పాపం టీ20 తరహాలో ఆడాడు.. ట్విస్ట్‌ ఏంటంటే

Hasan Ali Super Century But Match Drawn By Loosing Wicket For Last Run - Sakshi

కరాచీ: టెస్టు మ్యాచ్ అంటేనే జిడ్డు ఆటకు మారుపేరు.బ్యాట్స్‌మెన్లు గంటలకొద్ది క్రీజులో నిలబడి బౌలర్ల ఓపికను పరీక్షిస్తూ మ్యాచ్‌లను ఓటమి నుంచి గట్టెక్కించిన సందర్భాలు చాలానే ఉన్నాయి. కానీ టెస్టు క్రికెట్‌లో వన్డే తరహా ఇన్నింగ్స్‌లను చూడడం అరుదు.. అలాంటిది  పాకిస్తాన్‌ బ్యాట్స్‌మన్‌ మాత్రం టీ20 తరహా ఇన్నింగ్స్‌తో అదుర్స్‌ అనిపించాడు. అయితే ఇక్కడ ట్విస్ట్‌ ఏంటంటే.. ఆ బ్యాట్స్‌మన్‌ అంత ధాటిగా ఆడినా జట్టును గెలిపించలేకపోయాడు. విజయానికి ఒక్క పరుగు అవసరమైన దశలో చివరి వికెట్‌ పడడంతో మ్యాచ్ డ్రాగా ముగిసింది. దీంతో ట్రోపిని ఇరుజట్లు పంచుకున్నాయి. అయితే ఇదంతా పాక్‌ దేశవాళి ఫస్ట్‌క్లాస్‌ క్రికెట్‌ చోటుచేసుకుంది.(చదవండి : బెట్టింగ్‌ కోసం ఏకంగా ఐపీఎల్‌ ఆటగాడికే ఫోన్‌?)

క్వాయిడ్-ఎ-అజామ్ టోర్నీలో భాగంగా ఖైబర్ పఖ్తున్ఖ్వా, సెంట్రల్‌ పంజాబ్‌ల మధ్య ఫైనల్‌ మ్యాచ్‌ జరిగింది. ఈ మ్యాచ్‌లో ఖైబర్‌ పఖ్తున్ఖ్వా సెంట్రల్‌ పంజాబ్‌ ముందు 355 పరుగులు లక్ష్యాన్ని ఉంచింది. భారీ లక్ష్యంతో బరిలోకి సెంట్రల్‌ జట్టు 202 పరుగులకే ఆరు వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడి ఓటమి దిశగా పయనిస్తుంది. ఈ దశలో క్రీజులోకి వచ్చిన కెప్టెన్‌ హసన్‌ అలీ ఆరంభం నుంచి ధాటిగా ఆడాడు. టీ20 తరహాలో 61 బంతుల్లోనే 106 పరుగులు సాధించాడు. అతని ఇన్నింగ్స్‌లో 10 ఫోర్లు, 7 సిక్సర్లు ఉన్నాయి. ఒకవైపు సహచరులు ఒక్కొక్కరుగా వెనుదిరుగుతున్నా అలీ మాత్రం సిక్సర్ల వర్షంతో స్టేడియాన్ని హోరెత్తించాడు. అతని విధ్వంసం ధాటికి కొండంత లక్ష్యం చూస్తుండగానే కరిగిపోయింది. సెంట్రల్‌ పంజాబ్‌ 319 పరుగుల వద్ద 9వ వికెట్‌ కోల్పోయినా.. జట్టు చివరి బ్యాట్స్‌మన్‌ వకాస్‌ మసూద్‌ సహకారంతో అలీ  తన బ్యాటింగ్‌ కొనసాగిస్తూ.. 355 పరుగుల  దాకా తీసుకొచ్చి స్కోరును సమం చేశాడు. ఇంకా ఒక్క పరుగు చేస్తే సెంట్రల్‌ పంజాబ్‌ చారిత్రాత్మక విజయాన్ని నమోదు చేసి ఉండేది. కానీ ఇక్కడే పెద్ద ట్విస్టు చోటుచేసుకుంది. (చదవండి: టెస్టు సిరీస్‌: కేఎల్‌ రాహుల్‌ అవుట్‌)


ఇన్నింగ్స్‌ 118వ ఓవర్‌ను సాజిద్‌ ఖాన్‌ వేశాడు. తొలి రెండు బంతులను సమర్థంగా ఎదుర్కొన్న వకాస్‌ మసూద్‌ను సాజిద్‌ తన మూడో బంతితో బోల్తా కొట్టించాడు.  దీంతో సెంట్రల్‌ పంజాబ్‌ 355 పరుగుల వద్ద చివరి వికెట్‌ కోల్పోవడంతో వారి ఇన్నింగ్స్‌ ముగిసింది. దీంతో సెంచరీ చేసి కూడా జట్టును గెలిపించలేకపోయాననే భావనతో హసన్‌ అలీ నిరాశగా మైదానంలో కూలబడ్డాడు. కేవలం ఒక్క పరుగు చేసుంటే సెంట్రల్‌ పంజాబ్‌ విజయం దక్కడంతో పాటు కెప్టెన్‌ ఇన్నింగ్స్‌తో అలరించిన అలీ మ్యాచ్‌ ఆఫ్‌ ది స్టార్‌గా నిలిచేవాడు.కాగా ఈ వీడియోనూ ఐసీసీ ట్విటర్‌లో షేర్‌ చేయగా.. సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది.'అలీ కెప్టెన్‌ ఇన్నింగ్స్‌ ఆడి సెంచరీ చేసినా జట్టును గెలిపించలేకపోయాడు.. పాపం తాను ఒకటి తలిస్తే.. దైవం ఒకటి తలవడం అంటే ఇదేనేమో.. ఏ గ్రేట్‌ షో బై హసన్‌ అలీ ' అంటూ కామెంట్లు పెడుతూ అలీని పొగడ్తలలో ముంచెత్తారు.

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top