
T20 WC 2022 IND Vs NED Updates: టీమిండియా ఆల్‌రౌండ్ షో.. చిత్తుగా ఓడిన పసికూన
టీమిండియా నిర్ధేశించిన 180 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన నెదర్లాండ్స్.. నిర్ణీత ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 123 పరుగులు మాత్రమే చేయగలిగింది. ఫలితంగా టీమిండియా 56 పరుగుల భారీ మార్జిన్‌తో విజయం సాధించింది. భారత బౌలర్లందరూ మూకుమ్మడిగా రాణించడంతో నెదర్లాండ్స్ భారీ తేడాతో ఓడింది.
భువీ 3 ఓవర్లలో 2 మెయిడిన్లు వేసి 2 వికెట్లు పడగొట్టగా.. అర్షదీప్, అక్షర్ పటేల్, అశ్విన్‌లు కూడా తలో 2 వికెట్లు తీశారు. షమీకి ఓ వికెట్ దక్కింది. అంతకుముందు రోహిత్ (53), కోహ్లి (62 నాటౌట్), సూర్యకుమార్ యాదవ్ (51 నాటౌట్) అర్ధశతకాలతో రాణించడంతో టీమిండియా నిర్ణీత ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 179 పరుగులు చేసింది.
తొమ్మిదో వికెట్ డౌన్.. ఓటమి అంచున నెదర్లాండ్స్
తొమ్మిదో వికెట్ కోల్పోయిన నెదర్లాండ్స్ ఓటమి అంచున నిలిచింది. 18వ ఓవర్‌లో అర్షదీప్ వరుసగా రెండు వికెట్లు పడగొట్టాడు. వాన్ బీక్ (3), ఫ్రెడ్ క్లాస్సెన్ (0)లను అర్షదీప్ వరుస బంతుల్లో పెవిలియన్‌కు పంపాడు. 18 ఓవర్ల తర్వాత నెదర్లాండ్స్ స్కోర్ 101/9.
17వ ఓవర్‌లో నెదర్లాండ్స్ ఏడో వికెట్ కోల్పోయింది. భువనేశ్వర్ కుమార్ బౌలింగ్‌లో హుడాకు క్యాచ్ ఇచ్చి ఎడ్వర్డ్స్ (5) ఔటయ్యాడు. 17 ఓవర్ల తర్వాత నెదర్లాండ్స్ స్కోర్ 96/7.
ఆరో వికెట్ డౌన్.. ఓటమి దిశగా నెదర్లాండ్స్
భారీ లక్ష్య ఛేదనలో నెదర్లాండ్స్ క్రమం తప్పకుండా వికెట్లు కోల్పోతూ ఓటమి దిశగా పయనిస్తుంది. 16వ ఓవర్‌లో ఆ జట్టు ఆరో వికెట్ కోల్పోయింది. షమీ బౌలింగ్‌లో కోహ్లికి క్యాచ్ ఇచ్చి టిమ్ ప్రింగిల్ (20) ఔటయ్యాడు. 16 ఓవర్ల తర్వాత నెదర్లాండ్స్ స్కోర్ 87/6.
63 పరుగులకే సగం వికెట్లు కోల్పోయిన నెదర్లాండ్స్
13వ ఓవర్‌లో అశ్విన్ మరో వికెట్ పడగొట్టాడు. టామ్ కూపర్ (9) సబ్‌స్టిట్యూట్ ఫీల్డర్ దీపర్ హుడాకు క్యాచ్ ఇచ్చి ఐదో వికెట్‌గా వెనుదిరిగాడు. 13 ఓవర్ల తర్వాత నెదర్లాండ్స్ స్కోర్ 64/5.
నాలుగో వికెట్ డౌన్.. ఈసారి అశ్విన్ ఖాతాలోకి
నెదర్లాండ్స్ జట్టు వరుస క్రమంలో వికెట్లు కోల్పోతుంది. 13వ ఓవర్ తొలి బంతికి ఆ జట్టు నాలుగో వికెట్ కోల్పోయింది. అశ్విన్ బౌలింగ్‌లో అక్షర్ పటేల్‌కు క్యాచ్ ఇచ్చి అకెర్‌మన్ (17) ఔటయ్యాడు.
మూడో వికెట్ కోల్పోయిన నెదర్లాండ్స్
భారీ లక్ష్య ఛేదనలో నెదర్లాండ్స్ వరుసగా వికెట్లు కోల్పోతుంది. 10వ ఓవర్‌లో ఆ జట్టు మూడో వికెట్ కోల్పోయింది. బాస్ డి లీడ్ (16).. అక్షర్ పటేల్ బౌలింగ్‌లో హార్ధిక్‌కు క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. 9.2 ఓవర్ల తర్వాత నెదర్లాండ్స్ స్కోర్ 47/3.
5 ఓవర్ల తర్వాత నెదర్లాండ్స్ స్కోర్ 22/2
180 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన నెదర్లాండ్స్.. ఆరంభంలోనే రెండు వికెట్లు కోల్పోయి కష్టాల్లో చిక్కుకుంది. అక్షర్ పటేల్, భువీ చెరో వికెట్ పడగొట్టారు. 5 ఓవర్ల తర్వాత నెదర్లాండ్స్ స్కోర్ 22/2. బాస్ డి లీడ్ (3), అకెర్‌మన్ (1) క్రీజ్‌లో ఉన్నారు.
తొలి వికెట్ కోల్పోయిన నెదర్లాండ్స్.. 3 ఓవర్లలో స్కోరు 11-1
భువనేశ్వర్ కుమార్ నెదర్లాండ్స్‌తో మ్యాచ్‌లో తొలి వికెట్ తన ఖాతాలో వేసుకున్నాడు. డచ్ ఓపెనర్ విక్రమ్‌జిత్ సింగ్ భువీ బౌలింగ్‌లో తొలి వికెట్‌గా వెనుదిరిగాడు. కేవలం ఒకే ఒక్క పరుగు చేసి నిష్క్రమించాడు.
చెలరేగిన భారత బ్యాటర్లు.. నెదర్లాండ్స్ లక్ష్యం 180 పరుగులు
టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా నిర్ణీత 20 ఓవర్లలో రెండు వికెట్లు కోల్పోయి 179 పరుగులు సాధించింది. భారత బ్యాటర్లలో విరాట్ కోహ్లి(62 నాటౌట్), రోహిత్ శర్మ(53), సూర్యకుమార్ యాదవ్(51 నాటౌట్) అర్ద సెంచరీలతో చెలరేగారు. మరో స్టార్ బ్యాటర్ కేఎల్ రాహుల్ మాత్రం కేవలం 9 పరుగులు మాత్రమే చేసి నిరాశ పరిచాడు. ఇక నెదర్లాండ్స్ బౌలర్లలో వాన్ మీకెరెన్, క్లాసన్ తలా వికెట్ సాధించారు.
కోహ్లి హాఫ్ సెంచరీ
అత్యుత్తమ ఫామ్‌లో ఉన్న కోహ్లి.. వరల్డ్‌కప్‌లో వరుసగా రెండో హాఫ్ సెంచరీ బాదాడు. క్లాస్సెన్ బౌలింగ్ సింగల్ తీసిన కోహ్లి.. కెరీర్‌లో 35వ హాఫ్ సెంచరీ నమోదు చేశాడు. 17 ఓవర్ల తర్వాత టీమిండియా స్కోర్ 144/2.
15 ఓవర్ల తర్వాత టీమిండియా స్కోర్ 114/2
రోహిత్ శర్మ ఔటైన తర్వాత గేర్ మార్చిన విరాట్ కోహ్లి (32) వేగంగా పరుగులు సాధిస్తున్నాడు. మరో ఎండ్‌లో సూర్యకుమార్ (17) సైతం ధాటిగా ఆడుతున్నాడు. ఫలితంగా భారత్ 15 ఓవర్లు ముగిసే సమయానికి 114/2 స్కోర్ చేసింది.
హాఫ్ సెంచరీ పూర్తియిన వెంటనే ఔటైన రోహిత్
టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ హాఫ్ సెంచరీ పూర్తయిన వెంటనే ఔటయ్యాడు. క్లాస్సెన్ బౌలింగ్‌లో అకెర్‌మన్‌కు సునాయసమైన క్యాచ్ ఇచ్చి పెవిలియన్‌కు చేరాడు. రోహిత్ 39 బంతుల్లో 4 ఫోర్లు, 3 సిక్సర్ల సాయంతో 53 పరుగులు చేశాడు. 12 ఓవర్ల తర్వాత టీమిండియా స్కోర్ 84/2. కోహ్లి, సూర్యకుమార్ క్రీజ్‌లో ఉన్నారు.
హిట్‌మ్యాన్ ఫిఫ్టి
టిమ్ ప్రింగిల్ బౌలింగ్‌లో వరుస బౌండరీలు బాది రోహిత్ శర్మ హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. హిట్‌మ్యాన్ 35 బంతుల్లో 4 ఫోర్లు, 3 సిక్సర్ల సాయంతో ఈ ఫీట్‌ను సాధించాడు.
ఆచితూచి ఆడుతున్న టీమిండియా
చిన్న జట్టు అయినప్పటికీ ఆదిలోకి వికెట్ పడటంతో టీమిండియా డిఫెన్సివ్‌గా ఆడుతుంది. 10 ఓవర్ల తర్వాత జట్టు స్కోర్ 67/1గా ఉంది. రోహిత్ శర్మ (42), కోహ్లి (14) క్రీజ్లో ఉన్నారు.
పవర్‌ప్లేలో టీమిండియా స్కోరు: 32-1
రోహిత్, కోహ్లి క్రీజులో ఉన్నారు. వరుసగా రెండుసార్లు క్యాచ్ డ్రాప్ చేయడంతో రోహిత్‌కు లైఫ్ లభించింది.
5 ఓవర్ల తర్వాత టీమిండియా స్కోర్ ఎంతంటే..
18 పరుగులకే తొలి వికెట్ కోల్పోయిన టీమిండియా ఆ తర్వాత ఆచితూచి ఆడుతుంది. 5 ఓవర్లు ముగిసే సమయానికి టీమిండియా వికెట్ నష్టానికి 28 పరుగులు చేసింది. రోహిత్ శర్మ (15), విరాట్ కోహ్లి (3) క్రీజ్లో ఉన్నారు.
తొలి వికెట్ కోల్పోయిన టీమిండియా
కేఎల్ రాహుల్ రూపంలో భారత్ తొలి వికెట్ కోల్పోయింది. మీకెరెన్ బౌలింగ్‌లో కేఎల్ రాహుల్ ఎల్బీడబ్ల్యూగా వెనుదిరిగాడు. 3 ఓవర్లలో భారత్ స్కోరు: 18-1
టీ20 వరల్డ్‌కప్-2022 సూపర్-12 గ్రూప్-2లో భాగంగా ఇవాళ (అక్టోబర్ 27) భారత్-నెదర్లాండ్స్ జట్లు తలపడుతున్నాయి. టీమిండియా తమ తొలి మ్యాచ్‌లో పాక్‌ను మట్టికరిపించిన ఉత్సాహంతో బరిలోకి దిగుతుండగా.. తొలి మ్యాచ్‌లో బంగ్లాదేశ్ చేతిలో ఖంగుతిన్న నెదర్లాండ్స్, ఇవాల్టి మ్యాచ్‌లో భారత్‌కు కనీస పోటీ ఇవ్వాలని భావిస్తుంది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన టీమిండియా తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది.
తుది జట్లు..
భారత్: కేఎల్ రాహుల్, రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి, సూర్యకుమార్ యాదవ్, హార్ధిక్ పాండ్యా, దినేశ్ కార్తీక్, అక్షర్ పటేల్, రవిచంద్రన్ అశ్విన్, భువనేశ్వర్ కుమార్, మహ్మద్ షమీ, అర్షదీప్ సింగ్
నెదర్లాండ్స్: విక్రమ్‌జిత్ సింగ్, మ్యాక్స్ ఓడౌడ్, బాస్ డి లీడ్, కొలిన్ అకెర్‌మన్, టామ్ కూపర్, స్కాట్ ఎడ్వర్డ్స్, టిమ్ ప్రింగిల్, లొగాన్ వాన్ బీక్, షరిజ్ అహ్మద్, ఫ్రెడ్ క్లాసెన్, పాల్ వాన్ మీకెరెన్