
When I came off the field after batting, I'd lost about 4.4 kilos" - Martin Guptill: ఎడారి దేశం యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌లో వేడిమి ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అక్కడ సాధారణ ఉష్ణోగ్రతలే 30 డిగ్రీలు దాటుతాయి. ఇక దుబాయ్‌లో ఈ ఏడాది ఇప్పటికే రికార్డు స్థాయిలో 50 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదైన సంగతి తెలిసిందే.
ఇలాంటి చోట మధ్యాహ్నం బయటకు రావాలంటే ‘చుక్కలు’ కనిపించడం ఖాయం. అలాంటిది గంటల కొద్దీ క్రీజులో నిలబడే క్రికెటర్ల పరిస్థితి ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. చెమటతో తడిసిపోక తప్పదు. ముఖ్యంగా ఆసియేతర దేశాల ఆటగాళ్లు ఈ వాతావరణ పరిస్థితులను తట్టుకోవడం కష్టమే. న్యూజిలాండ్ ఓపెనర్ మార్టిన్ గఫ్టిల్ కూడా ఇదే మాట అంటున్నాడు.
చెలరేగిన గప్టిల్
టీ20 ప్రపంచకప్-2021 టోర్నీ యూఏఈ వేదికగా జరుగుతున్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా నవంబరు 3న న్యూజిలాండ్... దుబాయ్ మైదానం(మధ్యాహ్నం మూడున్నరకు మ్యాచ్- 33 డిగ్రీల ఉష్ణోగ్రత)లో స్కాట్లాండ్‌తో తలపడింది. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్‌కు దిగిన కివీస్... గఫ్టిల్ చెలరేగడంతో 20 ఓవర్లలో 5 వికెట్లకు 172 పరుగులు చేసింది. ఇందులో గప్టిల్ ఒక్కడే 93 పరుగులు(56 బంతుల్లో) సాధించడం విశేషం. చాలా సేపు క్రీజులో నిలబడి జట్టు మెరుగైన స్కోరు చేయడంలో కీలక పాత్ర పోషించాడు.
ఇక ఈ మ్యాచ్‌లో కివీస్ 16 పరుగుల తేడాతో విజయం సాధించగా... గప్టిల్ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు అందుకున్నాడు. ఈ నేపథ్యంలో గప్టిల్ మాట్లాడుతూ.. ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. బ్యాటింగ్ చేస్తున్నంత సేపు చెమటపడుతూనే ఉందని.. దాదాపు నాలుగున్నర కిలోల బరువు కోల్పోయానన్నాడు. ‘‘మైదానంలోకి వచ్చిన తర్వాత ఉక్కపోత ఎక్కువైంది. 4.4 కిలోల బరువు కోల్పోయినట్లు అనిపించింది. దీంతో వెంటనే హైడ్రేటింగ్ ప్రక్రియ మొదలుపెట్టాను’’అని గప్టిల్ చెప్పుకొచ్చాడు.
యూఏఈ పరిస్థితులకు అలవాటు పడేందుకు ఇప్పటికీ ప్రయత్నిస్తున్నానని పేర్కొన్నాడు. ఇక మ్యాచ్ గురించి మాట్లాడుతూ... శుభారంభం లభించకపోయినా.. గ్లెన్ ఫిలిప్స్‌తో కలిసి మెరుగైన భాగస్వామ్యం(105 పరుగులు) నమోదు చేయడం కలిసి వచ్చిందన్నాడు. పరస్పర అవగాహనతో ముందుకు సాగామని.. స్వదేశంలోనూ పలు మ్యాచ్‌లలో మంచి పార్ట్‌నర్‌షిప్ సాధించామని గప్టిల్ చెప్పుకొచ్చాడు.
చదవండి: T20 WC 2021 Ind Vs Afg: అప్పుడైతే ఏకంగా 218.. ఆ మ్యాచ్‌లో 186.. రైనా ఒక్కడే సెంచరీతో..