్పలు పడుతున్నారని.. సవాలక్ష ఆంక్షలు విధించి వీటిని అందజేస్తున్నారని మాజీ మంత్రి, వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ జిల్లా అధ్యక్షుడు కాకాణి గోవర్ధన్‌రెడ్డి ధ్వజమెత్తారు. ముత్తుకూరు మండలంలోని పంటపాళెం, ఈదర్లవారిపాళెం, కోవెరపాళెం.. తోటపల్లిగూడూరు మండలం వరిగొండ గ్రామాల్లో బుధవారం ఆయన పర్యటించారు. ఈ సందర్భంగా యూరియా, డీఏపీ ఇబ్బందులను రైతులు తెలియజేశారు. అనంతరం ఆయన మాట్లాడారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఆరాచక పాలనను సాగిస్తూ.. కర్షకుల సంక్షేమాన్ని విస్మరిస్తోందని ఆరోపించారు. రాష్ట్రంలో ప్రభుత్వముందా.. సీఎం ఉన్నారాననే అనుమానం కలుగుతోందని విమర్శించారు. ఎక్కడ చూసినా అవకతవకలు, అవినీతి రాజ్యమేలుతున్నాయని ధ్వజమెత్తారు. రెండేళ్ల చంద్రబాబు వెన్నుపోటు పాలనపై జిల్లా వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలను వారం రోజులుగా చేపట్టామని చెప్పారు. వెన్నుపోటు పాలనపై ర్యాలీలు, సమావేశాలు, సదస్సులను ఏర్పాటు చేసి చంద్రబాబు ఏ విధంగా వంచించారో ప్రజలకు వివరించామన్నారు. జిల్లాలోని అన్ని నియోజకవర్గాల్లో భారీ ర్యాలీలను శుక్రవారం నిర్వహించనున్నామని వెల్లడించారు.

సవాల్‌ చేసి పారిపోయిన సోమిరెడ్డి

పొదలకూరు అభివృద్ధిపై సవాల్‌ చేసిన సోమిరెడ్డి ఆ తర్వాత పారిపోయారని ధ్వజమెత్తారు. సోమిరెడ్డి సవాల్‌ను తాను స్వీకరించి.. పొదలకూరు మండలంతో పాటు సర్వేపల్లి నియోజకవర్గంలో ఎవరి హయాంలో ఎంత అభివృద్ధి జరిగిందో మీడియా సమక్షంలో చర్చించేందుకు రావాలంటే తోకముడిచి పలాయనం చిత్తగించారని విమర్శించారు. అభివృద్ధి, అవినీతిపై ఎక్కడ బహిరంగ చర్చకు రమ్మన్నా, తాను సిద్ధంగా ఉన్నానని మరోసారి సవాల్‌ విసిరారు. ఇప్పటికై నా ఏజెంట్లు, చెంచాలను పంపకుండా నేరుగా చర్చకు రావాలని డిమాండ్‌ చేశారు. గతంలో ఈ ప్రాంతంలో సోమిరెడ్డి ఎలాంటి అభివృద్ధి చేశారో చెప్పాలని పది రోజులుగా ఎదురుచూస్తున్నా, రావడంలేదని ఎద్దేవా చేశారు. ఎమ్మెల్యేగా, మంత్రిగా గ్రామాల్లో తాను చేసిన అభివృద్ధి కనిపిస్తోందని, ఏ చిన్నపాటి అవసరమొచ్చినా అందుబాటులో ఉంటున్నానని తెలిపారు. పేడూరు, ఇస్కపాళెం, కోవెరపాళెం గ్రామాల్లో అభివృద్ధిని చూసి మాట్లాడాలని సూచించారు. ఈ ప్రాంతంలో రోడ్లు సక్రమంగా లేకపోతే, తాను చొరవ చూపి వేయించానని గుర్తుచేశారు. గ్రామాల్లో సాగు, తాగునీటి వసతులను కల్పించామని.. పట్టణాలు, గ్రామాల్లో ప్రభుత్వ లేఅవుట్లను నిర్మించి ఊళ్లనే ఏర్పాటు చేశామని తెలిపారు. తాము మంజూరు చేసిన ఇళ్లకు కూటమి ప్రభుత్వంలో బిల్లులు ఆపించి ఆనందపడుతున్నారని దుయ్యబట్టారు. పంటపాళెంలో మృతి చెందిన రావి రవీంద్రబాబురెడ్డి.. ఈదర్లవారిపాళెంలో దామవరపు రామచంద్రారెడ్డి.. కోవెరపాళెంలో కుడుముల శేషమ్మకు నివాళులర్పించారు. వరిగొండలో మృతి చెందిన గండవరపు పట్టాభిరామిరెడ్డి కుటుంబాన్ని పరామర్శించి తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. నేతలు మెట్టా విష్ణువర్ధన్‌రెడ్డి, ఆలపాక శ్రీనివాసులు, ఎంపీటీసీ రవికుమార్‌రెడ్డి, చెంగారెడ్డి, హేమంత్‌రెడ్డి, ఉప్పల శంకరయ్యగౌడ్‌, తలమంచి సురేంద్రబాబు తదితరులు పాల్గొన్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement