Abhinav Bindra: బుల్లెట్‌ దిగింది..

Sakshi Funday Special Story On Abhinav Bindra

అచీవర్స్‌

2000 సిడ్నీ ఒలింపిక్స్‌.. 18 ఏళ్ల వయసులో పతకం ఆశలతో బరిలోకి దిగిన అతనికి ఏదీ కలిసి రాలేదు. చివరకు దక్కింది 11వ స్థానం. కనీసం ఫైనల్స్‌కు కూడా అర్హత సాధించలేదు. 2004 ఏథెన్స్‌ ఒలింపిక్స్‌.. ఈసారి తన ఆట ఎంతో మెరుగైందని భావిస్తూ లక్ష్యం దిశగా ముందుకెళ్లాడు.. కానీ ఈసారి 7వ స్థానంతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది!

ఒక వ్యక్తిగత క్రీడాంశంలో, అదీ మానసికంగా ఎంతో దృఢంగా  ఉండాల్సిన ఆటలో, రెండు ఒలింపిక్స్‌లో వరుస వైఫల్యాల తర్వాత వెంటనే కోలుకొని తర్వాతి నాలుగేళ్ల కాలానికి లక్ష్యాలు పెట్టుకొని సిద్ధం కావడం అంత సులువు కాదు. కానీ ఆ ఆటగాడి పట్టుదల ముందు ప్రతికూలతలన్నీ తలవంచాయి. 

బీజింగ్‌లో అతని బుల్లెట్‌ గురి తప్పలేదు. సరిగ్గా టార్గెట్‌ను తాకి పసిడి పతకాన్ని అతని మెడలో వేసింది. ఒలింపిక్స్‌ చరిత్రలో ఏ భారత ఆటగాడికి సాధ్యం కాని ఘనతను అందించింది. ఆ శూరుడే అభినవ్‌ బింద్రా. ఒలింపిక్స్‌లో వ్యక్తిగత విభాగంలో స్వర్ణం గెలిచిన తొలి భారతీయుడు.

ఆటలో అద్భుతాలు చేయగానే మనలో చాలా మందికి సహజంగానే అతని నేపథ్యంపైనే ఆసక్తి పెరుగుతుంది. అయితే విజయగాథలన్నీ పేద కుటుంబం నుంచో, మధ్యతరగతి కుటుంబాల నుంచో మొదలు కావాలనేం లేదు.. కోటీశ్వరుడైనా క్రీడల్లోకి వెళితే స్కోరు సున్నా నుంచే మొదలవుతుంది. అందుకే ఎక్కువగా వినిపించే సాధారణ స్థాయి నుంచి శిఖరానికెదిగిన లాంటి కథ కాదు బింద్రా జీవితం.

అతను ఐశ్వర్యంలో పుట్టాడు. దేశంలోనే టాప్‌ స్కూల్లో ఒకటైన ‘డూన్‌ స్కూల్‌’లో చదువుకున్నాడు. ఉన్నత విద్యను అమెరికాలోని కొలరాడో యూనివర్సిటీలో అభ్యసించాడు. తిరిగొచ్చి తండ్రి వ్యాపార సామ్రాజ్యాన్ని నడిపించడమే తరవాయి.. కానీ బింద్రా మరో బాటను ఎంచుకున్నాడు. అది కూడా సరదా కోసమో, వ్యాపారంలో అలసిపోయాక వారాంతంలో టైమ్‌ పాస్‌గా ఆడుకునేందుకో కాదు.

ఆటలో అగ్రస్థానానికి చేరేందుకు అడుగు పెట్టాడు. అందుకే పగలు, రాత్రి కష్టపడ్డాడు. ఒక వ్యాపారవేత్తగా సాధించే కోట్లతో పోలిస్తే అంతకంటే విలువైన దానిని అందుకున్నాడు. కోట్లాది భారతీయుల ప్రతినిధిగా, వారంతా గర్వపడేలా తన రైఫిల్‌తో సగర్వంగా విశ్వ క్రీడా వేదికపై జనగణమన వినిపించాడు. 

చిరస్మరణీయం
డబ్బుంటే చాలు క్రీడల్లోకి వెళ్లిపోవడం చాలా సులువు అనే అభిప్రాయం మన దేశంలో బలంగా పాతుకుపోయింది. నిజానికి అలాంటి వాళ్లు ఆటల్లో రాణించాలంటే ఇతరులతో పోలిస్తే ఎన్నో రెట్లు ఎక్కువ ప్రేరణ ఉండాలి.

అన్నీ అందుబాటులో ఉన్నప్పుడు ఏదైనా సాధించాలనే లక్ష్యం, పట్టుదల కొత్తగా పుట్టుకురావాలి. సరిగ్గా చెప్పాలంటే చుట్టూ ఉన్న సకల సౌకర్యాలు, విలాసాలకు ఆకర్షితులవకుండా ఏకాగ్రత చెదరకుండా పోటీల్లో దిగాలి. అలా చూస్తే మా అభినవ్‌ సాధించిన ఘనత అసాధారణం.

దాని విలువ అమూల్యం’ బింద్రా స్వర్ణ పతకం సాధించిన తర్వాత అతని కుటుంబ మిత్రుడొకరు చేసిన వ్యాఖ్య ఇది. నిజంగానే ఆ సమయంలో గానీ, ఆ తర్వాత గానీ బింద్రా.. తన నేపథ్యం వల్లే ఎదిగాడనే మాటను చెప్పేందుకు ఏ ఒక్కరూ సాహసించలేదు. ఎందుకంటే 2008 ఆగస్టు 11న బీజింగ్‌ ఒలింపిక్స్‌లో బింద్రా స్వర్ణ పతకం గెలుచుకున్నాడనే వార్త విన్న తర్వాత హృదయం ఉప్పొంగని భారతీయుడు లేడంటే అతిశయోక్తి కాదు.

ఎప్పుడో 1980 మాస్కో ఒలింపిక్స్‌లో అదీ టీమ్‌ గేమ్‌ హాకీలో భారత జట్టు చివరిసారిగా స్వర్ణం సాధించిందని జనరల్‌ నాలెడ్జ్‌ పుస్తకాల్లో, క్విజ్‌ పోటీల్లో వింటూ వచ్చిన కొత్త తరానికి ఒలింపిక్స్‌ గోల్డ్‌ మెడల్‌ విలువేమిటో అప్పుడే తెలిసింది. 

ఇల్లే షూటింగ్‌ రేంజ్‌గా..
షూటింగ్‌ ధనవంతులు మాత్రమే ఆడుకునే ‘ఎలీట్‌ పీపుల్స్‌ గేమ్‌’. ఇందులో వంద శాతం వాస్తవం ఉంది. గన్స్‌ మొదలు పోటీల్లో వాడే బుల్లెట్స్, జాకెట్, అనుమతులు, పన్నులు.. ఇలా అన్నీ బాగా డబ్బులతో కూడుకున్న వ్యవహారమే. అభినవ్‌ తండ్రి అప్‌జిత్‌ బింద్రా పెద్ద వ్యాపారవేత్త. పంజాబ్‌లో ఆగ్రో ఫుడ్‌ బిజినెస్, హోటల్స్‌ వ్యాపారంలో పెద్ద పేరు గడించాడు.

కొడుకు తాను షూటింగ్‌ ప్రాక్టీస్‌కు వెళతానని చెబితే తొలుత ఆయన కూడా సరదా వ్యాపకంగానే చూశాడు. కానీ అభినవ్‌ మొదటి రోజు నుంచి కూడా దానిని ప్రొఫెషనల్, కాంపిటీటివ్‌ స్పోర్ట్‌గానే భావించాడు. అందుకే సాధన మాత్రమే కాదని ఫలితాలు కూడా ముఖ్యమని అతని మనసులో బలంగా నాటుకుపోయింది. అందుకే తన అభిప్రాయాన్ని నిక్కచ్చిగా చెప్పేశాడు. దాంతో తండ్రికి కూడా కొడుకు లక్ష్యాలపై స్పష్టత వచ్చింది.

అందుకే ప్రోత్సహించేందుకు సిద్ధమైపోయాడు. చండీగఢ్‌లోని తమ ఇంట్లోనే అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో కూడిన షూటింగ్‌ రేంజ్‌ ఏర్పాటు చేసేశాడు. అభినవ్‌కు 24 గంటలు అదే అడ్డా అయింది. అన్నీ మరచి ప్రాక్టీస్‌లోనే మునిగాడు. జాతీయ స్థాయిలో వరుస విజయాలతో భారత జట్టులో చోటు దక్కింది. 1998 కామన్వెల్త్‌ క్రీడల్లో పతకం రాకున్నా, భారత్‌ నుంచి పాల్గొన్న పిన్న వయస్కుడిగా (16 ఏళ్లు) గుర్తింపు పొందాడు.  

2002 కామన్వెల్త్‌ క్రీడల్లో తొలి పతకం వచ్చినా అది ‘పెయిర్స్‌’ విభాగంలో కాబట్టి అంతగా సంతృప్తినివ్వలేదు. రెండు ఒలింపిక్స్‌ వచ్చి పోయాయి కానీ ఫలితం దక్కలేదు. ఏదైనా సాధించాలనే తపన పెరిగిపోతోంది కానీ సాధ్యం కావడం లేదు. 2005కు వచ్చే సరికి వెన్ను గాయం దెబ్బ కొట్టింది. దాదాపు ఏడాది పాటు గన్‌ కూడా ఎత్తలేకపోయాడు. 

ప్రాక్టీస్‌.. ప్రాక్టీస్‌..
తేదీలు మారుతున్నా పెద్ద ఘనత సాధించలేకపోవడంతో బింద్రా మనసులో మథనం మొదలైంది. తాను ఎక్కడ వెనుకబడుతున్నాడో గుర్తించాడు. అసాధారణమైన ఏకాగ్రత అవసరం ఉండే క్రీడ షూటింగ్‌. మిల్లీ సెకండ్‌ దృష్టి చెదిరినా పతకం సాధించే స్థితినుంచి నేరుగా పాతాళానికి పడిపోవచ్చు. దీనిని అధిగమించాలంటే మన దేశంలో అందుబాటులో లేని ప్రత్యేక శిక్షణ తనకు ఎంతో అవసరం అనిపించింది.

అందుకే జర్మనీ చేరుకున్నాడు. ఏడాదికి పైగా విరామం లేకుండా అత్యున్నత స్థాయి కోచ్‌ల వద్ద సాధనలో రాటుదేలాడు. మొదటి ఫలితం 2006, ఆగస్ట్‌.. వరల్డ్‌ చాంపియన్‌షిప్‌లో స్వర్ణంతో వచ్చింది. ఆ ఘనత సాధించిన తొలి భారతీయుడిగా అతను నిలిచాడు. ఈ గెలుపు సరిగ్గా రెండేళ్ల తర్వాత అందుకున్న ఒలింపిక్స్‌ పతకానికి తొలి అడుగుగా నిలిచింది.

ఈ రెండేళ్లలో అతను మరింతగా కష్టపడ్డాడు. బీజింగ్‌లో షూటింగ్‌ పోటీలు ఎలా ఉంటాయనేదానిపై పూర్తి స్థాయిలో అక్కడ ఉండే వాతావరణం సహా రిహార్సల్స్‌ చేశాడు. ఎంతగా అంటే మైక్‌లో అనౌన్సర్‌ పేరు చెప్పినప్పుడు తాను పోటీలో వేసుకునే షూస్‌తో ఎలా నడవాలి అనే సూక్ష్మమైన అంశాలను కూడా వదిలిపెట్టనంతగా. చివరకు తన లక్ష్యం చేరడంలో సఫలమయ్యాడు. 

అవార్డులు, రివార్డులు..
సుమారు రెండు దశాబ్దాల కెరీర్‌లో బింద్రా 150కి పైగా పతకాలు గెలిచాడు. భారత ప్రభుత్వం అతడిని క్రీడా పురస్కారాలు అర్జున, ఖేల్‌రత్నలతో పాటు పౌర పురస్కారం పద్మభూషణ్‌తో సత్కరించింది. భారత ఆర్మీలో గౌరవ లెఫ్టినెంట్‌ హోదా కూడా బింద్రాకు ఉంది. ‘ఎ షాట్‌ ఎట్‌ హిస్టరీ – మై ఆబ్సెసివ్‌ జర్నీ టు ఒలింపిక్‌ గోల్డ్‌’ పేరుతో బింద్రా ఆటోబయోగ్రఫీ పుస్తకరూపంలో వచ్చింది. 
ఆట తర్వాతా ఆటతోనే..
గన్‌ పక్కన పెట్టేసిన తర్వాత బింద్రా క్రీడలతో తన అనుబంధం కొనసాగిస్తున్నాడు. సాధారణంగా రిటైరయ్యేవాళ్లు ఒక కోచ్‌గానో, లేక క్రీడా సమాఖ్యల్లో పరిపాలకులుగానో తమ పాత్రను నిర్వర్తించేందుకు సిద్ధమైపోతారు. బింద్రా కూడా కోచింగ్‌ వైపు దృష్టి పెడితే స్పందన కూడా అద్భుతంగా ఉండేది. కానీ ఇక్కడా అతను భిన్నమైన మార్గాన్నే ఎంచుకున్నాడు.

ఒక షూటింగ్‌కు మాత్రమే పరిమితం కాకుండా అన్ని రకాల క్రీడాంశాలకు సంబంధించి ఒక కీలక అంశాన్ని అతను ఎంచుకున్నాడు. ఎంతో ప్రతిభ, సత్తా ఉన్నా కీలక సమయాల్లో విశ్వవేదికపై మన భారతీయులు వెనుకబడుతున్న విషయాన్ని అతను గుర్తించాడు. అందుకే ఈతరం పోటీ ప్రపంచంలో ‘స్పోర్ట్స్‌ సైన్స్‌’పై దృష్టి పెట్టాడు.

బింద్రా నేతృత్వంలో పని చేస్తున్న ‘అభినవ్‌ ఫ్యూచరిస్టిక్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌’ భారత క్రీడల్లో సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ వాడకంపై సహకారం అందిస్తుంది. ‘అభినవ్‌ బింద్రా టార్గెటింగ్‌ పెర్ఫార్మెన్స్‌’ ద్వారా అడ్వాన్స్‌డ్‌ ఫిజియోథెరపీ, రీహాబిలిటేషన్‌ లో ప్రత్యేక శిక్షణ ఉంటుంది. భువనేశ్వర్‌లో అభినవ్‌ బింద్రా స్పోర్ట్స్‌ మెడిసిన్‌ అండ్‌ రీసెర్చ్‌ ఇన్‌ స్టిట్యూట్‌ కూడా పని చేస్తోంది. ఇక తన పేరుతో ఏర్పాటు చేసిన ఫౌండేషన్‌

ప్రాథమిక స్థాయిలో క్రీడలకు అత్యుత్తమ కోచింగ్‌ సౌకర్యాలు అందించడంలో కృషి చేస్తోంది. ఈ అన్ని సంస్థల్లో కలిపి వేర్వేరు క్రీడా విభాగాలకు చెందిన సుమారు 5 వేల మంది అథ్లెట్లు ప్రయోజనం పొందడం విశేషం. 

అందుకే ఆపేశాను
కీర్తి కనకాదులు వచ్చిన తర్వాత ఆటనుంచి తప్పుకోవడం అంత సులువు కాదు. ఆశించిన ఫలితాలు రాకపోయినా, ఏదో ఒక టోర్నీలో సీనియర్‌ ఆటగాళ్లు తలపడుతూనే ఉంటారు. ఆటపై తమకు ఉన్న ప్రేమే అందుకు కారణమని చెబుతుంటారు. ఈ విషయంలో బింద్రా భిన్నంగానే నిలబడ్డాడు.  2016 రియో ఒలింపిక్స్‌లో బింద్రా ఆఖరి సారిగా పోటీ పడ్డాడు.

ఆ మెగా ఈవెంట్‌లో నాలుగో స్థానంలో నిలిచిన అతను త్రుటిలో కాంస్య పతకాన్ని చేజార్చుకున్నాడు. ఆ సమయంలో బింద్రా వయసు 34 ఏళ్లు. అందుకే అతని రిటైర్మెంట్‌ చాలా మందికి ఆశ్చర్యం కలిగించింది. ఒక అభిమాని.. ట్విట్టర్‌ ద్వారా ఇదే సందేహాన్ని వ్యక్తం చేస్తే దానికి ఏమాత్రం భేషజం లేకుండా బింద్రా స్పష్టంగా సమాధానమిచ్చాడు.

‘ఒకటి.. నా నైపుణ్యం రోజురోజుకూ తగ్గిపోతోందని అర్థమైంది. రెండు.. వరుసగా రెండు ఒలింపిక్స్‌లో విఫలమయ్యాను. మూడు.. నేను అక్కడే వేలాడుతూ ఉంటూ మరో యువ ప్రతిభావంతుడి అవకాశం దెబ్బ తీసినట్లు అవుతుంది. అలా చేయదల్చుకోలేదు’ అని అతను చెప్పాడు. -మొహమ్మద్‌ అబ్దుల్‌ హాది

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top