
భారత ఏ మహిళల క్రికెట్ జట్టు ఆస్ట్రేలియా గడ్డపై సంచలనం సృష్టించింది. మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌ను మరో మ్యాచ్ మిగిలుండగానే 2-0 తేడాతో కైవసం చేసుకుంది. తద్వారా ఈ సిరీస్‌కు ముందు టీ20 సిరీస్‌లో (ఆసీస్ చేతిలోనే) ఎదురైన క్లీన్ స్వీప్ (0-3) పరాభవానికి ప్రతీకారం తీర్చుకుంది.
బ్రిస్బేన్ వేదికగా ఇవాళ (ఆగస్ట్ 15) జరిగిన రెండో వన్డేలో భారత్ 2 వికెట్ల తేడాతో ఆసీస్‌ను మట్టికరిపించింది. దీనికి ముందు ఇదే వేదికగా జరిగిన తొలి వన్డేలోనూ భారత్ ఇదే తరహాలో ఆసీస్‌పై విజయం సాధించింది.
రెండో వన్డేలో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన ఆసీస్.. అలైస్సా హీలీ (91), కిమ్ గార్త్ (41 నాటౌట్) సత్తా చాటడంతో నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 265 పరుగులు చేసింది.
భారత బౌలర్లలో మిన్ను మణి (10-1-46-3), సైమా ఠాకోర్ (8-1-30-2) ఆసీస్ బ్యాటర్లను ఇబ్బంది పెట్టారు. రాధా యాదవ్, టైటాస్ సాధు, ప్రేమా రావత్, తనుజా కన్వర్ తలో వికెట్ తీశారు.
అనంతరం 266 పరుగుల లక్ష్య ఛేదనకు దిగిన భారత్.. మరో బంతి మాత్రమే మిగిలుండగా 8 వికెట్లు కోల్పోయి విజయాన్ని అందుకుంది. 193 పరుగులకే 7 వికెట్లు కోల్పోయి ఓటమి దిశగా సాగుతున్న దశలో తనూజా కన్వర్ (50), పేమా రావత్ (32 నాటౌట్) అద్బుతమైన పోరాటపటిమ కనబర్చి భారత్‌ను గెలిపించారు.
అంతకుముందు యస్తికా భాటియా (66), కెప్టెన్ రాధా యాదవ్ (60) అర్ద సెంచరీలతో రాణించారు. ఆసీస్ బౌలర్లలో జార్జియా, యామీ ఎడ్గర్, హేవర్డ్ తలో 2 వికెట్లు తీయగా.. కిమ్ గార్త్ ఓ వికెట్ దక్కించుకుంది.
ఈ సిరీస్‌లో నామమాత్రపు మూడో వన్డే ఇదే వేదికగా ఆగస్ట్ 17న జరుగనుంది. ఈ మ్యాచ్ అనంతరం భారత్ ఆసీస్‌తోనే ఓ అనధికారిక టెస్ట్ మ్యాచ్ కూడా ఆడనుంది. ఈ మ్యాచ్ ఆగస్ట్ 21న ప్రారంభమవుతుంది.