
ప్రపంచ యూత్ ఆర్చరీ చాంపియన్‌షిప్‌లో భారత్‌కు ప్రాతినిధ్యం వహించిన తెలంగాణ అమ్మాయి తనిపర్తి చికిత స్వర్ణ పతకంతో మెరిసింది. కెనడాలోని విన్నీపెగ్‌లో ఆదివారం ఈ మెగా ఈవెంట్ ముగిసింది. అండర్–21 మహిళల కాంపౌండ్ వ్యక్తిగత విభాగంలో చికిత విశ్వవిజేతగా అవతరించింది. పెద్దపల్లి జిల్లాకు చెందిన చికిత ఫైనల్లో 142–136 పాయింట్ల తేడాతో దక్షిణ కొరియాకు చెందిన యెరిన్ పార్క్‌పై విజయం సాధించింది.
అంతకుముందు సెమీఫైనల్లో చికిత 142–133తో మొరిలాస్ డియాజ్ (స్పెయిన్)పై, క్వార్టర్ ఫైనల్లో 146–143తో పర్ణీత్ కౌర్ (భారత్)పై గెలుపొందింది. క్వాలిఫయింగ్ రౌండ్‌లో చికిత 687 పాయింట్లు స్కోరు చేసి ఎనిమిదో స్థానంలో నిలిచి మెయిన్ ‘డ్రా’లో నేరుగా రెండో రౌండ్‌కు ‘బై’ పొందింది.
రెండో రౌండ్‌లో చికిత 143–140తో మా యువెన్ (చైనీస్ తైపీ)పై, ప్రిక్వార్టర్ ఫైనల్లో 142–138తో జిమెనా ఎ్రస్టాడా (మెక్సికో)పై గెలిచింది. అండర్–21 మహిళల కాంపౌండ్ టీమ్ విభాగంలో చికిత, పర్ణీత్ కౌర్, తేజల్‌లతో కూడిన భారత జట్టు క్వార్టర్ ఫైనల్లో వెనుదిరిగింది. క్వార్టర్ ఫైనల్లో భారత్ 229–232తో టర్కీ చేతిలో ఓడిపోయింది.