IPL 2022: Kuldeep Yadav Interesting Comments On Chahal, Says Big Brother Hope Win Purple Cap - Sakshi
Sakshi News home page

Kuldeep Yadav: నాకు పెద్దన్న లాంటివాడు.. పర్పుల్‌ క్యాప్‌ అతడిదే: కుల్దీప్‌

Published Fri, Apr 29 2022 9:30 AM

IPL 2022: Kuldeep Yadav Says Chahal Like Big Brother Hope Win Purple Cap - Sakshi

IPL 2022KKR Vs DC- Kuldeep Yadav: కుల్దీప్‌ యాదవ్‌.. గత సీజన్‌లో కోల్‌కతా నైట్‌రైడర్స్‌కు ప్రాతినిథ్యం వహించిన ఈ చైనామన్‌ బౌలర్‌కు పెద్దగా ఆడే అవకాశం రాలేదు. టీమిండియాలోనూ అతడి పరిస్థితి ఆగమ్యగోచరంగా ఉండేది. ప్రాబబుల్స్‌లో చోటు దక్కినా తుదిజట్టులో ఆడే అవకాశం కోసం ఏళ్ల తరబడి వేచి చూడాల్సిన పరిస్థితి.

గతేడాది ఇంగ్లండ్‌తో టెస్టు సిరీస్‌తో పునరాగమనం చేసి సత్తా చాటినా మరో ఛాన్స్‌ కోసం ఎదురుచూడక తప్పని దుస్థితి. ఇందుకు తోడు గాయాల బెడద. ఆ తర్వాత కొన్ని మ్యాచ్‌లు ఆడినప్పటికీ ఇంకా ఏదో వెలితి.

అయితే, ఐపీఎల్‌-2022లో మాత్రం అదరగొట్టే ప్రదర్శనతో ఆ లోటును తీర్చుకుంటున్నాడు కుల్దీప్‌ యాదవ్‌. మెగా వేలంలో భాగంగా ఢిల్లీ క్యాపిటల్స్‌ అతడిని 2 కోట్ల రూపాయలకు కొనుగోలు చేసింది. ఫ్రాంఛైజీ తనపై పెట్టిన పెట్టుబడి, అంచనాలకు మించి రాణిస్తున్నాడు ఈ స్పిన్నర్‌. కెప్టెన్‌ రిషభ్‌ పంత్‌ నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ వరుస విజయాల్లో కీలక పాత్ర పోషించి ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌గా నిలుస్తున్నాడు.

కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో గురువారం జరిగిన మ్యాచ్‌లోనూ 4 వికెట్లతో రాణించి ఈ అవార్డు అందుకున్నాడు కుల్దీప్‌ యాదవ్‌. కేకేఆర్‌ కెప్టెన్‌ శ్రేయస్‌ అయ్యర్‌, ఇంద్రజిత్‌, సునిల్‌ నరైన్‌, రసెల్‌ వికెట్లు తన ఖాతాలో వేసుకున్నాడు. ఈ నేపథ్యంలో మ్యాచ్‌ అనంతరం కుల్దీప్‌ యాదవ్‌ మాట్లాడుతూ.. ‘‘నేనిప్పుడు మంచి బౌలర్‌ అయి ఉండవచ్చు.. అయితే గతంలో కంటే ఇప్పుడు మానసికంగా మరింత దృఢంగా తయారయ్యా.

జీవితంలో ఫెయిల్‌ అవుతున్న సమయంలో అవకాశం వస్తే దానిని ఉపయోగించుకుంటే ఫలితం ఉంటుంది. నాకిప్పుడు ఫెయిల్‌ అవుతానన్న భయం లేదు. రసెల్‌ వికెట్‌ తీయడం కోసం నా ప్రణాళికను పక్కాగా అమలు చేసి విజయం సాధించా. నా కెరీర్‌లో బెస్ట్‌ ఐపీఎల్‌ సీజన్‌ ఇది’’ అని హర్షం వ్యక్తం చేశాడు.

అదే విధంగా శ్రేయస్‌ అయ్యర్‌ వంటి కీలక బ్యాటర్‌ వికెట్‌ తీయడం తమకెంతో ముఖ్యమని, ఆ పని చేసినందుకు సంతోషంగా ఉందన్నాడు. ఇక ఐపీఎల్‌-2022లో ఇప్పటి వరకు ఆడిన ఎనిమిది మ్యాచ్‌లలో 18 వికెట్లు తీసిన రాజస్తాన్‌ రాయల్స్‌ స్పిన్నర్‌ యజువేంద్ర చహల్‌ పర్పుల్‌ క్యాప్‌ హోల్డర్‌గా ఉన్నాడు. తాజా మ్యాచ్‌లో అద్భుత ప్రదర్శనతో 17 వికెట్లతో కుల్దీప్‌ రెండో స్థానానికి దూసుకువచ్చాడు. దీంతో వీరిద్దరి మధ్య పోటీపై ఆసక్తికర చర్చ నడుస్తోంది. ఇక ఢిల్లీ మ్యాచ్‌ అనంతరం కుల్దీప్‌ ప్రదర్శనను కొనియాడుతూ చహల్‌.. ‘‘ కుల్దీప్‌.. చాంపియన్‌’’ అంటూ ట్వీట్‌ చేశాడు.

ఈ విషయంపై స్పందిస్తూ.. ‘‘అతడి(చహల్‌)తో నాకు ఎప్పుడూ పోటీ ఉండదు. తను నా పెద్దన్న లాంటి వాడు. ఎల్లప్పుడూ నాకు అండగా నిలబడ్డాడు. గాయంతో బాధ పడుతున్న సమయంలో నాలో ఆత్మవిశ్వాసం నింపాడు. ఈసారి పర్పుల్‌ క్యాప్‌ అతడే గెలుస్తాడని అనుకుంటున్నా’’ అని 27 ఏళ్ల కుల్దీప్‌ యాదవ్‌ చహల్‌పై అభిమానం చాటుకున్నాడు. ఇక కేకేఆర్‌తో మ్యాచ్‌లో ఢిల్లీ నాలుగు వికెట్ల తేడాతో గెలుపొందింది.

ఐపీఎల్‌ మ్యాచ్‌- 41: కేకేఆర్‌ వర్సెస్‌ ఢిల్లీ క్యాపిటల్స్‌ స్కోర్లు
కేకేఆర్‌- 146/9 (20)
ఢిల్లీ- 150/6 (19)

చదవండి👉🏾Shreyas Iyer: మా ఓటమికి కారణం అదే.. మేనేజ్‌మెంట్‌ నమ్మకాన్ని నిలబెట్టుకోవాలంటే!

Advertisement
Advertisement