
యూఎస్ ఓపెన్ టోర్నమెంట్
న్యూయార్క్: టెన్నిస్ సీజన్ చివరి గ్రాండ్‌స్లామ్ టోర్నమెంట్ యూఎస్ ఓపెన్‌లో మహిళల సింగిల్స్ విభాగంలో మాజీ చాంపియన్ ఎమ్మా రాడుకాను (బ్రిటన్) శుభారంభం చేసింది. ఆదివారం మొదలైన ఈ మెగా టోర్నీలో తొలి రౌండ్‌లో రాడుకాను 6–1, 6–2తో ఇనా షిబహారా (జపాన్)పై గెలుపొందింది.
62 నిమిషాల్లో ముగిసిన ఈ మ్యాచ్‌లో 2021 చాంపియన్ రాడుకాను రెండు ఏస్‌లు సంధించింది. నెట్ వద్దకు ఏడుసార్లు దూసుకొచి్చన ఆమె ఐదుసార్లు పాయింట్లు గెలిచింది. తన సర్వీస్‌ను ఒక్కసారి కూడా కోల్పోని రాడుకాను ప్రత్యర్థి సర్వీస్‌ను నాలుగుసార్లు బ్రేక్ చేసింది. మరోవైపు షిబహారా ఐదు డబుల్ ఫాల్ట్‌లతోపాటు 36 అనవసర తప్పిదాలు చేసి మూల్యం చెల్లించుకుంది.
షెల్టన్ బోణీ
పురుషుల సింగిల్స్ విభాగంలో ఆరో సీడ్ బెన్ షెల్టన్ (అమెరికా) గెలుపు బోణీ కొట్టాడు. ఇగ్నాసియో బుసె (పెరూ)తో జరిగిన తొలి రౌండ్ మ్యాచ్‌లో షెల్టన్ 6–3, 6–2, 6–4తో విజయం సాధించి రెండో రౌండ్‌లోకి దూసుకెళ్లాడు. 2 గంటల 7 నిమిషాల్లో ముగిసిన ఈ మ్యాచ్‌లో షెల్టన్ ఐదు ఏస్‌లు సంధించి, మూడు డబుల్ ఫాల్ట్‌లు చేశాడు. నెట్ వద్దకు 33 సార్లు దూసుకొచ్చి 26 సార్లు పాయింట్లు గెలిచాడు. 35 విన్నర్స్ కొట్టిన ఈ అమెరికా స్టార్ 32 అనవసర తప్పిదాలు చేశాడు.
తన సర్వీస్‌ను ఒక్కసారి కూడా కోల్పోని షెల్టన్ ప్రత్యర్థి సర్వీస్‌ను నాలుగుసార్లు బ్రేక్ చేశాడు. ఇతర తొలి రౌండ్ మ్యాచ్‌ల్లో 16వ సీడ్ జాకుబ్ మెన్‌సిక్ (చెక్ రిపబ్లిక్) 7–6 (7/5), 6–3, 6–4తో నికోలస్ జారీ (చిలీ)పై, 18వ సీడ్ డేవిడోవిచ్ ఫొకీనా (స్పెయిన్) 6–1, 6–1, 6–2తో అలెగ్జాండర్ షెవ్‌చెంకో (కజకిస్తాన్)పై నెగ్గి రెండో రౌండ్‌లోకి అడుగు పెట్టారు.