
రాజ్‌గిర్ (బిహార్): ఆసియా కప్ పురుషుల హాకీ టోర్నమెంట్‌లో బంగ్లాదేశ్ జట్టు భారీ విజయం సాధించింది. పూల్ ‘బి’లో భాగంగా శనివారం జరిగిన పోరులో బంగ్లాదేశ్ 8–3 గోల్స్ తేడాతో చైనీస్ తైపీపై విజయం సాధించింది. బంగ్లాదేశ్ తరఫున మొహమ్మద్ అబ్దుల్లా (4వ, 26వ నిమిషాల్లో), రకీబుల్ హసన్ (42వ, 43వ నిమిషాల్లో), అష్రఫుల్ ఇస్లామ్ (45వ, 48వ నిమిషాల్లో) డబుల్ గోల్స్ సాధించగా... సోహనుర్ సోబుజ్ (36వ నిమిషంలో), రిజావుల్ బాబు (56వ నిమిషంలో) చెరో గోల్ సాధించారు.
చైనీస్ తైపీ జట్టు తరఫున సుంగ్ యూ (10వ, 18వ నిమిషాల్లో) డబుల్ గోల్స్ చేయగా... సుంగ్ జెన్ షిహ్ (60వ నిమిషంలో) ఒక గోల్ సాధించాడు. తొలి పోరులో మలేసియా చేతిలో ఓడిన బంగ్లాదేశ్... ఈ మ్యాచ్‌లో పూర్తి ఆధిపత్యం కనబర్చింది.
మరో మ్యాచ్‌లో మలేసియా 4–1 గోల్స్ తేడాతో డిఫెండింగ్ చాంపియన్ దక్షిణ కొరియాపై గెలిచింది. మ్యాచ్ ఆరంభమైన రెండో నిమిషంలోనే గెనెహో జిన్ గోల్‌తో ఖాతా తెరిచిన ఐదు సార్లు చాంపియన్ దక్షిణ కొరియా... చివరి వరకు అదే జోరు కొనసాగించలేకపోయింది.
మలేసియా తరఫున అఖీముల్లా అన్వర్ (29వ, 34వ, 58వ నిమిషాల్లో) హ్యాట్రిక్ గోల్స్‌తో అదరగొట్టాడు. అష్రాన్ హమ్సాని (33వ నిమిషంలో) ఒక గోల్ కొట్టాడు. పూల్ ‘ఎ’లో భాగంగా ఆదివారం జపాన్‌తో భారత్, కజకిస్తాన్‌తో చైనా తలపడనున్నాయి.