MS Dhoni: ధోని అభిమానులకు వరుస శుభవార్తలు.. తాజాగా మరొకటి

First Retention Card At Auction Will Be Used For Dhoni: చెన్నై సూపర్ కింగ్స్ ఐపీఎల్-2021 టైటిల్ చేజిక్కించుకున్న నాటి నుంచి ఆ జట్టు సారధి మహేంద్ర సింగ్ ధోని అభిమానులకు వరుసగా శుభవార్తలు వినిపిస్తూనే ఉన్నాయి. తొలుత ధోని రెండోసారి తండ్రి కాబోతున్నాడన్న వార్త విని సంబరపడిపోయిన ఆయన అభిమానులు.. తాజాగా సీఎస్‌కే యాజమాన్యం చేసిన ప్రకటనతో ఎగిరి గంతులేస్తున్నారు. తాము ఉపయోగించబోయే తొలి రిటెన్షన్ కార్డు ధోని కోసమే అని సీఎస్‌కే వర్గాలు అధికారికంగా ప్రకటించడంతో తలా ఫ్యాన్స్ ఉబ్బితబ్బిబైపోతున్నారు. దీంతో వచ్చే ఐపీఎల్ సీజన్‌కు ధోని అందుబాటులో ఉంటాడో లేదోనన్న ఉత్కంఠకు తెరపడినట్లైంది.
కాగా, తాను సీఎస్‌కేతోనే ఉండాలని అనుకుంటున్నానని, చెన్నైలో ఫేర్‌వెల్ గేమ్ ఆడాలని అనుకుంటున్నానని ధోని గతంలో చెప్పిన సంగతి తెలిసిందే. అయితే ఐపీఎల్-2022లో ధోని ఆడేది లేనిది బీసీసీఐ రిటెన్షన్ పాలసీపై ఆధారపడి ఉంటుంది. ఒకవేళ ఆటగాళ్లకు అట్టిపెట్టుకునే పాలసీకి బీసీసీఐ స్వస్తి పలికితే.. ధోని ఐపీఎల్‌కు సైతం వీడ్కోలు పలికే అవకాశాలు లేకపోలేదంటూ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఇదిలా ఉంటే, ఐపీఎల్-2021 ఫైనల్‌లో ధోనీ సారథ్యంలోని చెన్నై సూపర్ కింగ్స్ జట్టు కోల్‌కతా నైట్ రైడర్స్‌పై 27 పరుగుల తేడాతో విజయం సాధించి నాలుగోసారి టైటిల్ ఎగరేసుకుపోయింది.
చదవండి: నువ్వు కాకపోతే ఇంకొకరు.. పంత్‌కు కోహ్లి వార్నింగ్..!