India Tour Of Sri Lanka: Dhanashree Verma Emotional Post On Yuzvendra Chahal Birthday - Sakshi
Sakshi News home page

Yuzvendra Chahal Birthday: నీది చాలా పెద్ద మనసు..

Jul 23 2021 3:38 PM | Updated on Jul 23 2021 6:12 PM

Ind Vs Sl: Yuzvendra Chahal Birthday Wife Dhanashree Emotional Post - Sakshi

న్యూఢిల్లీ: టీమిండియా లెగ్‌ స్సిన్నర్‌ యజువేంద్ర చాహల్‌ నేడు(జూలై 23) 31వ వసంతంలో అడుగుపెట్టాడు. ఈ సందర్భంగా సహచర ఆటగాళ్లు, అభిమానుల నుంచి సోషల్‌ మీడియా వేదికగా అతడికి శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. హ్యాపీ బర్త్‌డే ప్రాంక్‌స్టర్‌ అంటూ కేఎల్‌ రాహుల్‌ విష్‌ చేయగా... నా సోదరుడికి పుట్టినరోజు శుభాకాంక్షలు అని కుల్దీప్‌ యాదవ్‌ ప్రేమను కురిపించాడు. ఇక అంతర్జాతీయ టీ20లలో అత్యంత వేగంగా 50 వికెట్లు తీసిన భారత బౌలర్‌కు హ్యాపీ బర్త్‌డే అంటూ ఇంటర్నేషనల్‌ క్రికెట్‌ కౌన్సిల్ ట్వీట్‌ చేసింది. అదే విధంగా... ‘‘104 అంతర్జాతీయ మ్యాచ్‌లు, 159 వికెట్లు.. అంతర్జాతీయ టీ20ల్లో ఒకే మ్యాచ్‌లో ఐదు వికెట్లు తీసిన తొలి భారత ఆటగాడు’’ అని యుజీ గణాంకాలను కీర్తిస్తూ బీసీసీఐ బర్త్‌డే విషెస్‌ తెలిపింది.

చహల్‌ భార్య భావోద్వేగం
‘‘ఎంత ఎత్తుకు ఎదిగినా ఒద్దికగా ఉండటం, దయ, సహాయ గుణం, ఇతరులతో మర్యాదపూర్వకంగా వ్యవహరించడం, నిస్వార్థంగా ముందుకు సాగడం.. ఇలాంటి సుగుణాలన్నీ కలగలిసి ఉన్న వ్యక్తి మిస్టర్‌ యుజువేంద్ర చాహల్‌. నీ స్థాయి ఏమిటన్న విషయం గురించి నువ్వు అస్సలు పట్టించుకోవు. చాలా హుందాగా ఉంటావు. ఇలాంటి పరిపక్వత సాధించడం అంత తేలికేమీ కాదు. దేశం కోసం నువ్వు సాధించిన విజయాలు అమోఘం. చాలా పెద్ద మనసు నీది. నీ నుంచి అనేక విషయాలు నేర్చుకుంటున్నాను నేను. నిన్ను చూసి ఎల్లప్పుడూ గర్విస్తూనే ఉంటాను. హ్యాపీ బర్త్‌డే’’ అంటూ చహల్‌ భార్య ధనశ్రీ వర్మ భావోద్వేగపూరిత నోట్‌ షేర్‌ చేసింది.

ఈ సందర్భంగా భర్తతో దిగిన ఫొటోలను ఇన్‌స్టాలో షేర్‌ చేసింది. ఇందుకు స్పందించిన యుజీ.. ‘‘ధన్యవాదాలు సతీమణి’’ అంటూ భార్యపై ప్రేమను చాటుకున్నాడు. కాగా చహల్‌, యూట్యూబర్‌ ధనశ్రీ వర్మ గతేడాది డిసెంబరులో పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. కాగా చహల్‌ ప్రస్తుతం శ్రీలంక పర్యటనలో ఉన్నాడు. శిఖర్‌ ధావన్‌ నేతృత్వంలోని భారత జట్టు శుక్రవారం కొలంబోలో జరిగే చివరివన్డేలో టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ ఎంచుకుంది. అయితే, ఐదుగురు కొత్త ఆటగాళ్లు అరంగేట్రం చేసిన నేపథ్యంలో యుజీకి తుదిజట్టులో చోటుదక్కలేదు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement