Vedaant Madhavan: 5 స్వర్ణాలు సహా మొత్తం 7 పతకాలు సాధించిన నటుడు మాధవన్‌ తనయుడు

Madhavan Son Vedaant Wins 5 Gold, 2 Silver Medals At Khelo India 2023 - Sakshi

Khelo India Games 2023: ప్రముఖ బాలీవుడ్‌ నటుడు ఆర్‌ మాధవన్‌ పుత్రోత్సాహంతో పొంగిపోతున్నాడు. అతని కుమారుడు, భారత అప్‌ కమింగ్‌ స్విమ్మర్‌ వేదాంత్‌ మాధవన్‌ ఖేలో ఇండియా గేమ్స్‌-2023లో పతకాల వర్షం కురిపించాడు. ఈ పోటీల్లో మహారాష్ట్ర తరఫున బరిలోకి దిగిన వేదాంత్‌.. 5 స్వర్ణ పతాకలు, 2 రజత పతకాలు సహా మొత్తం 7 పతకాలను కైవసం చేసుకున్నాడు.

100, 200, 1500 మీటర్ల రేసులో స్వర్ణ పతకాలు సాధించిన వేదాంత్‌.. 400, 800 మీట్లర​ రేసులో రజత పతకాలు సొంతం చేసుకున్నాడు. వేదాంత్‌ కొలనులో బంగారు చేపలా రెచ్చిపోయి పతకాలు సాధించడంతో అతను ప్రాతినిధ్యం వహించిన మహారాష్ట్ర మొత్తంగా 161 పతకాలు (56 స్వర్ణాలు, 55 రజతాలు, 50 కాంస్యాలు) సాధించి పతకాల పట్టికలో అగ్రస్థానంలో నిలిచింది. తద్వారా ఓవరాల్‌ ఛాంపియన్‌షిప్‌ ట్రోఫీని కైవసం చేసుకుంది. బాలుర విభాగంలో కూడా అత్యధిక పతకాలు సాధించిన మహారాష్ట్ర టీమ్‌ మరో ట్రోఫీని సాధించింది.

కొడుకు వేదాంత్‌ ప్రదర్శనతో ఉబ్బితబ్బిబైపోతున్న మాధవన్‌.. అతనికి, మహారాష్ట్ర టీమ్‌కు శుభాకాంక్షలు తెలుపుతూ పలు ట్వీట్‌లు చేశాడు. వేదాంత్‌, ఫెర్నాండెస్‌ అపేక్ష (6 గోల్డ్‌, 1 సిల్వర్‌) ప్రదర్శన పట్ల చాలా గర్వంగా ఉంది. వీరి ప్రదర్శన వెనుక తిరుగలేని కృషి చేసిన  కోచ్‌ ప్రదీప్‌ సర్‌, చౌహాన్‌ శివ్‌రాజ్‌లకు ధన్యవాదాలు. ఖేలో ఇండియా గేమ్స్‌ను ఘనంగా నిర్వహించిన కేంద్ర క్రీడల మంత్రి అనురాగ్‌ ఠాకూర్‌ గారికి కృతజ్ఞతలు అంటూ తొలి ట్వీట్‌ చేశాడు.

ఆ తర్వాత ట్వీట్‌లో  మాధవన్‌ తన కుమారుడు సాధించిన పతకాల వివరాలను పొందుపరిచాడు. మరో ట్వీట్‌లో టీమ్‌ మహారాష్ట్ర, ఆ రాష్ట్ర బాయ్స్‌ టీమ్‌కు ప్రత్యేకంగా అభినందనలు తెలిపాడు. ఇటీవల కాలంలో కొలనులో అత్యుత్తమ ప్రదర్శన కనబరుస్తున్న వేదాంత్‌ దుబాయ్‌లో ఒలింపిక్స్‌ కోసం ప్రత్యేక శిక్షణ తీసుకుంటున్నాడు. వేదాంత్‌ కోసం మాధవన్‌ తన ఫ్యామిలీ మొత్తాన్ని దుబాయ్‌కు షిఫ్ట్‌ చేశాడు.  కాగా, గతేడాది డానిష్‌ ఓపెన్‌లో బంగారు పతకం గెలవడం ద్వారా వేదాంత్‌ తొలిసారి వార్తల్లోకెక్కాడు. 

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top