David Warner: వార్నర్‌పై వేటు

SunRisers Hyderabad removed David Warner Captaincy - Sakshi

కెప్టెన్సీ నుంచి తప్పించిన సన్‌రైజర్స్‌

తుది జట్టులో చోటూ కష్టమే!

విలియమ్సన్‌కు నాయకత్వ బాధ్యతలు

సాక్షి, హైదరాబాద్‌: ఐపీఎల్‌ పాయింట్ల పట్టికలో అట్టడుగున నిలిచిన సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ సాహసోపేత నిర్ణయం తీసుకుంది. జట్టుకు మూలస్థంభంవంటి డేవిడ్‌ వార్నర్‌ను కెప్టెన్సీ నుంచి తప్పించింది. అతని స్థానంలో లీగ్‌లో మిగిలిన మ్యాచ్‌లకు కేన్‌ విలియమ్సన్‌ కెప్టెన్‌గా వ్యవహరిస్తాడని ప్రకటించింది. ఇప్పటి వరకు సన్‌రైజర్స్‌ 6 మ్యాచ్‌లు ఆడి ఐదింటిలో ఓడిపోయి కేవలం ఒక మ్యాచ్‌లో గెలిచింది.

తమ అధికారిక ప్రకటనలో వార్నర్‌ను కెప్టెన్సీ నుంచి తొలగించడంపై సన్‌రైజర్స్‌ యాజమాన్యం ఎలాంటి కారణాన్ని వెల్లడించలేదు. ఆదివారం రాజస్తాన్‌ రాయల్స్‌తో జరిగే మ్యాచ్‌ నుంచి సీజన్‌ ముగిసేవరకు విలియమ్సన్‌ కెప్టెన్‌గా వ్యవహరిస్తాడని మాత్రమే పేర్కొంది. అయితే ఈ నిర్ణయం అంత సులువుగా తీసుకోలేదని, సుదీర్ఘ కాలంగా జట్టులో కీలకపాత్ర పోషించిన వార్నర్‌ అంటే తమకు గౌరవం ఉందన్న ఫ్రాంచైజీ... మున్ముందు జట్టు పురోగతిలో అతను కూడా కీలకపాత్ర పోషిస్తాడని భావిస్తున్నట్లు స్పష్టం చేసింది.
 
యాజమాన్యం అసంతృప్తి...
బుధవారం చెన్నైతో మ్యాచ్‌ ఓడిన తర్వాత వార్నర్‌ కీలక వ్యాఖ్యలు చేశాడు. ఈ మ్యాచ్‌లో అర్ధ సెంచరీ చేసినా... వార్నర్‌ తన శైలికి భిన్నంగా చాలా నెమ్మదిగా ఆడాడు. ఈ పరాజయానికి తనదే పూర్తి బాధ్యత అని వార్నర్‌ చెప్పాడు. తన బ్యాటింగ్‌ తీరు తీవ్ర అసహనం కలిగించిందంటూ ఓటమి భారాన్ని తనపైనే వేసుకున్నాడు. ఈ మ్యాచ్‌లో మనీశ్‌ పాండే కూడా హాఫ్‌ సెంచరీ చేశాడు. అయితే దీనికి ముందు ఢిల్లీ చేతిలో ఓడినప్పుడు పాండే గురించి వార్నర్‌ చేసిన వ్యాఖ్య యాజమాన్యానికి ఆగ్రహం తెప్పించినట్లు సమాచారం.

‘పాండేను సెలక్టర్లు పక్కన పెట్టడం తప్పుడు నిర్ణయం’ అంటూ అతను వ్యాఖ్యానించాడు. లీగ్‌ క్రికెట్‌లో సెలక్టర్లు అంటూ ప్రత్యేకంగా ఉండరు కాబట్టి పాండేను తప్పించాలనేది టీమ్‌ యాజమాన్యం నిర్ణయమే కావచ్చు. దీనిని విభేదించడంతో పాటు బ్యాటింగ్‌లో కూడా వార్నర్‌ తడబడుతుండటంతో రైజర్స్‌ యాజమాన్యం ఇదే అవకాశంగా అతడిని కెప్టెన్సీ నుంచి తొలగించాలని భావించి ఉండవచ్చు. ఆరు మ్యాచ్‌లలో అతని స్కోర్లు 3, 54, 36, 37, 6, 57గా ఉండగా స్ట్రయిక్‌రేట్‌ 110.28గా ఉంది.  

విజయవంతమైన కెప్టెన్‌...
వార్నర్‌ నాలుగు సీజన్లలో జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరించాడు. 2016లో ఒంటి చేత్తో టీమ్‌కు టైటిల్‌ అందించగా మరో రెండుసార్లు (2017, 2020) టీమ్‌ ప్లే ఆఫ్స్‌కు చేరింది. అతను తొలిసారి కెప్టెన్‌గా వ్యవహరించిన 2015లో మాత్రమే ఆరో స్థానంలో నిలిచింది. అతని నాయకత్వంలో హైదరాబాద్‌ 69 మ్యాచ్‌లలో 35 గెలిచి, 32 ఓడింది. 2018లో వార్నర్‌పై నిషేధం ఉన్నప్పుడు కేన్‌ విలియమ్సన్‌ కెప్టెన్‌గా వ్యవహరించి జట్టును ఫైనల్‌ చేర్చాడు. తర్వాతి ఏడాది వార్నర్‌ ఆటగాడిగా తిరిగొచ్చినా... కెప్టెన్‌గా విలియమ్సన్‌ కొనసాగాడు. 26 మ్యాచ్‌లకు విలియమ్సన్‌ కెప్టెన్‌గా వ్యవహరించగా జట్టు 14 గెలిచి 12 ఓడింది.

పక్కన పెడతారా...
528, 562, 848, 641, 692, 548... 2014 నుంచి సన్‌రైజర్స్‌ తరఫున ఆడిన ఆరు సీజన్లలో డేవిడ్‌ వార్నర్‌ లీగ్‌ స్కోర్లు ఇవి. ప్రతీ సీజన్‌లో జట్టు తరఫున అతనే టాప్‌స్కోరర్‌గా నిలిచాడు. బ్యాట్స్‌ మన్‌గా అతని రికార్డు ఘనం. రైజర్స్‌ అంటే వార్నర్‌ మాత్రమే అన్నట్లుగా అతని బ్యాటింగ్‌ జోరు కొనసాగింది. వార్నర్‌ విఫలమైతే మ్యాచ్‌ ఓడిపోయినట్లే అని సగటు జట్టు అభిమాని ఎవరైనా చెప్పగలరంటే అతని ప్రభావం ఏమిటో అర్థమవుతుంది.

ఆదివారం జరిగే మ్యాచ్‌లో విదేశీ ఆటగాళ్ల విషయంలో కూడా మార్పులు చేర్పులు ఉంటాయని ఫ్రాంచైజీ ప్రకటించడం చూస్తే వార్నర్‌ను టీమ్‌ నుంచే పక్కన పెట్టేందుకు సిద్ధమైనట్లు అర్థమవుతోంది. రిజర్వ్‌లో ఇంగ్లండ్‌ ఆటగాడు జేసన్‌ రాయ్‌ అందుబాటులో ఉన్నాడు. నేరుగా వార్నర్‌ స్థానంలో రాయ్‌కు అవకాశం కల్పించవచ్చు. ప్రస్తుతం ప్రపంచంలో అత్యుత్తమ ఓపెనింగ్‌ జోడీగా ఉన్న బెయిర్‌స్టో, రాయ్‌ తమ రాత మార్చగలరని హైదరాబాద్‌ భావిస్తోంది. నిజానికి  సన్‌రైజర్స్‌ అసలు సమస్య జట్టు మిడిలార్డర్‌ బ్యాటింగ్‌లో ఉంది.

సమద్, కేదార్‌ జాదవ్, విరాట్‌ సింగ్, విజయ్‌ శంకర్, అభిషేక్‌ శర్మ... ఇలాంటి బ్యాట్స్‌మెన్‌తో జట్టు గెలవాలని కోరుకోవడం అత్యాశే అవుతుంది. పైగా భువనేశ్వర్, నటరాజన్‌లాంటి బౌలర్లు గాయాలతో దూరమయ్యారు. ఇలాంటి స్థితిలో కెప్టెన్సీ మార్పుతో రైజర్స్‌ ఫలితాలు సాధిస్తుందంటే నమ్మడం కష్టం. కాబట్టి టీమ్‌ ఫలితం, బ్యాటింగ్‌ ఫామ్‌ మాత్రమే కాకుండా ఇతర కారణాలతోనే వార్నర్‌ను తప్పించారనేది స్పష్టం. కొన్నిసార్లు విఫలమైనా... ఒక్క ఇన్నింగ్స్‌తో అతని స్థాయి ఆటగాళ్లు మళ్లీ ఫామ్‌లోకి రాగలరు. పైన చెప్పిన ఆటగాళ్లు మైదానంలో ఆడుతూ వార్నర్‌ డగౌట్‌కు పరిమితం కావడం అంటే సన్‌రైజర్స్‌ ఎలాంటి తప్పుడు నిర్ణయం తీసుకుంటోందో అర్థమవుతుంది.

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top