Roger Federer: ఫెదరర్‌ ఆఖరి మ్యాచ్‌లో ఓటమి! నాదల్‌ కీలక నిర్ణయం

Laver Cup: Nadal Withdraws After Teaming Up In Federer Retirement Match - Sakshi

Laver Cup 2022- Rafael Nadal- Roger Federer- లండన్‌: స్విస్‌ టెన్నిస్‌ దిగ్గజం రోజర్‌ ఫెదరర్‌తో కలిసి ఆడిన మ్యాచ్‌ ముగిసిన వెంటనే స్పెయిన్‌ స్టార్‌ రఫేల్‌ నాదల్‌ కీలక నిర్ణయం తీసుకున్నాడు. లేవర్‌ కప్‌ టోర్నీ నుంచి వైదొలిగాడు. వ్యక్తిగత కారణాల వల్ల అతడు టోర్నమెంట్‌ నుంచి తప్పుకొన్నట్లు సమాచారం.

ఇక టీమ్‌ యూరోప్‌లో నాదల్‌ స్థానాన్ని బ్రిటిష్‌ టెన్నిస్‌ స్టార్‌ కామెరూన్‌ నోరీ భర్తీ చేయనున్నాడు. ఫెదరర్‌ స్థానంలో మాటో బెరెటిని ఎంట్రీ ఇవ్వనున్నాడు. కాగా టీమ్‌ యూరోప్, టీమ్‌ వరల్డ్‌ జట్ల మధ్య ప్రతి యేటా లేవర్‌ కప్‌ టెన్నిస్‌ టోర్నీ జరుగుతుందన్న విషయం తెలిసిందే.

కన్నీటిపర్యంతమైన దిగ్గజాలు
ఈ క్రమంలో రెండు దశాబ్దాలకు పైగా టెన్నిస్‌ ప్రపంచాన్ని ఏలిన, లేవర్‌ కప్‌ టోర్నీ సృష్టికర్తల్లో ఒకడైన రోజర్‌ ఫెదరర్‌ శుక్రవారం తన చివరి మ్యాచ్‌ ఆడాడు. చిరకాల స్నేహితుడు రఫేల్‌ నాదల్‌తో కలిసి కోర్టులో దిగిన ఫెడ్డీ.. ఓటమితో కెరీర్‌ను ముగించాడు. టీమ్‌ వరల్డ్‌కు చెందిన టియాఫో-జాక్ సాక్ జంట చేతిలో 4-6, 7-6(7-2), 11-9తో ఈ దిగ్గజాలు ఓటమి పాలయ్యారు.

కుటుంబ సభ్యులు సైతం..
ఇక ఫెడెక్స్‌కు ఇదే ఆఖరి మ్యాచ్‌ అయిన సందర్భంగా కోర్టులో భావోద్వేగ సన్నివేశాలు చోటుచేసుకున్నాయి. ఫెదరర్‌, నాదల్‌ కన్నీంటి పర్యంతమయ్యారు. ఫెదరర్‌ కుటుంబ సభ్యులు సైతం తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు. తల్లిదండ్రులు, భార్య మిర్కా, నలుగురు పిల్లలు వచ్చి అతడిని ఆలింగనం చేసుకున్నారు. ఇక కోర్టులో ఉన్న ఆటగాళ్లు, ఇతర సిబ్బంది ఫెదరర్‌ను ఎ‍త్తుకుని హర్షధ్వానాల మధ్య ఘనంగా వీడ్కోలు పలికారు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి.  

చదవండి: Roger Federer- Mirka: మిర్కాతో ఫెదరర్‌ ప్రేమ ప్రయాణం! కవలల జోడీ.. గొప్ప మనసున్న జంట!

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top