
ఇప్పుడిప్పుడే వెలుగులోకి వస్తున్న ఓ వార్త క్రికెట్ సమాజాన్నంతా షాక్‌కు గురి చేస్తుంది. రెండు టీ20 ప్రపంచకప్‌లు, 97 అంతర్జాతీయ మ్యాచ్‌లు ఆడిన అనుభవమున్న పపువా న్యూగినియా క్రికెటర్ కిప్లింగ్ డోరిగా (Kipling Doriga) చోరీ కేసులో బుక్కాయ్యాడు.
ఆగస్టు 25వ తేదీ ఉదయం జెర్సీ ద్వీప రాజధాని సెయింట్ హెలియర్స్ (St Heliers) ప్రాంతంలో ఓ చోరీ జరిగింది. ఈ ఘటనలో డోరిగా రెడ్ హ్యాండెడ్‌గా పట్టుబడినట్లు తెలుస్తుంది. డోరిగాను స్థానిక పోలీసులు మేజిస్ట్రేట్ కోర్టులో హాజరుపర్చగా నేరాన్ని ఒప్పుకున్నాడని సమాచారం.
రిలీఫ్ మేజిస్ట్రేట్ రెబెక్కా మోర్లే-కిర్క్ ఈ కేసును తీవ్రమైందిగా పరిగణించి రాయల్ కోర్టుకు బదిలీ చేశారు. తదుపరి విచారణను నవంబర్ 28కి వాయిదా వేశారు. ఈ కేసులో డోరిగాకు బెయిల్ నిరాకరించబడింది. తదుపరి వాయిదా వరకు డోరిగా పోలీసుల కస్టడీలో కొనసాగనున్నాడు.
ఈ పరిణామం పపువా న్యూగినియా క్రికెట్ బోర్డును అప్రతిష్ఠపాలు చేసింది. అంతర్జాతీయ వేదికపై ఆ జట్టు తల దించుకునేలా చేసింది. ఓ అంతర్జాతీయ క్రికెటర్ చోరీ కేసులో ఇరుక్కోవడం ఐసీసీ కూడా చెడ్డ పేరు తీసుకొచ్చింది. ఈ ఘటన అంతర్జాతీయ క్రీడా సమాజంలో క్రికెట్ ప్రతిష్టను దెబ్బతీసింది. పపువా న్యూగినియా ఐసీసీ అసోసియేట్ సభ్య దేశంగా ఉంది.
వికెట్‌కీపర్ కమ్ బ్యాటర్ అయిన 29 ఏళ్ల డోరిగా 2021, 2024 టీ20 ప్రపంచకప్‌లలో పపువా న్యూగినియాకు ప్రాతినిధ్యం వహించాడు. అంతర్జాతీయ స్థాయిలో 97 మ్యాచ్‌లు ఆడిన అనుభవం ఉన్న డోరిగా, ప్రస్తుతం CWC ఛాలెంజ్ లీగ్ రెండో రౌండ్‌లో పపువా న్యూగినియా జట్టులో సభ్యుడిగా ఉన్నాడు.