
భారత క్రికెట్ జట్టుకు జెర్సీ స్పాన్సర్‌గా ఉన్న ఫ్యాంటసీ గేమ్ ఫ్లాట్ ఫామ్ డ్రీమ్ 11(Dream11)తో బీసీసీఐ ఒప్పందం రద్దు చేసుకుంది. 'ప్రమోషన్ అండ్ రెగ్యులేషన్ ఆఫ్ ఆన్‌లైన్ గేమింగ్ బిల్లు-2025 పార్లమెంటులో ఆమోదం పొందిన నేపథ్యంలో ఈ మేరకు నిర్ణయం తీసుకుంది.
ఈ విషయాన్ని బీసీసీఐ కార్యదర్శి దేవజిత్ సైకియా ధ్రువీకరించారు. దీంతో సెప్టెంబర్ 9న ప్రారంభం కానున్న ఆసియా కప్‌లో టీమిండియా స్పాన్సర్ లేకుండానే ఆడనుంది. కాగా ఈ ఆన్‌లైన్ గేమింగ్ బిల్లును ఆగస్టు 20న లోక్‌సభ, 21న రాజ్యసభ ఆమోదించింది.
ఆ తర్వాత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము సంతకం చేయడంతో ఈ బిల్ ఇప్పుడు చట్టంగా మారింది. ఫలితంగా భారత జట్టుకు జెర్సీ స్పాన్పర్ లేకుండా పోయింది. కొత్త స్పాన్సర్స్ కోసం బీసీసీఐ త్వరలోనే టెండర్లను ఆహ్హానించనున్నట్లు ఇండియన్ ఎక్స్‌ప్రెస్ తమ కథనంలో పేర్కొంది.
"ఆన్‌లైన్ గేమింగ్ ప్రమోషన్ అండ్ రెగ్యులేషన్ బిల్లు- 2025 ఆమోదించబడిన తర్వాత బీసీసీఐ-డ్రీమ్ 11 మధ్య సంబంధాలను నిలిపివేస్తున్నాము. భవిష్యత్తులోనూ ఇలాంటి సంస్థలతో ఒప్పందం కుదుర్చుకోమని" దేవజిత్ సైకియా న్యూస్ ఏజెన్సీ ఎఎన్‌ఐతో పేర్కొన్నారు.
2023లో రూ. 358 కోట్లతో మూడేళ్ల కాలానికి బీసీసీఐతో ‘డ్రీమ్ 11’ ఒప్పందం కుదుర్చుకుంది. ఎడ్-టెక్ దిగ్గజం బైజూస్‌ను ‘డ్రీమ్ 11’ భర్తీ చేసింది. ఇప్పుడు ప్రభుత్వం నిర్ణయంతో డ్రీమ్ 11 అగ్రిమెంట్ మధ్యలోనే క్యాన్సిల్ అయింది.
ఇప్పుడు డ్రీమ్ 11 మధ్యలోనే నిష్క్రమించినప్పటి.. ఈ సంస్థపై భారత క్రికెట్ మండలి ఎలాంటి జరిమానా విధించడం లేదట. ఒప్పందం ప్రకారం చట్టపరమైన కారణాలతో మధ్యలో స్పాన్సర్‌షిప్‌ను వదిలేసినా.. ఎలాంటి జరిమానా పడకుండా నిబంధన ఉన్నట్లు పలు రిపోర్ట్‌లు పేర్కొంటున్నాయింది.