
భారత క్రికెట్ నియంత్రణ మండలి(బీసీసీఐ) ప్రపంచ క్రికెట్‌లో పెద్దన్న పాత్ర పోషిస్తుంది. వరల్డ్‌లోనే సంపన్నమైన క్రికెట్ బోర్డుగా బీసీసీఐ ఖ్యాతి గడించింది. తాజాగా బీసీసీఐ మరోసారి సంపద సృష్టిలో చరిత్ర సృష్టించింది. 2023-24 ఆర్థిక సంవత్సరానికి భారత క్రికెట్ నియంత్రణ మండలి ( BCCI ) రికార్డు స్థాయిలో రూ.9,741.7 కోట్ల ఆదాయాన్ని సంపాదించినట్లు ఓ నివేదిక వెల్లడించింది. ఈ క్రమంలో భారత క్రికెట్ బోర్డుకు ఆదాయం వచ్చే మార్గాలపై ఓ లుక్కేద్దాం.
ఐపీఎల్ బంగారు బాతు..
భారత క్రికెట్ బోర్డుకు ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్) బంగారు బాతులా మారింది. 2007లో పురుడుపోసుకున్న ఐపీఎల్.. బీసీసీఐకి ప్రదాయ ఆదాయ వనరుగా ఉంది. తాజా నివేదిక ప్రకారం 2023-2024 సంవత్సరానికి గాను ఈ క్యాష్ రిచ్ లీగ్ నుంచి రూ. 5,761 కోట్లు బోర్డు ఖాతాలో చేరాయి.
మీడియా హక్కులు, ఫ్రాంచైజీ ఫీజులు, స్పాన్సర్‌షిప్‌ల రూపంలో వచ్చాయి. బీసీసీఐ ఆర్జించిన మొత్తంలో 59 శాతంతో ఐపీఎల్ ప్రధాన వాటాదారుగా నిలిచింది. అదేవిధంగా అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ ద్వారా బీసీసీఐకి రూ.1042 కోట్లు(10.7%) వచ్చాయి.
అంతేకాకుండా ఐపీఎల్ యేతర మీడియా హక్కుల(భారత అంతర్జాతీయ మ్యాచ్‌లు బ్రాడ్‌కాస్టింగ్) ద్వారా బోర్డు అదనంగా రూ. 813 కోట్లు సంపాదించింది. మరోవైపు ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ అరంగేట్ర సీజన్ ద్వారా బోర్డుకు రూ. 378 కోట్లు వచ్చాయి.
భారత్ అంతర్జాతీయ పర్యటనలో టికెట్ అమ్మకాలు, స్పాన్సర్లు, లైసెన్సింగ్ ద్వారా 361 కోట్లు అదనంగా బీసీసీఐకి లభించాయి. స్టేడియంలో ప్రకటనలు, జరిమానాలు, ఇతర రుసుముల రూపంలో భారత క్రికెట్ బోర్డుకు 400 కోట్ల ఆదాయం సమకూరింది.
వెయ్యి కోట్ల పైగా వడ్డీ..
భారత క్రికెట్ బోర్డు దగ్గర దాదాపు రూ. 30 వేల కోట్లు రిజర్వ్‌లో ఉన్నాయి. దీని వల్ల ఏడాదికి రూ. 1,000 కోట్ల వడ్డీ వస్తున్నట్లు తెలుస్తోంది.
బీసీసీఐకి ఖర్చు కూడా ఎక్కువే..
భారత క్రికెట్ నియంత్రణ మండలి ఆదాయాన్ని సంపాదించడంలోనే కాదు ఖర్చు చేయడంలో మిగిలిన బోర్డులకంటే ముందు ఉంది. క్రికెట్ అభివృద్ది కోసం బీసీసీఐ ఖర్చు చేసే ఆంశాలను ఓసారి పరిశీలిద్దాం. ఆటగాళ్ల జీతాలు, మ్యాచ్ ఫీజులు, బోనస్‌లు కింద బీసీసీఐ ప్రతీ ఏటా రూ.250 కోట్ల పైగా ఖర్చుచేస్తోంది. అదేవిధంగా కోచింగ్ స్టాప్ జీతాల కోసం రూ.100 కోట్ల పైగా బీసీసీఐ వెచ్చిస్తోంది.
అంతేకాకుండా స్టేట్ క్రికెట్ ఆసోయేషిన్‌లకు నిధుల రూపంలో రూ.1000 కోట్ల పైగా భారత క్రికెట్ బోర్డు ఖర్చుచేస్తోంది. మ్యాచ్‌లను నిర్వహించేందుకు రూ. 500 కోట్లు, మహిళల క్రికెట్ అభివృద్ది కోసం 150 కోట్లు బీసీసీఐ ప్రతీ ఊటా కేటాయిస్తోంది.
పరిపాలన, కార్యకలాపాలు(ట్రావిలింగ్, మార్కెటింగ్) కోసం బీసీసీఐ 300 పైగా కోట్లు ఖర్చు చేస్తోంది. మరోవైపు ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ (WPL) ప్రారంభించడానికి బీసీసీఐ భారీ ఖర్చు చేసింది. అందులో మీడియా హక్కుల కోసం రూ. 951 కోట్లు వెచ్చించింది.
చదవండి: ENG vs IND: క్రికెట్ ప్లేయర్లు లంచ్ బ్రేక్‌లో ఏమి తింటారో తెలుసా?