
ఢిల్లీ ప్రీమియర్ లీగ్ రెండో ఎడిషన్ (2025) విజేతగా వెస్ట్ ఢిల్లీ లయన్స్ అవతరించింది. నిన్న (ఆగస్ట్ 31) జరిగిన ఫైనల్లో ఆ జట్టు సెంట్రల్ ఢిల్లీ కింగ్స్‌ను 6 వికెట్ల తేడాతో ఓడించింది. వెస్ట్ ఢిల్లీ లయన్స్‌ను ఆ జట్టు కెప్టెన్ నితీశ్ రాణా ఒంటిచేత్తో గెలిపించాడు. తొలుత బౌలింగ్‌లో అదరగొట్టి (4-0-16-1), ఆతర్వాత బ్యాటింగ్‌లో (49 బంతుల్లో 79 నాటౌట్; 4 ఫోర్లు, 7 సిక్సర్లు) బెదరగొట్టాడు.
ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన సెంట్రల్ ఢిల్లీ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 173 పరుగులు చేసింది. యుగల్ సైనీ (48 బంతుల్లో 65; 4 ఫోర్లు, 3 సిక్సర్లు), ప్రన్షు విజయ్రాన్ (24 బంతుల్లో 50 నాటౌట్; 3 ఫోర్లు, 4 సిక్సర్లు) అర్ద సెంచరీలతో మెరిశారు.
ఆఖర్లో ప్రన్షు విరుచుకుపడకపోయుంటే సెంట్రల్ ఢిల్లీ ఈ స్కోర్ చేయలేకపోయేది. ప్రన్షు, సైనీ మినహా సెంట్రల్ ఢిల్లీ ఇన్నింగ్స్‌లో ఎవరూ చెప్పుకోదగ్గ స్కోర్లు చేయలేదు. వెస్ట్ ఢిల్లీ బౌలర్లలో నితీశ్ రాణా, మనన్ భరద్వాజ్ (3-0-11-2), శివాంక్ వశిష్ట్ (2-0-12-2) సెంట్రల్ ఢిల్లీ బ్యాటర్లను ఇబ్బంది పెట్టారు. శుభమ్ దూబే, మయాంక్ గుసేన్ తలో వికెట్ తీసినా ధారాళంగా పరుగులు సమర్పించుకున్నారు.
అనంతరం ఓ మోస్తరుకు మించిన లక్ష్య ఛేదనకు దిగిన వెస్ట్ ఢిల్లీ.. నితీశ్ రాణా విధ్వంసం సృష్టించడంతో మరో 2 ఓవర్లు మిగిలుండగానే విజయతీరాలకు చేరింది. రాణాకు జతగా హృతిక్ షోకీన్ (27 బంతుల్లో 42 నాటౌట్; 5 ఫోర్లు, 2 సిక్సర్లు) కూడా బ్యాట్ ఝులిపించి వెస్ట్ ఢిల్లీ విజయంలో కీలకపాత్ర పోషించాడు. సెంట్రల్ ఢిల్లీ బౌలర్లలో ఒక్కరు కూడా రాణా, షోకీన్ జోరుకు అడ్డుకట్ట వేయలేకపోయారు.
ఈ సీజన్ ఆధ్యాంతం నితీశ్ రాణా అద్భుత ప్రదర్శనలు చేశాడు. కీలక మ్యాచ్‌ల్లో మరింత చెలరేగి ఆడాడు. ఎలినేటర్ మ్యాచ్‌లో విధ్వంసకర శతకం (55 బంతుల్లో 134 నాటౌట్), క్వాలిఫయర్-2లో మెరుపు ఇన్నింగ్స్ (26 బంతుల్లో 45 నాటౌట్) ఆడి తన జట్టును ఫైనల్‌కు చేర్చాడు. ఫైనల్లో బ్యాట్‌తో పాటు బంతితోనూ సత్తా చాటి ఒంటిచేత్తో తన జట్టును ఛాంపియన్‌గా నిలబెట్టాడు.
ఈ టోర్నీ గత సీజన్‌లో ఐపీఎల్ సంచలనం ప్రియాన్ష్ ఆర్య (పంజాబ్ కింగ్స్) నితీశ్ తరహాలోనే రెచ్చిపోయి వెలుగులోకి వచ్చాడు. ఆతర్వాత ప్రియాంశ్ ఆర్య ఐపీఎల్‌లో ఏం చేశాడో అంతా చూశాం. ఈ సీజన్ మెరుపు ప్రదర్శనలతో నితీశ్ కూడా భారత పరిమిత ఓవర్ల జట్లలోకి వచ్చి అద్భుతాలు చేస్తాడేమో చూడాలి. నితీశ్ ఐపీఎల్‌లో గత సీజన్‌కు ముందే కేకేఆర్ నుంచి రాజస్థాన్ రాయల్స్‌కు మారాడు. గత సీజన్‌లో అతను చెప్పుకోదగ్గ ప్రదర్శనలేమీ చేయలేదు.