Tokyo Olympics: కరోనా కేసుల హైరానా

Tokyo Olympics: Three More Atletes Tested Coronavirus Positive - Sakshi

టోక్యో క్రీడా గ్రామంలో మరో ముగ్గురికి పాజిటివ్

టోక్యో: విశ్వక్రీడలకు ఇంకొన్ని గంటల్లో తెరలేవనుంది. కానీ క్రీడాగ్రామంలో  వైరస్‌ కేసులు రోజురోజుకీ పెరుగుతుండటంతో ఇటు టోక్యో నిర్వాహక కమిటీ (టీఓసీ)కి, అటు అంతర్జాతీయ ఒలింపిక్‌ కమిటీ (ఐఓసీ)కి కంగారెత్తిస్తున్నాయి. తాజాగా మరో ముగ్గురు కోవిడ్‌ బారిన పడినట్లు స్పోర్ట్స్‌ విలేజ్‌ వర్గాలు వెల్లడించాయి. చెక్‌ రిపబ్లిక్‌ వాలీబాల్‌ ప్లేయర్‌ మర్కెటా నౌస్చ్, నెదర్లాండ్స్‌ తైక్వాండో ప్లేయర్‌ రెష్మీ వుగింగ్, అమెరికా బీచ్‌ వాలీబాల్‌ ఆటగాడు టేలర్‌ క్రాబ్‌ కరోనాతో ఒలింపిక్స్‌కు దూరమయ్యారు. ముగ్గురు కోవిడ్‌ పాజిటివ్‌ అని తేలడంతో క్వారంటైన్‌కు తరలించారు.

క్రీడాగ్రామంలో ఇప్పటివరకు కరోనా బారిన పడిన వారి అంకె ఇప్పుడు సంఖ్య (10)కి చేరింది. విలేజ్‌ వెలుపల క్రీడలకు సంబంధించిన మరో 12 మందికి వైరస్‌ సోకింది. దీంతో ఈ కేసులు కూడా 87కు పెరిగాయి. మరోవైపు చెక్‌ రిపబ్లిక్‌ను పట్టి పీడిస్తున్న వైరస్‌పై ఆ దేశ ఒలింపిక్‌ కమిటీ దర్యాప్తుకు ఆదేశించింది. చెక్‌ జట్టులో కోచ్‌తో పాటు ముగ్గురు అథ్లెట్లు కోవిడ్‌తో క్వారంటైన్‌ బాటపట్టారు. ‘చూస్తుంటే పరిస్థితి ఇబ్బందికరంగానే తయారవుతోంది. మేం ఎన్ని ముందుజాగ్రత్త చర్యలు చేపట్టినా వైరస్‌ పంజా విసురుతూనే ఉంది’ అని చెక్‌ జట్టు స్పోర్ట్స్‌ డైరెక్టర్‌ మార్టిన్‌ అన్నారు. కరోనాకు గురైన అమెరికన్‌ బీచ్‌ వాలీబాలర్‌ టేలర్‌ క్రాబ్‌ స్థానాన్ని ట్రి బౌర్న్‌తో భర్తీ చేస్తున్నట్లు అమెరికా జట్టు ట్వీట్‌ చేసింది. మరోవైపు టోక్యో నగరాన్ని కూడా మహమ్మారి కుదిపేస్తోంది. గురువారం ఒక్కరోజే 1,979 మంది పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యారు. ఈ ఆరు నెలల్లో ఇదే అత్యధిక కేసుల రికార్డు అని టోక్యో మెట్రోపాలిటన్‌ గవర్నమెంట్‌ తెలిపింది. 

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top