Amit Mishra: గర్ల్‌ఫ్రెండ్‌తో డేట్‌కి వెళ్లాలి! 300 కాదు ఐదొందలు తీసుకో! స్క్రీన్‌షాట్‌ తీసి మరీ..

Amit Mishra Reaction Goes Viral After Fan Asks For Rs 300 For Date - Sakshi

Amit Mishra Viral Tweet: టీమిండియా వెటరన్‌ స్పిన్నర్‌ అమిత్‌ మిశ్రా సోషల్‌ మీడియాలో యాక్టివ్‌గా ఉంటాడు. తనదైన శైలిలో ట్వీట్లు చేస్తూ నెటిజన్లను ఆకట్టుకుంటాడు. అప్పుడప్పుడూ పప్పులో కాలేస్తూ ట్రోలింగ్‌ బారిన పడతాడు కూడా! ట్విటర్‌లో 1.4 మిలియన్‌ మందికి పైగా ఫాలోవర్లు కలిగి ఉన్న అమిత్‌ మిశ్రాకు.. ఇటీవల ఓ అభిమాని నుంచి అతడికి ఓ రిక్వెస్టు వచ్చింది.

300 కాదు.. ఐదొందలు తీసుకో
తన గర్ల్‌ఫ్రెండ్‌ను డేట్‌కు తీసుకువెళ్లాలనుకుంటున్నానని.. ఇందుకు తనకు మూడు వందల రూపాయలు ఇచ్చి సాయం చేయాలని ఓ ఫ్యాన్‌ అమిత్‌ మిశ్రాను ట్యాగ్‌ చేశాడు. అయితే, అతడి అభ్యర్థనను ‘సీరియస్‌’గా తీసుకున్న మిశ్రా.. ఆన్‌లైన్‌ ట్రాన్సాక్షన్‌ ద్వారా 500 రూపాయలు పంపించాడు. ఇందుకు సంబంధించిన స్క్రీన్‌షాట్‌ను ట్విటర్‌లో షేర్‌ చేస్తూ.. ‘‘పంపించాను. డేట్‌కి వెళ్తున్నావుగా.. ఆల్‌ ది బెస్ట్‌’’ అంటూ నవ్వుతున్న ఎమోజీని జత చేశాడు. 

నిజమే అంటారా?
అమిత్‌ మిశ్రా ట్వీట్‌పై నెటిజన్లు సరదాగా స్పందిస్తున్నారు. ‘‘సర్‌ నా దగ్గర డబ్బు ఉంది కానీ. బాయ్‌ఫ్రెండ్‌ లేడు. సాయం చేయగలరా?’’ అని ఓ అమ్మాయి కొంటెగా అడుగగా.. డబ్బులిచ్చీ మరీ అబ్బాయిని చెడగొడుతున్నారండీ అంటూ మరొకరు ఫన్నీగా రిప్లై ఇచ్చారు.

ఇంకొందరేమో.. ‘‘నిజంగా డేట్‌కి వెళ్లి ఉంటే ఆ ఫొటోలు కూడా షేర్‌ చేయమని చెప్పండి. మీరు మాతో ఆ ఫొటోలు పంచుకోండి’’ అంటూ వ్యంగ్యాస్త్రాలు సంధిస్తున్నారు. మొత్తానికి అలా.. మూడు వందలు అడిగితే 500 ఇచ్చి ‘ఉదారత’ను చాటుకున్న అమిత్‌ మిశ్రా నెట్టింట వైరల్‌గా మారాడు.

ఆ మ్యాచ్‌ చివరిది
టీమిండియా తరఫున 2003లో సౌతాఫ్రికాతో వన్డేతో అంతర్జాతీయ క్రికెట్‌లో అడుగుపెట్టిన అమిత్‌ మిశ్రా.. 2008లో టెస్టుల్లో అరంగేట్రం చేశాడు. ఇక 2010లో పొట్టి ఫార్మాట్‌లో ఎంట్రీ ఇచ్చిన ఈ స్పిన్‌ బౌలర్‌.. 2017లో చివరిసారిగా టీమిండియాకు ఆడాడు.

ఇక ఐపీఎల్‌లో సుదీర్ఘకాలం పాటు ఢిల్లీ జట్టుకు అమిత్‌ మిశ్రా ప్రాతినిథ్యం వహించాడు. అయితే, మెగా వేలం-2022లో మాత్రం అతడిని ఏ జట్టు కొనుగోలు చేయలేదు. దీంతో క్యాష్‌ లీగ్‌ చరిత్రలో మూడో అత్యధిక వికెట్‌ టేకర్‌గా(154 మ్యాచ్‌ల్లో 166 వికెట్లు)గా మిశ్రా అమ్ముడుపోని ఆటగాడిగా మిగిలాడు. గతేడాది ఆర్సీబీతో ఆడిన మ్యాచ్‌ అతడికి ఐపీఎల్‌లో చివరిది.

చదవండి: T20 WC: అతడి స్థానాన్ని ప్రపంచంలో ఎవరూ భర్తీ చేయలేరు.. భారత్‌ గెలవడం కష్టమే: ఆసీస్‌ మాజీ ఆల్‌రౌండర్‌
Ind Vs Sa 2nd T20: సూర్య మరో 24 పరుగులు సాధించాడంటే! ఆటగాళ్లను ఊరిస్తున్న రికార్డులివే

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top