వాళ్లిద్దరి బౌలింగ్‌ అద్భుతం: బుమ్రా

Jasprit Bumrah Says Trying To Be Positive Confident Boxing Day Test - Sakshi

మెల్‌బోర్న్‌: పరస్పర సహకారంతో ఆసీస్‌ బ్యాట్స్‌మెన్‌పై ఒత్తిడి తీసుకువచ్చి వారిపై పైచేయి సాధించామని టీమిండియా పేసర్‌ జస్ప్రీత్‌ బుమ్రా పేర్కొన్నాడు. అశ్విన్‌, సిరాజ్‌ అద్భుతంగా బౌలింగ్‌ చేశారంటూ ప్రశంసలు కురిపించాడు. బౌలర్లుగా తమ ప్రదర్శన పట్ల హర్షం వ్యక్తం చేశాడు. సెషన్‌ సెషన్‌కు మరింత రాటుదేలుతూ మ్యాచ్‌ మొత్తం సానుకూల దృక్పథంతో ముందుకు సాగుతామని తెలిపాడు. శనివారం నాటి బాక్సింగ్‌ డే టెస్టులో భాగంగా భారత బౌలర్ల ధాటికి ఆసీస్‌ 195 పరుగులకే తొలి ఇన్నింగ్‌​ ముగించిన విషయం తెలిసిందే. ఓపెనర్‌ బర్న్స్‌ను డకౌట్‌ చేయడం ద్వారా బుమ్రా ఆతిథ్య జట్టుకు ఆదిలోని భారీ షాకిచ్చాడు. దీంతో 10 పరుగుల వద్ద ఆసీస్‌ తొలి వికెట్‌ కోల్పోయింది. ఆ తర్వాత లబుషేన్‌తో కలిసి మరో ఓపెనర్‌ మాథ్యూ వేడ్‌ ఇన్నింగ్స్‌ను చక్కదిద్దుతున్న తరుణంలో అశ్విన్‌ వేడ్‌ను పెవిలియన్‌ చేర్చాడు. 

అనంతరం క్రీజులోకి వచ్చిన స్టార్‌ బ్యాట్స్‌మన్‌ స్టీవ్‌ స్మిత్‌ అశ్విన్‌ బౌలింగ్‌లో డకౌట్‌గా వెనుదిరిగాడు. టీ విరామానికి ముందు బుమ్రా బౌలింగ్‌లో హెడ్‌ ఔట్‌ కాగా.. కాసేపటికే లబుషేన్ సిరాజ్‌ బౌలింగ్‌లో వికెట్‌ సమర్పించుకున్నాడు. ఈ క్రమంలో ఆసీస్‌ 136 పరుగులకే 5 వికెట్లు కోల్పోయి కష్టాల్లో కూరుకుపోయింది. ఇక టీ విరామం తర్వాత టీమిండియా బౌలర్లు మరింత విజృంభించడంతో 59 పరుగులు మాత్రమే చేసి మరో 5 వికెట్లు చేజార్చుకుంది. మొత్తంగా బుమ్రా 4, అశ్విన్‌ 3, సిరాజ్‌ 2, జడేజా ఒక వికెట్‌ తీసి సత్తా చాటారు. (చదవండి: రహానే కెప్టెన్సీ భేష్‌..)

ఈ నేపథ్యంలో బుమ్రా మాట్లాడుతూ.. ‘‘మనల్ని నియంత్రించాలనుకునే వాళ్లను నియంత్రించగలగాలి. ప్రస్తుతం మేం అదే దశలో ఉన్నాం. మరీ ఎక్కువగా ఆలోచించాల్సిన అవసరం లేదు. సెషన్‌ సెషన్‌కు మెరుగ్గా రాణించాలి. మైండ్‌సెట్‌ మార్చుకుని కాస్త స్వేచ్ఛగా బౌలింగ్‌ చేయగలగాలి. నిర్లక్ష్య ధోరణి వీడి.. రెట్టించిన విశ్వాసంతో ముందుకు సాగాలని భావిస్తున్నాం. అశ్‌ బౌలింగ్‌ అద్భుతం. సిరాజ్‌ కూడా బాగా బౌల్‌ చేశాడు. బౌలర్లుగా మా ప్రదర్శన నాకు సంతోషాన్నిచ్చింది. ఒకరికొరు సహాయం చేసుకుంటూ ముందుకు సాగాం. అన్ని వైపుల నుంచి బ్యాట్స్‌మెన్‌పై ఒత్తిడి తీసుకువచ్చాం’’ అని చెప్పుకొచ్చాడు. 

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top