
టీమిండియా ఆటగాళ్ల ఫిట్‌నెస్ లెవల్స్‌ను నిర్ధారించేందుకు బీసీసీఐ ఇటీవలే బ్రాంకో టెస్టును ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే. ఈ ఏడాది జూన్‌లో కొత్తగా వచ్చిన స్ట్రెంత్ అండ్ కండిషనింగ్ కోచ్ అడ్రియన్ లి రాక్స్ ఈ పరీక్షను భారత క్రికెట్‌కు పరిచయం చేశాడు.
టీమిండియా వన్డే కెప్టెన్ రోహిత్ శర్మ సెప్టెంబర్ 13న బెంగళూరులోని సెంటర్ ఆఫ్ ఎక్స్‌లెన్స్‌లో ఈ పరీక్షకు హాజరకానున్నాడు. అతడికి యోయో టెస్టుతో పాటు బ్రాంకో పరీక్ష కూడా నిర్వహించనున్నారు. ఈ నేపథ్యంలో బీసీసీఐ ప్రవేశపెట్టిన ఈ కొత్త ఫిట్‌నెస్ టెస్టుపై దక్షిణాఫ్రికా క్రికెట్ దిగ్గజం ఏబీ డివిలియర్స్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఆటగాళ్లకు ఈ ఫిట్‌నెస్ పరీక్ష అంతమంచిది కాదని డివిలియర్స్ అభిప్రాయపడ్డాడు
"తొలుత ఈ టెస్టు గురించి నాకు చెప్పినప్పుడు ఆర్ధం కాలేదు. ‘బ్రోంకో టెస్ట్' అంటే ఏంటి అని అడిగాను. వారు నాకు మొత్తం వివరించినప్పుడు ఈ టెస్టు ఎంటో ఆర్దమైంది. ఎందుకంటే నేను 16 ఏళ్ల వయసు నుంచి ఇది చేస్తున్నాను. దక్షిణాఫ్రికాలో మేము దీనిని స్ప్రింట్ రిపీటబిలిటీ టెస్ట్ అని పిలుస్తాము.
ఇది మీరు పాల్గోనే అత్యంత చెత్త ఫిట్‌నెస్ టెస్ట్‌లలో ఒకటి. ప్రిటోరియా యూనివర్సిటీ, సూపర్‌స్పోర్ట్ పార్క్‌లో కూడా ఈ టెస్టులో మేము పాల్గోన్నాము. ముఖ్యంగా శీతాకాలపు ఉదయాల్లో మాకు ఈ టెస్టులు నిర్వహించేవారు. ఆ సమయంలో ఆక్సిజన్ తక్కువగా ఉంటుంది.
సముద్ర మట్టానికి 1,500 మీటర్ల ఎత్తులో ఉండటంతో ఊపిరి పీల్చుకోవడమే కష్టమయ్యేది. ఆక్సిజన్ లెవల్స్ తక్కువగా ఉండడంతో మా ఊపిరితిత్తులు కాలిపోయేలా అన్పించేది. బీసీసీఐ తమ ఆటగాళ్ల ట్రైనింగ్‌లో బ్రోంకో టెస్ట్‌ను చేర్చడం నిజంగా గొప్ప విషయం. ఆటగాళ్ల ఫిట్‌నెస్ అంచనా వేసేందుకు ఈ టెస్టు సరైనది. కానీ ప్లేయర్లకు ఈ టెస్టు ఒక ఛాలెంజ్‌లా ఉంటుంది అని తన యూట్యూబ్ ఛానల్‌లో డివిలియర్స్ పేర్కొన్నాడు.
బ్రాంకో టెస్ట్ అంటే ఏంటి?
ఈ టెస్టులో భాగంగా ఆటగాడు తొలుత 20 మీటర్ల షటిల్ రన్ చేయాలి. తర్వాత దీనిని 40, 60 మీటర్లకు పెంచుతారు. ఈ మూడూ కలిపి ఒక సెట్ కాగా.. మొత్తంగా ఐదు సెట్లు పూర్తి చేయాల్సి ఉంటుంది. అంటే.. ఓవరాల్‌గా 1200 మీటర్ల దూరం విరామం లేకుండా ఆటగాడు వేగంగా పరుగుతీయాలి. ఇందుకు కేవలం ఆరు నిమిషాల సమయం ఉంటుంది.
చదవండి: ZIM vs SL: శ్రీలంకను వణికించిన జింబాబ్వే.. ఉత్కంఠ పోరులో ఓటమి