
ఆసియా కప్-2025 (Asia Cup 2025) టోర్నమెంట్ నేపథ్యంలో ఎనిమిది జట్ల కెప్టెన్లు మీడియాతో మంగళవారం సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా టీమిండియా సారథి సూర్యకుమార్ యాదవ్ (Suryakumar Yadav) ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ‘‘గత వారమే మేము యూఏఈకి చేరుకున్నాము. ఇక్కడ గట్టిగానే ప్రాక్టీస్ చేశాము.
వాళ్లు మరింత గొప్పగా రాణించాలి
ఆసియాలోని అత్యుత్తమ జట్లతో పోటీ పడనుండటం సంతోషంగా ఉంది. యూఏఈతోనే తొలి మ్యాచ్ ఆడబోతున్నాం. ఆ జట్టు బ్రాండ్ క్రికెట్ ఆడుతోంది. ఇటీవలే ఓ టోర్నీలోనూ పాల్గొన్నారు. తాము ఉత్తమంగా రాణించి గెలుపు అంచుల వరకు వెళ్లామని యూఏఈ కెప్టెన్ చెప్పాడు.
ఆసియా కప్‌లో కూడా వాళ్లు మరింత గొప్పగా రాణించి.. ఈసారి అనుకున్న ఫలితాన్ని రాబట్టడంలో సఫలం కావాలి. ఆ జట్టుతో ఆడేందుకు మేము ఎంతో ఆతురతగా ఎదురుచూస్తున్నాం’’ అని సూర్యకుమార్ యాదవ్ ప్రత్యర్థి జట్టుకు కూడా ఆల్ ది బెస్ట్ చెప్పాడు.
టీమిండియా ఫేవరెటా?.. నేనైతే వినలేదు
ఇక ఆసియా కప్ టోర్నీలో టీమిండియా ఫేవరెట్ కదా అన్న ప్రశ్నకు బదులిస్తూ.. ‘‘ఈ విషయం మీకెవరు చెప్పారు. నేనైతే ఎక్కడా వినలేదు. మేము సుదీర్ఘకాలంగా టీ20లలో అత్యుత్తమంగా రాణిస్తున్నాం. ఏదేమైనా పూర్తి స్థాయిలో టోర్నీకి సిద్ధంగా ఉన్నామని మాత్రం చెప్పగలను.
మైదానంలో దూకుడుగా ఉండటం అన్నికంటే ముఖ్యం. అసలు అగ్రెషన్ లేకుండా గ్రౌండ్‌కు ఎలా వెళ్లగలం?.. మేము ఈసారి కూడా అలాగే చేస్తాం’’ అని సూర్య పేర్కొన్నాడు. ఇక టీమిండియా ఓపెనర్‌గా శుబ్‌మన్ గిల్- సంజూ శాంసన్‌లలో ఎవరు వస్తారన్న ప్రశ్నకు సమాధానమిస్తూ..
అతడి గురించి బెంగ వద్దు
‘‘తుదిజట్టు ప్రకటన సమయంలో నేనే చెప్తాను. అతడి గురించి బెంగ వద్దు. మేము అతడి గురించి ఆలోచిస్తున్నాం. బుధవారం నాటి మ్యాచ్‌లో మేము సరైన నిర్ణయమే తీసుకుంటామని హామీ ఇస్తున్నా’’ అని సూర్య తెలిపాడు.
ఇక తాము జనవరి- ఫిబ్రవరి తర్వాత కలిసి టీ20లు ఆడలేదన్న సూర్యకుమార్ యాదవ్.. ఐపీఎల్ ద్వారా టీమిండియా ఆటగాళ్లకు కావాల్సినంత ప్రాక్టీస్ లభించిందని తెలిపాడు. జూన్ నుంచి తాము టీ20లు ఆడలేదని.. టోర్నీలో మున్ముందు ఏం జరుగుతుందో చూద్దామని పేర్కొన్నాడు.
కాగా భారత్.. యూఏఈ వేదికగా ఆసియా కప్-2025 టోర్నీకి ఆతిథ్యమిస్తోంది. సెప్టెంబరు 9- 28 వరకు పొట్టి ఫార్మాట్లో ఈ టోర్నీ జరుగనుంది. గ్రూప్-‘ఎ’ నుంచి భారత్, పాకిస్తాన్, యూఏఈ, ఒమన్ పోటీపడుతుండగా.. గ్రూప్-‘బి’ నుంచి శ్రీలంక, బంగ్లాదేశ్, అఫ్గనిస్తాన్, హాంకాంగ్ రేసులో ఉన్నాయి.
చదవండి: ఆసియా కప్-2025: పూర్తి షెడ్యూల్, అన్ని జట్లు, లైవ్ స్ట్రీమింగ్ వివరాలు