74 పరుగులకే ఆలౌట్.. అండర్సన్ అరుదైన ఘనత

మాంచెస్టర్: ఇంగ్లండ్ సీనియర్ స్టార్ బౌలర్ జేమ్స్ అండర్సన్ 38 ఏళ్ల వయసులోను అదరగొడుతున్నాడు. తాజాగా కౌంటీ క్రికెట్‌లో భాగంగా లంకాషైర్ తరపున ఆడుతున్న అండర్సన్ ఒక అరుదైన మైలురాయిని చేరుకున్నాడు. ఫస్ట్‌క్లాస్ క్రికెట్‌లో వెయ్యి వికెట్లు తీసిన బౌలర్‌గా అండర్సన్ చరిత్ర సృష్టించాడు. అంతేగాక కెంట్‌తో జరిగిన మ్యాచ్‌లో ఏకంగా 7 వికెట్లు తీసి సత్తా చాటాడు. అండర్సన్ దెబ్బకు కెంట్ 74 పరుగులకే ఆలౌట్ అయింది. (10-5-19-7)తో అత్యుత్తమ గణాంకాలతో మెరిసిన అండర్సన్ జాక్ క్రాలే, జోర్డాన్ కాక్స్, ఓలీ రాబిన్‌సన్, హీనో కుహ్న్, జాక్ లీనింగ్, మాట్ మిల్నెస్, హ్యారీ పొడ్రమ్‌ల వికెట్లను తన ఖాతాలో వేసుకున్నాడు.
ఇందులో ముగ్గురు బ్యాట్స్‌మెన్లు డకౌట్లుగా వెనుదిరగడం విశేషం. అనంతరం లంకాషైర్ ఇన్నింగ్స్ కూడా తడబాటుతోనే ప్రారంభమైంది. ప్రస్తుతం 40 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 108 పరుగులు చేసింది. స్టీవెన్ క్రాఫ్ట్ 8, రాబ్ జోన్స్ 7 పరుగులతో ఆడుతున్నారు. కాగా జూన్‌లో ఇంగ్లండ్ తరపున అత్యధిక టెస్టు మ్యాచ్‌లు ఆడిన ఆటగాడిగా అండర్సన్ నిలిచాడు. ఇప్పటివరకు 162 టెస్టు మ్యాచ్‌లు ఆడిన అతను 617 వికెట్లు తీశాడు. ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ అలిస్టర్ కుక్ 161 టెస్టులతో రెండో స్థానంలో ఉన్నాడు. అతని తర్వాత స్టువర్ట్ బ్రాడ్ 147 టెస్టులతో మూడో స్థానంలో కొనసాగుతున్నాడు. కాగా టెస్టుల్లో 600 వికెట్లకు పైగా తీసిన ఫాస్ట్ బౌలర్లలో అండర్సన్ అగ్రస్థానంలో కొనసాగుతున్న విషయం తెలిసిందే.
ఇక కౌంటీ క్రికెట్‌లో బిజీగా ఉన్న అండర్సన్ ఆ తర్వాత భారత్‌తో జరగనున్న ఐదు టెస్టుల సిరీస్‌లో ఆడేందుకు సిద్ధమవుతున్నాడు. భారత్‌లో జరిగిన టెస్టు సిరీస్ ఓటమికి అండర్సన్ ప్రతీకారం తీర్చుకోవాలని ఎదురుచూస్తున్నాడు. కాగా ఇరు జట్ల మధ్య తొలి టెస్టు ఆగస్టు 4 నుంచి ప్రారంభం కానుంది.
1️⃣0️⃣0️⃣0️⃣ first-class wickets @jimmy9 👏
Anderson has taken a 5-fer in 7 overs 🐐
Watch Anderson bowl here 👉 https://t.co/uJK9OLMTgs pic.twitter.com/j2535JaiAP
— LV= Insurance County Championship (@CountyChamp) July 5, 2021