MS Dhoni: బంతులన్నీ వృథా చేశావు.. అవుటైనా బాగుండేది.. కనీసం..

MS Dhoni: Fans Speculate CSK Captain Future After His Slow Innings Against DC - Sakshi

Fans Trolls MS Dhoni Innings Against DC: మిస్టర్‌ కూల్‌ ధోని ఆట తీరుపై అభిమానులు పెదవి విరుస్తున్నారు. ‘‘నీ బదులు జడేజాను పంపించినా బాగుండేది కదా’’ అంటూ ట్రోల్‌ చేస్తున్నారు. చెన్నై సూపర్‌కింగ్స్‌ కెప్టెన్‌గా ధోని జట్టును విజయపథంలో నడిపిస్తున్నప్పటికీ.. ఈ సీజన్‌లో బ్యాటర్‌గా మాత్రం పూర్తిగా నిరాశపరుస్తున్న సంగతి తెలిసిందే. ఐపీఎల్‌-2021 సీజన్‌లో ఇప్పటి వరకు 13 మ్యాచ్‌లలో 9 ఇన్నింగ్స్‌ ఆడిన ధోని.. మొత్తంగా కేవలం 84 పరుగులు చేశాడు. అత్యధిక స్కోరు 18. 

ఇక గురువారం సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌తో జరిగిన మ్యాచ్‌లో తనదైన శైలిలో సిక్సర్‌తో ఇన్నింగ్స్‌ ముగించడం మినహా.. ఏ ఇతర మ్యాచ్‌లోనూ పెద్దగా ఆకట్టుకోలేదు. ముఖ్యంగా... సోమవారం ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 27 బంతులు ఎదుర్కొన్న ధోని.. కేవలం 18 పరుగులు చేసి.. ఆవేశ్‌ఖాన్‌ బౌలింగ్‌లో రిషభ్‌ పంత్‌కు క్యాచ్‌ ఇచ్చి పెవిలియన్‌ చేరాడు. ఈ మ్యాచ్‌లో అంబటి రాయుడు హాఫ్‌ సెంచరీ(55- నాటౌట్‌)తో మెరవడంతో చెన్నై కనీసం 136 పరుగుల గౌరవప్రదమైన స్కోరు చేయగలిగింది. ఇక లక్ష్య ఛేదనకు దిగిన పంత్‌ సేన మూడు వికెట్ల తేడాతో గెలుపొందిన సంగతి తెలిసిందే.

ఈ నేపథ్యంలో ధోని ఆడిన తీరుపై ఫ్యాన్స్‌ అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. జడేజా, బ్రావో, ఠాకూర్‌ ఇంత మంది బ్యాటింగ్‌ చేయడానికి సిద్ధంగా ఉన్నా.. హిట్టింగ్‌ ఆడకుండా బంతులు వృథా చేశాడంటూ సోషల్‌ మీడియా వేదికగా ట్రోల్‌ చేస్తున్నారు. ‘‘ధోని బ్యాటింగ్‌ ఎలా చేయాలో మర్చిపోయాడు. తన స్థానంలో జడేజా ఉంటే 25 బంతుల్లో అర్ధ సెంచరీ చేసేవాడేమో! అసలు ధోని భాయ్‌.. ఏం చేశాడో అర్థమవుతోందా? 27 బంతులు.. ఒక్క బౌండరీ లేదు... 18 పరుగులు మాత్రమే.. 

నీ కంటే పుజారానే నయం అనిపించింది. నిజంగా నీ నుంచి ఇది ఊహించలేదు. అసలు రన్స్‌ తీద్దామన్న ఆలోచనే ఉన్నట్లు కనిపించలేదు. ఎవరేమనుకున్నా ధోని భయ్యా చేసింది ఏమాత్రం బాగాలేదు. భవిష్యత్తులో కష్టమే’’ అంటూ కామెంట్లు చేశారు. ఇక మరికొంత మంది మాత్రం... పిచ్‌ బాగా లేనపుడు ఏ బ్యాటర్‌ కూడా ఏమీ చేయలేడు అంటూ ధోనికి మద్దతుగా నిలిచారు.

చదవండి: Ravi Shastri: పరిమిత ఓవర్ల క్రికెట్‌లో ధోని ఏం సాధించలేదో చెప్పండి?!

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top