IPL 2022: టీమిండియాలో చోటుపై ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన హార్ధిక్‌ పాండ్యా

IPL 2022: Hardik Pandya Makes Big Statement On His Chances Into Team India - Sakshi

Hardik Pandya: ఐపీఎల్‌ 2022 సీజన్‌లో గుజరాత్‌ టైటాన్స్‌ పగ్గాలు చేపట్టాక హార్ధిక్‌ పాండ్యా ఫేట్‌ ఒక్కసారిగా మారిపోయింది. ప్రస్తుత ఐపీఎల్‌ ఎడిషన్‌లో వరుస అర్ధశతకాలతో రాణించడంతో పాటు గుజరాత్‌ను టేబుల్‌ టాపర్‌గా (7 మ్యాచ్‌ల్లో 6 విజయాలు) నిలిపిన హార్ధిక్‌.. శనివారం (ఏప్రిల్‌ 23) తన జట్టు కేకేఆర్‌పై సూపర్‌ విక్టరీ సాధించాక టీమిండియాలో చోటుకు సంబంధించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. తాను టీమిండియాలోకి తిరిగి వస్తానని అనుకోవట్లేదని, ప్రస్తుతానికి తన ఫోకస్‌ అంతా ఐపీఎల్‌పైనేనని, గుజరాత్‌ టైటాన్స్‌ను ఈ ఏడాది ఐపీఎల్‌ ఛాంపియన్‌గా నిలబెట్టడమే తన ముందున్న లక్ష్యమని అన్నాడు. 

టీమిండియాలోకి రీఎంట్రీ ఇవ్వడమనేది తన పరిధిలో లేని అంశమని, ఆ విషయాన్ని భారత సెలెక్షన్‌ కమిటీ చూసుకుంటుందని తెలిపాడు. ప్రస్తుతానికి తన ఆటతీరు పట్ల సంతృప్తిగా ఉన్నానని, బౌలింగ్‌లో మరింత మెరుగుపడేందుకు శక్తివంచన లేకుండా ప్రయత్నిస్తున్నానని వివరించాడు. ఐపీఎల్‌లో గుజరాత్‌ టైటాన్స్‌ పగ్గాలు చేపట్టడం తన ఆటతీరుపై ప్రభావం చూపిందని, బాధ్యతలు తీసుకునేందుకు తానెప్పుడు సిద్ధంగా ఉంటానని వ్యాఖ్యానించాడు. 

కాగా, ప్రస్తుత ఐపీఎల్‌ సీజన్‌ ముందు వరకు హార్ధిక్‌ పాండ్యా పరిస్థితి అగమ్యగోచరంగా ఉండింది. పేలవ ఫామ్‌ కారణంగా అతను టీమిండియాలో చోటు కోల్పోవాల్సి వచ్చింది. అయితే, ఐపీఎల్‌ కొత్త ఫ్రాంచైజీ గుజరాత్‌ టైటాన్స్‌ హార్ధిక్‌ను పూర్తిగా నమ్మి జట్టు పగ్గాలు అప్పజెప్పింది. గుజరాత్‌ యజమాన్యం నమ్మకాన్ని వమ్ము చేయని హార్ధిక్‌.. కెప్టెన్‌గా, బ్యాటర్‌గా అద్భుతమైన ఫలితాలు రాబడుతున్నాడు. గుజరాత్‌ను 6 మ్యాచ్‌ల్లో గెలిపించడంతో పాటు బ్యాటర్‌గా 3 వరుస అర్ధసెంచరీలు సాధించాడు. 
చదవండి: లక్నోతో ముంబై ఢీ.. రోహిత్‌ సేనను ఈ మ్యాచ్‌లోనైనా గెలుపు పలకరించేనా..?

 

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top