CPL 2022 Winner: బ్రాండన్‌ కింగ్‌ అద్భుత ఇన్నింగ్స్‌.. మూడోసారి చాంపియన్‌గా జమైకా తలైవాస్‌!

CPL 2022 Final: Jamaica Tallawahs Beat Barbados Royals Won 3rd Title - Sakshi

కరేబియన్‌ ప్రీమియర్‌ లీగ్‌- 2022 చాంపియన్‌గా జమైకా తలైవాస్‌

Caribbean Premier League 2022 - Barbados Royals vs Jamaica Tallawahs, Final: కరేబియన్‌ ప్రీమియర్‌ లీగ్‌- 2022 విజేతగా జమైకా తలైవాస్‌ అవతరించింది. గయానాలో బార్బడోస్‌ రాయల్స్‌తో జరిగిన ఫైనల్లో 8 వికెట్ల తేడాతో గెలుపొంది చాంపియన్‌గా నిలిచింది. ఒబెడ్‌ మెకాయ్‌ బౌలింగ్‌లో బ్రాండన్‌ కింగ్‌ సిక్సర్‌ బాది తలైవాస్‌ విజయం ఖరారు చేశాడు. 

ఆజం ఖాన్‌ ఒక్కడే
ఇక తాజా సీజన్‌లో విజయంతో జమైకా మూడోసారి ట్రోఫీ అందుకుంది. దీంతో రోవ్‌మన్‌ పావెల్‌ బృందం సంబరాలు అంబరాన్నంటాయి. సీపీఎల్‌-2022 ఫైనల్‌లో టాస్‌ గెలిచిన బార్బడోస్‌ తొలుత బ్యాటింగ్‌ ఎంచుకుంది. వన్‌డౌన్‌ బ్యాటర్‌ ఆజం ఖాన్‌ అర్ధ శతకంతో రాణించగా.. నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 161 పరుగులు చేసింది.

కింగ్‌ అదరగొట్టాడు
లక్ష్య ఛేదనకు దిగిన జమైకా తలైవాస్‌కు ఓపెనర్‌ బ్రాండన్‌ కింగ్‌ అద్భుత ఆరంభం అందించాడు. 50 బంతుల్లో 13 ఫోర్లు, 2 సిక్సర్ల సాయంతో 83 పరుగులు సాధించి చివరి వరకు అజేయంగా నిలిచాడు. వన్‌డౌన్‌ బ్యాటర్ షామర్‌ బ్రూక్స్‌ 47 పరుగులతో రాణించాడు. ఈ క్రమంలో 16.1 ఓవర్లలోనే తలైవాస్‌ జట్టు టార్గెట్‌ ఛేదించింది. 

రెండు వికెట్లు నష్టపోయి 162 పరుగులు చేసి 8 వికెట్ల తేడాతో విజయఢంకా మోగించింది. తద్వారా మూడోసారి సీపీఎల్‌ టైటిల్‌ విజేతగా నిలిచింది. బార్బడోస్‌ను కట్టడి చేయడంలో సఫలమైన తలైవాస్‌ ఆల్‌రౌండర్‌  ఫాబియన్‌ అలెన్‌ ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌ అవార్డు అందుకున్నాడు. కాగా అంతకుముందు 2013, 2016 సీజన్లలో తలైవాస్‌ టీమ్‌ సీపీఎల్‌ చాంపియన్‌గా నిలిచింది. 

మాటల్లో వర్ణించలేను
విజయానంతరం తలైవాస్‌ కెప్టెన్‌ రోవ్‌మన్‌ పావెల్‌ మాట్లాడుతూ.. ఈ సంతోషాన్ని వర్ణించడానికి మాటలు చాలడం లేదంటూ ఉద్వేగానికి లోనయ్యాడు. ఒకానొక దశలో కనీసం ప్లే ఆఫ్స్‌ చేరకుండానే నిష్క్రమిస్తానే స్థితి నుంచి చాంపియన్లుగా అవతరించడం గొప్పగా అనిపిస్తోందన్నాడు. జట్టు సమిష్టి కృషితోనే ఇది సాధ్యమైందంటూ ఆటగాళ్లపై ప్రశంసలు కురిపించాడు. గయానాలో తమకు ప్రేక్షకుల నుంచి పూర్తి మద్దతు లభించిందని.. ఈ విజయాన్ని వారికి అంకితమిస్తున్నట్లు పేర్కొన్నాడు.
 

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top