
ఇంగ్లండ్ జట్టు (PC: ICC)
ఇంగ్లండ్ క్రికెట్ జట్టు స్వదేశంలో సౌతాఫ్రికా (ENG vs SA)తో పరిమిత ఓవర్ల సిరీస్‌లకు సిద్ధమైంది. ప్రొటిస్ జట్టుతో సెప్టెంబరు 2- 14 మధ్య మూడు వన్డే, మూడు టీ20 మ్యాచ్‌లు ఆడనుంది. ఇందులో భాగంగా తొలుత వన్డే సిరీస్ జరుగనుంది.
అన్‌క్యాప్డ్ ప్లేయర్‌కు చోటు
ఈ క్రమంలో లీడ్స్ (Leeds ODI)లోని హెడింగ్లీ మైదానంలో మంగళవారం జరిగే తొలి వన్డేకు ఇంగ్లండ్ తమ తుదిజట్టును ప్రకటించింది. హ్యారీ బ్రూక్ సారథ్యంలోని ఈ ప్లేయింగ్ ఎలెవన్‌లో హాంప్‌షైర్ యువ కెరటం సోనీ బేకర్‌కు చోటు దక్కింది.
దీంతో 22 ఏళ్ల ఈ ఫాస్ట్ బౌలర్ అంతర్జాతీయ క్రికెట్‌లో అడుగుపెట్టడం ఖరారైంది. కాగా ది హండ్రెడ్ లీగ్‌లో సోనీ బేకర్ మెరుగైన ప్రదర్శన కనబరిచాడు. తొమ్మిది వికెట్లతో ఈ లీగ్‌లో సత్తా చాటాడు.
ఇక లిస్ట్-ఎ క్రికెట్‌లో సోనీ బేకర్‌కు మంచి రికార్డే ఉంది. ఇప్పటి వరకు అతడు 24 వికెట్లు పడగొట్టాడు. ఇక ఇప్పుడు.. సౌతాఫ్రికాతో తొలి వన్డేకు ఇంగ్లండ్ పేస్ దళంలో జోఫ్రా ఆర్చర్, బ్రైడన్ కార్స్‌లతో సోనీ బేకర్ భాగం కానున్నాడు.

ఇదిలా ఉంటే.. జేమీ స్మిత్, బెన్ డకెట్ ఇంగ్లండ్ ఇన్నింగ్స్ ఆరంభించనుండగా.. మూడో స్థానంలో టెస్టు దిగ్గజం జో రూట్.. నాలుగో స్థానంలో కెప్టెన్ బ్రూక్ బ్యాటింగ్ చేయనున్నాడు. ఇక మాజీ కెప్టెన్ జోస్ బట్లర్‌తో జేకబ్ బెతెల్ కూడా జట్టులో స్థానం దక్కించుకోగా.. స్పిన్ ఆల్‌రౌండర్ విల్ జాక్స్ ఏడో స్థానంలో బరిలోకి దిగనున్నాడు.
వరల్డ్‌క్లాస్ బ్యాటర్లకు బౌల్ చేసి..
ది హండ్రెడ్ లీగ్‌లో మాంచెస్టర్ ఒరిజినల్స్ జట్టుకు సోనీ బేకర్ ప్రాతినిథ్య వహించాడు. గంటకు 145 కిలోమీటర్ల వేగంతో నిలకడగా బౌలింగ్ చేసిన అతడు.. కేన్ విలియమ్సన్, డేవిడ్ వార్నర్, స్టీవ్ స్మిత్, జానీ బెయిర్ స్టో వంటి ప్రపంచస్థాయి బ్యాటర్లను కూడా భయపెట్టాడు.
ఈ క్రమంలో హ్యారీ బ్రూక్ దృష్టిని ఆకర్షించిన ఈ హాంప్‌షైర్ బౌలర్.. ఏకంగా జాతీయ జట్టు సెలక్టర్ల నుంచి పిలుపు అందుకోవడమే గాక.. తుదిజట్టులోనూ చోటు సంపాదించుకున్నాడు.
సౌతాఫ్రికాతో వన్డేలకు ఇంగ్లండ్ జట్టు
హ్యారీ బ్రూక్ (కెప్టెన్), రెహాన్ అహ్మద్, జోఫ్రా ఆర్చర్, సోనీ బేకర్, టామ్ బాంటన్, జేకబ్ బేతెల్, జోస్ బట్లర్, బ్రైడన్ కార్స్, బెన్ డకెట్, విల్ జాక్స్, సకీబ్ మహమూద్, జేమీ ఓవర్టన్, ఆదిల్ రషీద్, జో రూట్, జేమీ స్మిత్.
సౌతాఫ్రికాతో తొలి వన్డేకు ఇంగ్లండ్ తుదిజట్టు
జేమీ స్మిత్, బెన్ డకెట్, జో రూట్, హ్యారీ బ్రూక్ (కెప్టెన్), జోస్ బట్లర్, జేకబ్ బెతెల్, విల్ జాక్స్, బ్రైడన్ కార్స్, జోఫ్రా ఆర్చర్, ఆదిల్ రషీద్, సోనీ బేకర్.
సౌతాఫ్రికాతో ఇంగ్లండ్ వన్డే సిరీస్ షెడ్యూల్
👉సెప్టెంబరు 2- తొలి వన్డే (లీడ్స్)
👉సెప్టెంబరు 4- రెండో వన్డే (లార్డ్స్, లండన్)
👉సెప్టెంబరు 7- మూడో వన్డే (సౌతాంప్టన్)