భారత మాజీ క్రికెటర్ లక్ష్మణ్ శివరామకృష్ణన్ కీలక ప్రకటన చేశాడు. భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) కామెంట్రీ ప్యానెల్ నుంచి వైదొలిగినట్లు తెలిపాడు. ఇకపై బీసీసీఐ కామెంట్రీలో తాను కనిపించబోనంటూ రిటైర్మెంట్ ప్రకటించాడు.
శరీర రంగు నల్లగా ఉన్న కారణంగా
ఈ సందర్భంగా లక్ష్మణ్ శివరామకృష్ణన్ బీసీసీఐపై సంచలన ఆరోపణలు చేశాడు. తన శరీర రంగు నల్లగా ఉన్న కారణంగా వివక్ష చూపారని.. అందుకే తనకు తగినన్ని అవకాశాలు రాలేదని ఆరోపించాడు. తమిళనాడుకు చెందిన లక్ష్మణ్ శివరామకృష్ణన్ 1980వ దశకంలో టీమిండియాకు ఆడాడు.
సంచలన ప్రదర్శనలు
అంతర్జాతీయ క్రికెట్‌లో తొమ్మిది టెస్టుల్లో 130 పరుగులు, 26 వికెట్లు తీసిన లక్ష్మణ్ శివరామకృష్ణన్.. 16 వన్డేలు ఆడి 15 వికెట్లు పడగొట్టాడు. టెస్టు అరంగేట్రంలో ఒక్క వికెట్ కూడా తీయని ఈ స్పిన్ బౌలర్.. 1984లో ఇంగ్లండ్‌తో మ్యాచ్‌లో ఏకంగా 12 వికెట్లు తీసి జట్టును గెలిపించి వార్తల్లో నిలిచాడు.
అంతేకాదు 1985లో ఆస్ట్రేలియా వేదికగా సునిల్ గావస్కర్ కెప్టెన్సీలో బెన్సన్ హెడ్జెస్ వరల్డ్ చాంపియన్‌షిప్ గెలవడంలోనూ లక్ష్మణ్ శివరామకృష్ణన్ కీలక పాత్ర పోషించాడు. పాకిస్తాన్‌తో నాటి ఫైనల్లో ప్రత్యర్థిని 176 పరుగులకే కట్టడి చేయడంలో సహకరించి.. భారత్ విజయానికి కృషి చేశాడు.

ఇక ఆటకు స్వస్తి పలికిన తర్వాత లక్ష్మణ్ శివరామకృష్ణన్ 2000 సంవత్సరంలో కామెంటేటర్‌గా కెరీర్ ఆరంభించాడు. ఐసీసీ క్రికెట్ కమిటీలో ప్లేయర్ రిప్రజెంటేటివ్‌గానూ పనిచేశాడు. ఈ క్రమంలో శుక్రవారం కామెంట్రీకి రిటైర్మెంట్ ప్రకటిస్తూ లక్ష్మణ్ శివరామకృష్ణన్ సోషల్ మీడియా వేదికగా చర్చకు తెరలేపాడు.
శాస్త్రి కోచ్‌గా ఉన్న సమయంలోనూ
‘‘బీసీసీఐ కామెంట్రీకి రిటైర్మెంట్ ప్రకటిస్తున్నా. 23 ఏళ్ల కాలంలో టాస్‌లు వేయడానికి, ప్రెజెంటేషన్ ఇవ్వడానికి నేను పనికిరాలేదు. కానీ కొత్త వాళ్లు వచ్చి పిచ్ రిపోర్టులు ఇస్తూ. టాస్ ప్రజెంటేషన్లు ఇచ్చారు. శాస్త్రి కోచ్‌గా ఉన్న సమయంలోనూ నాకు అవకాశం రాలేదు. దీనికి కారణం ఏమనుకుంటున్నారు?’’ అంటూ లక్ష్మణ్ శివరామకృష్ణన్ వరుసగా ట్వీట్లు చేశాడు.
వర్ణ వివక్ష
ఇందుకు ఓ నెటిజన్.. ‘‘మీరు రంగు తక్కువ కాబట్టి’’ అని కామెంట్ చేయగా.. ‘‘సరిగ్గా చెప్పారు’’ అని శివరామకృష్ణన్ సమాధానం ఇచ్చాడు. మరో నెటిజన్ కూడా ఇలాగే కామెంట్ చేయగా.. ‘‘అవును.. మీరు చెప్పింది నిజం. వర్ణ వివక్ష’’ అని పేర్కొన్నాడు. అయితే, మరికొంత మంది మాత్రం ఉన్నన్ని రోజులు బోర్డును వాడుకుని.. ఇలా నిందించడం కొందరికి అలవాటేనంటూ లక్ష్మణ్ శివరామకృష్ణన్‌ను విమర్శించారు.

అవునా?
ఇదిలా ఉంటే.. టీమిండియా దిగ్గజ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ కూడా లక్ష్మణ్ శివరామకృష్ణన్ పోస్ట్‌పై స్పందించాడు. ‘‘ఓహ్.. ఇలా ఎందుకు? ఈసారి ఐపీఎల్‌కు ముందే ఎందుకిలా?’’ అని కామెంట్ చేశాడు. అయితే, అశూ వ్యంగ్యంగానే ఇలా స్పందించాడని అభిమానులు అంటున్నారు.
గతంలో అశూను లక్ష్మణ్ శివరామకృష్ణన్ విమర్శిస్తూ పోస్ట్ పెట్టాడు. అశ్విన్ భారత్‌లో మాత్రమే రాణించగలడని.. SENA (సౌతాఫ్రికా, ఇంగ్లండ్, న్యూజిలాండ్, ఆస్ట్రేలియా) దేశాల్లో అతడి బౌలింగ్ రికార్డు ఘోరంగా ఉందంటూ విమర్శించాడు.
చదవండి: అతడికి ఆ అవసరం లేదు: బీసీసీఐ


