పంత్‌ మంచి కెప్టెన్‌ అవుతాడు: మాజీ క్రికెటర్

IPL 2021 Suresh Raina Says Rishabh Pant Will Be Talismanic Leader - Sakshi

న్యూఢిల్లీ: రిషభ్‌ పంత్‌ తప్పకుండా గొప్ప నాయకుడు అవుతాడని టీమిండియా మాజీ ఆటగాడు సురేశ్‌ రైనా అభిప్రాయపడ్డాడు. కెప్టెన్‌గా రాణించగలిగే సామర్థ్యం అతడికి ఉందని పేర్కొన్నాడు. కాగా ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌-2021 సీజన్‌లో ఢిల్లీ క్యాపిటల్స్‌ కెప్టెన్‌గా టీమిండియా వికెట్‌ కీపర్‌ బ్యాట్స్‌మెన్‌ రిషభ్‌ పంత్‌ను నియమిస్తున్నట్లు యాజమాన్యం ప్రకటించిన విషయం తెలిసిందే. ఆ జట్టు రెగ్యులర్‌ కెప్టెన్‌ శ్రేయస్‌ అయ్యర్‌ గాయం కారణంగా టోర్నీకి దూరమైన నేపథ్యంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. ఈ విషయంపై ట్విటర్‌ వేదికగా స్పందించిన సురేశ్‌ రైనా, సారథ్య బాధ్యతలు సమర్థవంతంగా నెరవేర్చి పంత్‌ అందరినీ గర్వపడేలా చేస్తాడంటూ ప్రశంసించాడు. ఇక శ్రేయస్‌ అయ్యర్‌ సైతం, ఢిల్లీ క్యాపిటల్స్‌కు పంత్‌ వంటి అద్భుతమైన నాయకుడి అవసరం అని, తను తప్పకుండా జట్టుకు విజయాలు అందిస్తాడని ఆకాంక్షిస్తున్నట్లు పేర్కొన్నాడు.

ఢిల్లీ క్యాపిటల్స్‌ జట్టులో అజింక్య రహానే, రవిచంద్రన్‌ అశ్విన్‌, శిఖర్‌ ధవన్‌ వంటి సీనియర్‌ ప్లేయర్లు ఉన్నప్పటికీ యాజమాన్యం మాత్రం పంత్‌ వంటి యంగ్‌ అండ్‌ డైనమిక్‌ క్రికెటర్‌కే పగ్గాలు అప్పగించింది. తనకు దక్కిన ఈ అవకాశం పట్ల పంత్‌ హర్షం వ్యక్తం చేశాడు. ‘‘నేను పుట్టి పెరిగిన చోటు. ఆరేళ్ల క్రితం ఇక్కడే ఐపీఎల్‌ ప్రయాణం మొదలైంది. ఏదో ఒకరోజు ఈ జట్టుకు సారథ్యం వహించాలన్న నా కల నేడు నెరవేరింది. ఫ్రాంఛైజీ యజమానులకు నా కృత​జ్ఞతలు.

ఈ పాత్ర పోషించేందుకు నాకు పూర్తి సామర్థ్యం ఉందని నమ్మినందుకు ధన్యవాదాలు. మాకు అద్భుతమైన కోచింగ్‌ స్టాఫ్‌ ఉంది. నా చుట్టూ అనుభవజ్ఞులైన సీనియర్లు ఉన్నారు. నా బెస్ట్‌ పర్ఫామెన్స్‌ ఇచ్చేందుకు ఉత్సుకతతో ఎదురుచూస్తున్నా’’ అని పంత్‌ ఉద్వేగానికి లోనయ్యాడు. కాగా, గతేడాది రన్నరప్‌గా నిలిచిన ఢిల్లీ జట్టు‌.. ఈ సీజన్‌లో చెన్నై సూపర్‌ కింగ్స్‌తో తొలి మ్యాచ్‌ ఆడనుంది. ముంబైలో ఏప్రిల్‌ 10న ఈ మ్యాచ్‌ జరుగనుంది.


చదవండి: ఢిల్లీ క్యాపిటల్స్‌ నూతన సారధిగా రిషబ్‌ పంత్
'వైఫై అస్సలు బాలేదు.. సాయం చేయండి'

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top