రోహిత్‌ భాయ్‌ పెద్దగా ఏం చెప్పడు.. కానీ

IPL 2021 MI Rahul Chahar Says How Rohit Sharma Advice Helped Him - Sakshi

చెన్నై: కీలకమైన సమయంలో వికెట్లు తీసి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు ముంబై ఇండియన్స్‌ బౌలర్‌ రాహుల్‌ చహర్‌. కోల్‌కతా నైట్‌రైడర్స్‌ ఓపెనర్లు నితీశ్‌ రాణా(57), శుభ్‌మన్‌ గిల్‌(33) మధ్య 72 పరుగుల భాగస్వామ్యానికి చెక్‌పెట్టి ప్రత్యర్థి జట్టును కోలుకోలేని దెబ్బకొట్టాడు. వీరిద్దరి వికెట్లతో పాటు, రాహుల్‌ త్రిపాఠి, కెప్టెన్‌ ఇయాన్‌ మోర్గాన్‌లను సైతం పెవిలియన్‌కు పంపిన ఈ ముంబై స్సిన్నర్‌ మ్యాచ్‌ను తమవైపు తిప్పేశాడు. ఈ క్రమంలో ముంబై కోల్‌కతాపై 10 పరుగుల తేడాతో విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఇక మంగళవారం నాటి మ్యాచ్‌లో రాహుల్‌ చహర్‌ మొత్తంగా 4 ఓవర్లలో 27 పరుగులు మాత్రమే ఇచ్చి 4 వికెట్లు తీశాడు. తద్వారా మ్యాన్ ఆఫ్‌ ది మ్యాచ్‌గా నిలిచాడు. 

ఈ నేపథ్యంలో తన ప్రదర్శన గురించి రాహుల్‌ చహర్‌ మాట్లాడుతూ...  కెప్టెన్‌ రోహిత్‌ శర్మ సలహాలు సత్ఫలితాలను ఇచ్చాయని హర్షం వ్యక్తం చేశాడు. ‘‘నువ్వు చాలా మంచి బౌలర్‌వి.. ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగు అప్పుడు కచ్చితంగా రాణిస్తావు అని ఎల్లప్పుడూ చెబుతూ ఉంటాడు. అంతేకాదు, నెట్స్‌లో కొన్నిసార్లు నా బౌలింగ్‌లో తను ఇబ్బందులు ఎదుర్కొన్నానని గుర్తుచేశాడు. బంతిని ఎలా టర్న్‌ చేయాలా అన్న అంశంపై దృష్టిసారించమని సూచించాడు. అంతకు మించి పెద్దగా ఏమీ చెప్పడు. ఒత్తిడి పడనివ్వడు. ఇక ఈ మ్యాచ్‌లో స్పిన్నర్‌ మాత్రమే పరిస్థితులను మార్చగలడని అర్థమైన తర్వాత.. నాలో ఆత్మవిశ్వాసం రెట్టించింది. నిజం చెప్పాలంటే, సైకాలజికల్‌గా కూడా మేం పైచేయి సాధించాం. ముఖ్యంగా రాహుల్‌ త్రిపాఠికి నేను బౌలింగ్‌ చేస్తున్న సమయంలో, స్లిప్‌లో ఇద్దరిని పెట్టాం. మోర్గాన్‌కు స్లిప్‌, లెగ్‌ స్లిప్‌ ప్లేస్‌ చేశాం. ఇలాంటి కెప్టెన్సీ టెక్నిక్స్‌ నాలో మరింత కాన్ఫిడెన్స్‌ను పెంచాయి’’ అని చెప్పుకొచ్చాడు.

స్కోర్లు: ముంబై ఇండియన్స్‌-152 (20)
కేకేఆర్‌- 142/7 (20)

చదవండి: ఏడేళ్ల తర్వాత రోహిత్‌.. ఇది వ్యూహం కాదంటారా?

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top