అమ్మ తోడుగా...ఆనందంగా | Candidates winner Vaishali celebrates | Sakshi
Sakshi News home page

అమ్మ తోడుగా...ఆనందంగా

Apr 17 2026 3:53 AM | Updated on Apr 17 2026 3:53 AM

Candidates winner Vaishali celebrates

క్యాండిడేట్స్‌ విజేత వైశాలి సంబరం

పాఫోస్‌ (సైప్రస్‌): ‘ఫిడే’ క్యాండిడేట్స్‌ చెస్‌ టోర్నీలో విజేతగా నిలవడం తనకు అంతా కలలా అనిపించిందని భారత గ్రాండ్‌మాస్టర్‌ ఆర్‌.వైశాలి తన స్పందనను వెల్లడించింది. బుధవారం ముగిసిన టోర్నీ చివరి రౌండ్‌లో కాటరీనా లాగ్నో (ఉక్రెయిన్‌)ను ఓడించి వైశాలి అగ్ర స్థానంతో ముగించింది. ఫలితంగా ఈ ఏడాది చివర్లో చైనా గ్రాండ్‌మాస్టర్‌ జు వెన్‌జున్‌తో వరల్డ్‌ చెస్‌ చాంపియన్‌షిప్‌లో తలపడేందుకు ఆమె అర్హత సాధించింది. 

‘చాలా అద్భుతంగా. అంతా ఒక కలలా అనిపించింది. ఒక పాయింట్‌తో ఆధిక్యంలో ఉన్న సమయంలో జూ జినర్‌ చేతిలో ఓటమి ఒక్కసారిగా దెబ్బతీసింది. ఆ సమయంలో అందరూ పోటీలోకి వచ్చారు. అయితే చివరి రెండు రౌండ్‌లు మరింత ఏకాగ్రతతో పట్టుదలగా ఆడాను. నా అత్యుత్తమ ఆటను ప్రదర్శించి గెలవడంతో ఈ సంతోష క్షణాలు దక్కాయి’ అని వైశాలి పేర్కొంది.  

ఫామ్‌లోకి వచ్చి... 
గత రెండేళ్లుగా వైశాలి ప్రదర్శన గొప్పగా లేదు. ముఖ్యంగా సంవత్సర కాలంలో వరుసగా పరాజయాలు పలకరించాయి. వరల్డ్‌ కప్‌లో క్వార్టర్‌ ఫైనల్లో పరాజయం సహా దాదాపు అన్ని టోర్నీల్లో ఆరంభ రౌండ్లలోనే ఆమె ఆట ముగిసింది. ఒక్క గ్రాండ్‌స్విస్‌ టోర్నీలో మాత్రమే ఆమె చెప్పుకోదగ్గ ప్రదర్శన ఇచ్చింది. టైబ్రేక్‌లో టైటిల్‌ సాధించిన వైశాలి గ్రాండ్‌స్విస్‌ను నిలబెట్టుకున్న తొలి ప్లేయర్‌గా ఘనత సాధించింది. 

‘క్యాండిడేట్స్‌ టోర్నీ కోసం చాలా చాలా కష్టపడ్డాను. గత ఏడాది కాలంలో నా వైఫల్యాలను బట్టి చూస్తే రెట్టింపు సమయం సన్నద్ధం కావాల్సి వచ్చింది. సరైన సమయంలో ఫామ్‌లోకి రావడంతో గ్రాండ్‌స్విస్‌ విజ యం లభించింది. దాని వల్ల నాలో ఆత్మవిశ్వాసం పెరిగింది. ఈ గెలుపుతోనే నా జట్టు సభ్యులతో కలిసి మరింతగా దృష్టి పెట్టాను. గత రెండేళ్లలో ఆశించిన విజయాలు రాకపోయినా... ఆ కష్టమంతా ఇక్కడ ఫలితాన్ని అందించింది’ అని వైశాలి తన ఆనందాన్ని ప్రదర్శించింది.  

తక్కువ రేటింగ్‌ ఉన్నా... 
క్యాండిడేట్స్‌ టోర్నీలో పాల్గొన్న ఎనిమిది మందిలో అందరికంటే తక్కువ రేటింగ్‌ వైశాలిదే. మిగతా ఏడుగురు ఆమెకంటే మెరుగైన స్థితిలో ఉన్నవారే. ప్రస్తుతం ప్రపంచ క్లాసిక్‌ ర్యాంకింగ్స్‌లో 19వ స్థానంలో ఉన్న వైశాలి ఈ రకమైన ప్రతికూలతను కూడా అధిగమించి టైటిల్‌ సాధించడం ఆమె విజయాన్ని మరింత ప్రత్యేకంగా మార్చింది. ‘నాకు అందరికంటే తక్కువ సీడింగ్‌ ఉందనే విషయం బాగా తెలుసు. 

అయితే నా అత్యుత్తమ ప్రదర్శన ఇస్తే ఎవరితోనైనా పోటీ పడి గెలవగలనని నమ్మాను. నా జట్టు సహచరులు నాపై నమ్మకం ఉంచారు. నన్ను అడుగడుగునా ప్రోత్సహిస్తూ ఫలితం సాధించేలా చూశారు. ఇలాంటి పెద్ద టోర్నీల్లో రేటింగ్‌కంటే గేమ్‌ల కోసం చేసే ప్రత్యేక సన్నద్ధతే కీలకంగా మారుతుంది’ అని వైశాలి అభిప్రాయపడింది.  

కుటుంబ అండదండలే కారణం... 
క్యాండిడేట్స్‌ టోర్నీలో మహిళల విభాగంలో వైశాలి బరిలోకి దిగితే మరో వైపు ఓపెన్‌ కేటగిరీలో ఆమె తమ్ముడు ప్రజ్ఞానంద కూడా పోటీ పడ్డాడు. ఎప్పటిలాగే వారి తల్లి నాగలక్ష్మి తన పిల్లలకు తోడుగా ఈ టోర్నీకి కూడా వచ్చింది. ‘కుటుంబ సభ్యులు తోడుగా ఉంటే ఎంతో సౌకర్యంగా ఉంటుంది. ముఖ్యంగా తీవ్ర ఒత్తిడి ఉండే ఇలాంటి ఈవెంట్ల సమయంలో మానసికంగా కూడా అండదండలు అవసరం. అమ్మ, తమ్ముడు కూడా ఇక్కడే ఉండటం నాకు ఎంతో ప్రేరణగా నిలిచింది. వారు ప్రతీ దశలో నాకు మద్దతుగా నిలిచారు’ అని ఆమె భావోద్వేగంతో చెప్పింది. 

Advertisement
 
Advertisement
Advertisement