Tulsidas Balaram Death: భారత ఫుట్‌బాల్‌ దిగ్గజం.. తెలంగాణ ముద్దుబిడ్డ అస్తమయం

Legenday-Indian Footballer Tulsidas Balaram Passed Away - Sakshi

భారత దిగ్గజ ఫుట్‌బాలర్‌, ఒలింపియన్‌.. తెలుగు బిడ్డ తులసీదాస్‌ బలరాం(87) గురువారం కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన ఆసుపత్రిలో మృతి చెందినట్లు కుటుంబసభ్యులు పేర్కొన్నారు. గతేడాది డిసెంబర్‌ 26న ఆరోగ్య సమస్యలతో ఆసుపత్రిలో జాయిన్‌ అయిన తులసీదాస్‌ బలరాం మూత్రం ఇన్‌ఫెక్షన్‌, ఉదర భాగం సంబంధిత వ్యాధితో బాధపడుతూ చికిత్స తీసుకున్నాడు. అయితే గురువారం ఉదయం పరిస్థితి విషమించి ఆయన కన్నుమూశారు. 

అంతర్జాతీయ స్థాయిలో ఫుట్‌బాల్‌ ఆడి దేశఖ్యాతిని పెంచిన తులసీదాస్‌ బలరాం తెలుగు ప్రాంతానికి చెందినవాడు కావడం మనకు గర్వకారణం. 1936, అక్టోబర్‌ 4న సికింద్రాబాద్‌లోని బొల్లారంలో జన్మించారు. తన కెరీర్‌లో జాతీయ జట్టుతో పాటు హైదరాబాద్‌, బెంగాల్‌లోని ఈస్ట్‌ బెంగాల్‌ ఫుట్‌బాల్‌ జట్లకు ప్రాతినిధ్యం వహించాడు. దిగ్గజ ఫుట్‌బాలర్‌గా పేరు పొందిన తులసీదాస్‌ బలరారం 1962లో జరిగిన ఏషియన్‌ గేమ్స్‌లో(Asian Games) గోల్డ్‌ మెడల్‌ గెలిచిన భారత ఫుట్‌బాల్‌ జట్టులో సభ్యుడు.

అంతేకాదు 1960 రోమ్‌ ఒలింపిక్స్‌లో పాల్గొన్న భారత జట్టులోనూ బలరాం సభ్యుడిగా ఉన్నాడు. భారత ఫుట్‌బాల్‌ దిగ్గజాలు చునీ గోస్వామి, పీకే బెనర్జీలతో కలిసి తులసీదాస్‌ బలరాం ఎన్నో మ్యాచ్‌లు ఆడాడు. వీరి త్రయాన్ని హోలీ ట్రినిటీ(Holy Trinity) అని పిలిచేవారు. 1960 ఒలింపిక్స్‌లో భారత్‌ ఫుట్‌బాల్‌ జట్టు.. హంగేరీ, ఫ్రాన్స్‌, పెరులాంటి బలమైన జట్లు ఉన్న గ్రూప్‌లో ఉండడంతో గ్రూప్‌ ఆఫ్‌ డెత్‌గా అభివర్ణించారు. హంగేరీతో మ్యాచ్‌లో 2-1తో ఓటమి పాలైంది. అయితే  మ్యాచ్‌లో తులసీదాస్‌ బలరాం గోల్‌ కొట్టి ఆధిక్యాన్ని తగ్గించగలిగాడు. జట్టులో ఎక్కువగా సెంటర్‌ ఫార్వర్డ్‌లో ఆడిన తులసీదాస్‌ బలరాం 1963లో ఆరోగ్య సమస్యలతో ఆటకు గుడ్‌బై చెప్పాడు. ఇక 1962లో తులసీదాస్‌ బలరాం అర్జున అవార్డు అందుకున్నాడు.

తులసీదాస్‌ బలరాం సాధించిన పతకాలు, అవార్డులు
► ఆసియా క్రీడల్లో బంగారు పతకం: 1962
► మెర్డెకా టోర్నమెంట్ రన్నరప్: 1959
► ఈస్ట్‌ బెంగాల్ తరపున 1958లో IFA షీల్డ్ ట్రోఫీ
► హైదరాబాద్‌ తరపున సంతోష్ ట్రోఫీ(1956–57)
► బెంగాల్ తరపున సంతోష్ ట్రోఫీ: 1958–59, 1959–60, 1962–63
► అర్జున అవార్డు: 1962
► కలకత్తా ఫుట్‌బాల్ లీగ్ టాప్ స్కోరర్: 1961

చదవండి: రికార్డుల్లోకెక్కిన పాక్‌ బ్యాటర్‌.. తొలి క్రికెటర్‌గా..!

క్రికెట్‌ దేవుడితో 'రోలెక్స్‌'.. ఫోటో వైరల్‌

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top