IND Vs ENG 3rd Test: కోహ్లి ఫిఫ్టి కొట్టాడు.. ఎలానో చూడండి..

IND Vs ENG 3rd Test: Virat Kohli Century Drought Reached 50 Innings - Sakshi

లీడ్స్‌: ఇంగ్లండ్ పర్యటనలో టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లి పేలవ ప్రదర్శన కొనసాగుతోంది. లీడ్స్ వేదికగా బుధవారం ఆరంభమైన మూడో టెస్టులో టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ ఎంచుకున్న భారత్‌ 78 పరుగులకే ఆలౌటైంది. కోహ్లి (7) మరోసారి దారుణంగా నిరాశపరిచాడు. ఆండర్సన్‌ బౌలింగ్‌లో ఆఫ్ స్టంప్‌కి ఆవల వెళ్తున్న బంతిని వెంటాడి మరీ వికెట్‌ కీపర్ జోస్ బట్లర్‌కి క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. ఈ క్రమంలో టెస్ట్‌ల్లో కోహ్లిని అత్యధిక సార్లు(7) ఔట్‌ చేసిన బౌలర్‌గా ఆండర్సన్‌ రికార్డు నెలకొల్పాడు. 

ఇదిలా ఉంటే, కోహ్లి గత ఏడాదిన్నర కాలంగా బ్యాటింగ్​లో గడ్డు కాలాన్ని ఎదుర్కొంటున్నాడు. అతను చివరిసారిగా  2019 నవంబర్​లో బంగ్లాదేశ్​పై (డే/నైట్ టెస్ట్) సెంచరీ సాధించాడు. ఆ తర్వాత అడపాదడపా అర్ధశతకాలు చేశాడు. ఇప్పటి వరకూ టెస్ట్‌లు, వన్డేల్లో కలిపి 70 శతకాలు సాధించిన కోహ్లి.. ఇంగ్లండ్‌ సిరీస్​లోనైనా 71వ శతకాన్ని సాధిస్తాడని అభిమానులు ఆశగా ఎదురుచూశారు. 2008లో క్రికెట్​లోకి అడుగుపెట్టిన తర్వాత ప్రతి ఏడాది శతకం సాధిస్తూ వచ్చిన ​ఈ రన్‌ మెషీన్‌.. 2020లో మాత్రమే మూడెంకల స్కోరు అందుకోలేకపోయాడు. 2021లో కూడా అదే దిశగా సాగుతున్నాడు.

కాగా, నేటి ఇన్నింగ్స్‌తో కోహ్లి శతక్కొట్టక 50 ఇన్నింగ్స్‌లు పూర్తి అయ్యాయి. మూడు ఫార్మాట్‌లలో కలిపి గడిచిన 50 ఇన్నింగ్స్‌లలో అతను మూడంకెల స్కోర్‌ను చేరుకోలేకపోయాడు. ఇందులో 18 టెస్ట్ ఇన్నింగ్స్‌లు, 15 వన్డే ఇన్నింగ్స్‌లు, 17 టీ20 ఇన్నింగ్స్‌లు ఉన్నాయి. దీంతో మూడో టెస్టుతో కోహ్లి హాఫ్ సెంచరీ కొట్టాడని అభిమానులు సెటైర్లు వేస్తున్నారు. కోహ్లీ 71 సెంచరీ చేయడం ఓ కలగా మిగిలిపోనుంది.. అతను రిటైర్మెంట్ ప్రకటించాల్సిన సమయం ఆసన్నమైందంటూ నెటిజన్లు కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు.

చదవండి: హార్ధిక్‌ పాండ్యా రిస్ట్‌ వాచ్‌ ధరెంతో తెలిస్తే కళ్లు బైర్లు కమ్మాల్సిందే..

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top