NZ VS SL 1st Test Day 1: వెటోరీని అధిగమించిన సౌథీ.. రెండో స్థానానికి ఎగబాకిన కివీస్‌ కెప్టెన్‌

NZ VS SL 1st Test Day 1: Tim Southee Moved To Second In New Zealand Test Wicket Takers List - Sakshi

స్వదేశంలో శ్రీలంకతో జరుగుతున్న టెస్ట్‌ మ్యాచ్‌లో న్యూజిలాండ్‌ సారధి టిమ్‌ సౌథీ ఓ రేర్‌ ఫీట్‌ను సాధించాడు. 2 మ్యాచ్‌ల టెస్ట్‌ సిరీస్‌లో భాగంగా క్రైస్ట్‌చర్చ్‌ వేదికగా ఇవాళ (మార్చి 9) ప్రారంభమైన తొలి టెస్ట్‌లో 3 వికెట్లు పడగొట్టిన సౌథీ ( తొలి రోజు ఆటలో).. న్యూజిలాండ్‌ తరఫున టెస్ట్‌ల్లో అత్యధిక వికెట్లు సాధించిన రెండో ఆటగాడిగా రికార్డుల్లోకెక్కాడు.

93 టెస్ట్‌ల్లో 362 వికెట్లు పడగొట్టిన సౌథీ.. డేనియల్‌ వెటోరీని (112 టెస్ట్‌ల్లో 361) అధిగమించి, రెండో స్థానానికి ఎగబాకాడు. ఈ జాబితాలో దిగ్గజ బౌలర్‌ సర్‌ రిచర్డ్‌ హ్యాడ్లీ (86 టెస్ట్‌ల్లో 431 వికెట్లు) తొలి స్థానం‍లో ఉన్నాడు. ప్రస్తుతం సౌథీ న్యూజిలాండ్‌ తరఫున అత్యధిక వికెట్లు (మూడు ఫార్మాట్లతో కలిపి) పడగొట్టిన బౌలర్‌గా చలామణి అవుతున్నాడు.

ఇప్పటివరకు అన్ని ఫార్మాట్లలో కలిపి 354 మ్యాచ్‌లు ఆడిన సౌథీ 706 వికెట్లు పడగొట్టాడు. ఈ జాబితాలో సౌథీ తర్వాత వెటోరీ (696), హ్యాడ్లీ (589), బౌల్డ్‌ (578), కెయిన్స్‌ (419), మిల్స్‌ (327), మోరిసన్‌ (286), చాట్‌ఫీల్డ్‌ (263), బాండ్‌ (259), వాగ్నర్‌ (258) టాప్‌-10లో ఉన్నారు. 

ఇక, మ్యాచ్‌ విషయానికొస్తే.. తొలుత బ్యాటింగ్‌కు దిగిన శ్రీలంక.. తొలి రోజు ఆట ముగిసే సమయానికి 6 వికెట్లు కోల్పోయి 305 పరుగులు చేసింది. కెప్టెన్‌ దిముత్‌ కరుణరత్నే (50), కుశాల్‌ మెండిస్‌ (87) అర్ధసెంచరీలతో రాణించగా.. ఏంజెలో మాథ్యూస్‌ (47), దినేశ్‌ చండీమాల్‌ (39) పర్వాలేదనిపించారు.

ఓపెనర్‌ ఒషాడో ఫెర్నాండో (13), నిరోషన్‌ డిక్వెల్లా (7) నిరాశపర్చగా.. ధనంజయ డిసిల్వ (39), కసున్‌ రజిత (16) క్రీజ్‌లో ఉన్నారు. కివీస్‌ బౌలర్లలో సౌథీ 3, మ్యాట్‌ హెన్రీ 2, బ్రేస్‌వెల్‌ ఓ వికెట్‌ పడగొట్టారు. 
 

మరిన్ని వార్తలు :

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top