Daryl Mitchell: 73 ఏళ్ల రికార్డు బద్దలు కొట్టిన కివీస్‌ బ్యాటర్‌.. దిగ్గజాల సరసన చోటు

Daryl Mitchell Hat-trick Century Breaks 73 Years Record Joins Elite List - Sakshi

ఇంగ్లండ్‌తో జరుగుతున్న మూడు టెస్టుల సిరీస్‌లో న్యూజిలాండ్‌ బ్యాటర్‌ డారిల్‌ మిచెల్‌ సెంచరీల మోత మోగిస్తున్నాడు. తాజాగా లీడ్స్‌ వేదికగా మూడో టెస్టులోనూ సెంచరీతో మెరిసిన మిచెల్‌కు ఇది హ్యాట్రిక్‌ శతకం కావడం విశేషం. ఇక మూడో టెస్టులో న్యూజిలాండ్‌ తొలి ఇన్నింగ్స్‌లో 329 పరుగులకు ఆలౌట్‌ అయింది. డారిల్‌ మిచెల్‌ 109, టామ్‌ బ్లండన్‌ 55 పరుగులు, టిమ్‌ సౌథీ 33 పరుగులు చేశారు. ఒక దశలో 123 పరుగులకే 5 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడిన న్యూజిలాండ్‌ను మిచెల్‌, టామ్‌ బ్లండన్‌లు ఆదుకున్నారు. ఈ ఇద్దరు ఆరో వికెట్‌కు 120 పరుగులు జోడించి ఇన్నింగ్స్‌ను నిలబెట్టారు. ఈ నేపథ్యంలోనే డారిల్‌ మిచెల్‌ పలు రికార్డులు బద్దలు కొట్టాడు. అవేంటో ఒకసారి పరిశీలిద్దాం.


228 బంతుల్లో 9 ఫోర్లు, 3 సిక్సర్లతో సెంచరీ పూర్తి చేసుకున్న డారిల్‌ మిచెల్ విదేశంలో మూడు టెస్టుల సిరీస్‌లో భాగంగా మూడు టెస్టుల్లో మూడు శతకాలు నమోదు చేసిన తొలి న్యూజిలాండ్ బ్యాటర్‌గా చరిత్రకెక్కాడు.
జాక్ లీచ్ బౌలింగ్‌లో సిక్సర్ కొట్టి సెంచరీ మార్కును అందుకున్న డారిల్‌ మిచెల్.. 73 ఏళ్ల రికార్డును బద్దలుకొట్టాడు. ఇంగ్లండ్‌తో జరుగుతున్న ప్రస్తుత మూడు టెస్టుల సిరీస్‌లో డారిల్‌ మిచెల్‌ ఇప్పటివరకు 482 పరుగులు సాధించాడు. అంతకముందు 1949లో బెర్ట్ సుత్క్లిఫ్ ఇంగ్లండ్‌తో సిరీస్‌లో 451 పరుగులు సాధించాడు. తాజాగా బెర్ట్‌ సుత్ల్కిఫ్‌ను అధిగమించిన డారిల్‌ మిచెల్‌ తొలి స్థానంలో నిలిచాడు.
ఇక 21వ శతాబ్దంలో విదేశాల్లో వరుసగా హ్యాట్రిక్‌ సెంచరీలు నమోదు చేసిన జాబితాలో మిచెల్‌ నాలుగో ప్లేయర్‌గా చోటు దక్కించుకున్నాడు. ఇంగ్లండ్‌తో మూడు టెస్టుల సిరీస్‌లో వరుసగా మూడు శతకాలు నమోదు చేసిన డారిల్‌ మిచెల్‌ క్రికెట్‌ దిగ్గజాల సరసన చోటు సంపాదించాడు. ఇంతకముందు టీమిండియా నుంచి రాహుల్‌ ద్రవిడ్‌(2002, 2011), పాకిస్తాన్‌ నుంచి మహ్మద్‌ యూసఫ్‌(2002), ఆస్ట్రేలియా నుంచి స్టీవ్‌ స్మిత్‌(2019లో) ఈ ఘనత సాధించారు.


మూడు టెస్టుల సిరీస్‌లో మూడు టెస్టు మ్యాచ్‌ల్లో మూడు సెంచరీలు సాధించిన జాబితాలో డారిల్‌ మిచెల్‌ ఏడో స్థానంలో నిలిచాడు. విరాట్‌ కోహ్లి(2017లో శ్రీలంకపై), రాస్‌ టేలర్‌(2013లో వెస్టిండీస్‌పై) , మహ్మద్‌ యూసఫ్‌(2006లో వెస్టిండీస్‌పై), మాథ్యూ హెడెన్‌(2002లో సౌతాఫ్రికాపై), షోయబ్‌ మహ్మద్‌(1990లో ఆస్ట్రేలియాపై), బారింగ్‌టన్‌(1967లో పాకిస్తాన్‌పై) డారిల్‌ మిచెల్‌ కంటే ముందున్నారు.

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top