'రైనా.. ప్లీజ్‌ తిరిగి రావా'

Fans Demand Suresh Raina Return After CSK Poor Performance IPL 2020 - Sakshi

ముంబై : ఐపీఎల్‌ 13వ సీజన్‌లో టైటిల్‌ ఫేవరెట్లలో ఒకటిగా బరిలోకి దిగిన చెన్నై సూపర్‌ కింగ్స్‌ వరుసగా రెండో ఓటమి నమోదు చేసుకుంది. ఇప్పటివరకు ఈ సీజన్‌లో మూడు మ్యాచ్‌లు ఆడితే.. ముంబైతో మ్యాచ్‌ మినహా రాజస్తాన్‌, డిల్లీతో జరిగిన మ్యాచ్‌ల్లో పూర్తిగా విఫలమైంది. బౌలింగ్‌లో ఎంతో కొంత నయంగా కనిపిస్తున్న చెన్నై బ్యాటింగ్‌లో మాత్రం పూర్తిగా విఫలమవుతూ వస్తుంది. మిడిలార్డర్‌లో డుప్లెసిస్‌ తప్ప ఓపెనర్లు వాట్సన్‌, మురళీ విజయ్‌, రుతురాజ్‌, కేదార్‌ జాదవ్‌లు తమ ఆటతీరుతో తీవ్ర నిరాశ పరుస్తున్నారు. ఇక ధోని బ్యాటింగ్‌ అంశంపై ఇప్పటికీ చర్చ నడుస్తూనే ఉంది. జట్టు కష్టాల్లో ఉన్నప్పుడు ధోని ఏడో స్థానంలో బ్యాటింగ్‌ రావడమేంటని విమర్శలు వస్తున్నాయి. ఇక ఆల్‌రౌండర్లుగా రవీంద్ర జడేజా, శ్యామ్‌ కర్జన్‌లు పూర్తిగా తేలిపోతున్నారు.

ముంబైతో మ్యాచ్‌లో అంబటి రాయుడు, డుప్లెసిస్‌ ప్రదర్శనతో గట్టెక్కిన చెన్నై రెండో మ్యాచ్‌కు వచ్చేసరికి రాయుడు గాయంతో దూరమవ్వడంతో నాసిరక ప్రదర్శన చేసింది. డుప్లెసిస్‌ ఒక్కడే పోరాడుతున్నా.. అతనికి సహకరించేవారు కరువయ్యారు. దీంతో సురేశ్‌ రైనా అంశం మరోసారి తెరమీదకు వచ్చింది. రైనా జట్టులో ఉండి ఉంటే పరిస్థితి ఇలా ఉండేది కాదని.. టాప్‌ ఆర్డర్‌ పటిష్టంగా ఉండేదని.. చెన్నైకు ఇన్ని కష్టాలు ఉండేవి కాదని అభిమానులు అంటున్నారు. ఈ నేపథ్యంలో రైనా తిరిగి ఐపీఎల్‌కు రావాలంటూ సోషల్‌ మీడియా వేదికగా పేర్కొంటున్నారు. ' రైనా.. నీ అవసరం జట్టుకు ఎంతో ఉంది. మిడిలార్డర్‌లో నీ స్థానాన్ని ఎవరు భర్తీ చేయలేరు. ప్లీజ్‌.. రైనా తిరిగిరావా' అంటూ సోషల్‌ మీడియా వేదికగా సీఎస్‌కే అభిమానులు వేల సంఖ్యలో మెసేజ్‌లు చేస్తున్నారు.(చదవండి : రైనా, రాయుడు లోటు స్పష్టంగా తెలుస్తుంది)

ఐపీఎల్‌ 13వ సీజన్‌ ఆరంభానికి ముందే రైనా జట్టుతో కలిసి దుబాయ్‌కు చేరుకున్నాడు. అయితే కొన్ని వ్యక్తిగత కారణాల రిత్యా ఈ ఐపీఎల్ సీజన్‌‌ నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించి దుబాయ్‌ నుంచి ఇండియాకు తిరుగుపయనమయ్యాడు. అయితే చెన్నై జట్టు యాజమాన్యంతో రైనాకు పొసగలేదని.. శ్రీనివాసన్‌తో విభేదాలు వచ్చాయంటూ .. అందుకే ఐపీఎల్‌ ఆడకుండానే వెనుదిరిగాడంటూ పుకార్లు వచ్చాయి. అయితే అదే సమయంలో రైనా కుటుంబంలో విషాదం చోటుచేసుకోవడం.. ఆ కారణంతోనే తిరిగి వచ్చాడా అన్న విషయంలో కూడా క్లారిటీ లేదు. రైనా ఈ పుకార్లన్నింటికి ఫుల్‌స్టాప్‌ పెడుతూ.. కొన్ని వ్యక్తిగత కారణాల వల్లనే లీగ్‌కు దూరమయ్యానని.. త్వరలోనే చెన్నై జట్టులో చేరుతానని వెల్లడించాడు. అయితే రైనా కమ్‌బ్యాక్‌పై చెన్నై జట్టు యాజమాన్యం ఎలాంటి క్లారిటీ లేదు.

ఒకవేళ ఇప్పటికిప్పుడు ఐపీఎల్‌ ఆడేందుకు దుబాయ్‌కు చేరుకున్నా.. వెంటనే బరిలోకి దిగే అవకాశం రైనాకు లేదు. ఐపీఎల్‌ నిబంధనల ప్రకారం ఏ ఆటగాడైనా సరే క్వారంటైన్‌లో ఉండాల్సిందే. కరోనా పరీక్షల్లో నెగిటివ్‌ వస్తేనే మ్యాచ్‌లు ఆడేందుకు అనుమతి ఇస్తారు. బీసీసీఐ క్వారంటైన్‌ను 36 గంటలు కుదించినప్పటికి రైనా దుబాయ్‌కు చేరినా ముందుగా కరోనా పరీక్ష చేయించుకోవాల్సిందే. అయితే ఈ విషయంలో రైనా ఇంకా ఎలాంటి సమాచారం అందించలేదు. ఇదిలా ఉంటే ఐపీఎల్‌ 13వ సీజన్‌ సీఎస్‌కే, ముంబై ఇండియన్స్‌ ప్రారంభ మ్యాచ్‌కు చెన్నై జట్టుకు ఆల్‌ ది బెస్ట్‌ చెబుతూ ట్వీట్‌ చేసిన సంగతి తెలిసిందే. నిజంగా రైనా లేకపోవడం చెన్నైకి పెద్ద దెబ్బేనని ఇప్పుడిప్పుడే అర్థమవుతుంది. కాగా సురేశ్‌ రైనా ఐపీఎల్‌లో 193 మ్యాచ్‌లాడి 5368 పరుగులు చేశాడు.  ఐపీఎల్‌లో 5వేల పరుగులు పూర్తి చేసిన మొదటి బ్యాట్స్‌మన్‌గా రైనా రికార్డులకెక్కాడు. ఆగస్టు 15, 2020న రైనా అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్‌ ప్రకటించాడు. (చదవండి : ఆ తప్పు మళ్లీ చేయకూడదనుకున్నా : పృథ్వీ షా)

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి 

Read also in:
Back to Top