‘అమ్మాయిలూ మీరు పతకం తేండి.. ఇల్లు.. కారు నేనిస్తా’

Savji Dholakia Announced House Or Car For Indian Women Hockey Players - Sakshi

అహ్మదాబాద్‌: ఒలింపిక్స్‌ పోటీల్లో భారతీయ క్రీడాకారులు సత్తా చాటుతున్నారు. ముఖ్యంగా అమ్మాయిలు వీరోచితంగా పోరాడుతున్నారు. ఇప్పటివరకు ఐదు పతకాలు రాగా వాటిలో మూడు అమ్మాయిలు సాధించినవే. తాజాగా ఈ పోటీల్లో భారత మహిళల హాకీ జట్టు ఆశలు కల్పిస్తోంది. సెమీ ఫైనల్‌కు వెళ్లిన రాణి జట్టు ఎలాగైనా పతకం సాధించాలనే పట్టుతో ఉంది. ఇప్పటికే పురుషుల హాకీ జట్టు నాలుగు దశాబ్దాల అనంతరం ఒలింపిక్‌ పతకం సొంతం చేసుకుంది. ఇప్పుడు మహిళలపై ఆశలు భారీగా పెరిగాయి. ఈ క్రమంలో ఆ అమ్మాయిలకు నగదు ప్రోత్సహాకాలు, కానుకల ఆఫర్లు వెల్లువలా వస్తున్నాయి.

తాజాగా గుజరాత్‌కు చెందిన ప్రముఖ వజ్రాల వ్యాపారి, హెచ్‌కే గ్రూప్‌ అధినేత సావ్జీ ఢోలాకియా అమ్మాయిల హాకీ జట్టుకు వరాలు ప్రకటించారు. ‘మీరు పతకం తీసుకురండి.. మీకు ఇల్లు లేదా కారు ఇస్తా’ అని ప్రకటించారు. అమ్రేలీ జిల్లాలోని ధుహల గ్రామానికి చెందిన ధోలాకియా హరికృష్ణ ఎక్స్‌పోర్ట్స్‌ కంపెనీ ప్రారంభించి ప్రస్తుతం రూ.7 వేల కోట్ల టర్నోవర్‌ పొందుతున్నారు. మొదటిసారి మహిళల జట్టు సెమీ ఫైనల్‌కు చేరింది. 130 కోట్ల భారతీయుల కలను మోస్తున్నారు. నేను వారికి అందించే ఇది చిన్న సహాయం. ఇది వారి నైతిక సామర్థ్యం పెంపునకు.. ప్రోత్సాహానికి దోహదం చేస్తుందని భావిస్తున్నా. 

రజత పతక విజేత మీరాబాయి చానును స్ఫూర్తిగా తీసుకున్నట్లు తెలిపారు. అతి చిన్న ఇంట్లో ఉంటూనే చాను ఒలింపిక్స్‌లో పతకం సాధించింది. ఈ నేపథ్యంలోనే హాకీ క్రీడాకారులకు రూ.11 లక్షలు ఇంటి నిర్మాణం కోసం ఇస్తున్నట్లు ధోలాకియా వివరించారు. ఇల్లు వద్దనుకునే వారికి కారు కొనుగోలు కోసం రూ.5 లక్షలు ఇవ్వనున్నట్లు తెలిపారు. దీంతోపాటు తన స్నేహితుడు డాక్టర్‌ కమలేశ్‌ డేవ్‌ ప్రతీ క్రీడాకారుడికి రూ.లక్ష నగదు బహుమతి ఇచ్చేందుకు ముందుకు వచ్చారని తెలిపారు. ధొలాకియా తన సంస్థలోని ఉద్యోగులను కుటుంబసభ్యుల్లాగా చూసుకుంటారు. ప్రతి దీపావళికి ఉద్యోగులకు భారీ కానుకలు ఇస్తుంటారు. చాలాసార్లు ఉద్యోగులకు ఖరీదైన కార్లు, ఆభరణాలు, ప్లాట్లు ఇచ్చిన విషయం తెలిసిందే. 
 

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top