
ఆర్సీబీ వికెట్ కీపర్ బ్యాటర్ జితేష్ శర్మ ఏడాది విరామం తర్వాత తిరిగి టీమిండియా తరపున ఆడేందుకు సిద్దమయ్యాడు. ఆసియాకప్-2025కు ఎంపిక చేసిన భారత జట్టులో అతడికి చోటు దక్కింది. వికెట్ కీపర్ కోటాలో సంజూ శాంసన్, జితేష్‌కు మధ్య పోటీ నెలకొంది.
ఒకవేళ డౌన్‌ది ఆర్డర్‌లో ఫినిషర్ కావాలని టీమ్ మెనెజ్‌మెంట్ భావిస్తే సంజూకు బదులగా జితేష్‌కు తుది జట్టులో చోటు దక్కే అవకాశముంది. సంజూ శాంసన్ ప్రస్తుతం అద్బుతమైన ఫామ్‌లో ఉన్నాడు. కేరళ టీ20లో శాంసన్ పరుగుల వరద పారిస్తున్నాడు. మరోవైపు జితేష్ కూడా మంచి టచ్‌లో ఉన్నాడు.
ఐపీఎల్-2025 తర్వాత క్రికెట్‌కు దూరంగా ఉన్న ఈ విధర్బ ఆటగాడు.. భారీ షాట్ల ఆడటంలో దిట్ట. ముఖ్యంగా డౌన్‌ది ఆర్డర్‌లో బ్యాటింగ్‌కు వచ్చి జట్టుకు మంచి ఫినిషింగ్ అందించగలడు. ఈ ఏడాది ఐపీఎల్ ఛాంపియన్‌గా ఆర్సీబీ నిలవడంలో జితేష్‌ది కీలక పాత్ర.
ఈ క్యాష్ రిచ్ లీగ్‌లో 31 ఏళ్ల జితేష్ 15 మ్యాచ్‌లు ఆడి 37 సగటు, 76 స్ట్రైక్ రేట్‌తో 261 పరుగులు చేశాడు. తాజాగా జితేష్ గురుంచి టీమిండియా మాజీ ఆటగాడు, ఆర్సీబీ బ్యాటింగ్ కోచ్ దినేష్ కార్తీక్ ఆసక్తికర విషయాలను వెల్లడించాడు.
"టీమిండియా తరపున ఆడేందుకు జితేష్ శర్మ ఎప్పుడూ అంతగా ఆరాటపడలేదు. అతడికి తెలిసింది ఒక్కటే. ఇన్నింగ్స్‌ను ఎలా పూర్తి చేయాలి? తన ఆడే జట్టును అత్యుత్తమ స్దాయికి ఎలా తీసుకుకెళ్లాలి? అని ఆలోచిస్తాడు. తన పని తాను చేసుకుపోవడంపై ఎక్కువగా దృష్టి పెడతాడు.
అందుకే ఆఖరిలో వచ్చి అద్బుతమైన ఇన్నింగ్స్‌లు ఆడగల్గుతున్నాడు. భారీ ఇన్నింగ్స్‌లు ఎలా ఆడాలో, డిఫెన్స్ ఆడుతూ జట్టును ముందుకు ఎలా తీసుకు వెళ్లాలో అతడికి ఇప్పటికి తెలియదు. కానీ అతడికి అద్బుతమైన స్కిల్స్ ఉన్నాయి.
కాబట్టి జితేష్‌ను ఎలా సరిదిద్దాలో నాకు తెలుసు. అతడికి భారీ షాట్లు ఆడే సత్తా ఉంది. అంతేకాకుండా స్ట్రైట్‌గా సిక్సర్లు కొట్టగలడు. అయితే రివర్స్ స్కూప్, ల్యాప్ షాట్లు వంటివి ఆడలేడు" అని క్రిక్‌బజ్‌కు ఇంటర్వ్యూలో కార్తీక్ పేర్కొన్నాడు. కాగా ఐపీఎల్-2024లో పంజాబ్ కింగ్స్ తరపున మెరుగైన ప్రదర్శన అనంతరం జితేష్ టీమిండియా తరపున అరంగేట్రం చేశాడు.
చదవండి: టాప్-5 క్రికెటర్లలో కోహ్లికి నో ఛాన్స్.. సారీ చెప్పిన డివిలియర్స్