మెరుపుల పండగొచ్చింది | 19th season of IPL starts today | Sakshi
Sakshi News home page

మెరుపుల పండగొచ్చింది

Mar 28 2026 1:51 AM | Updated on Mar 28 2026 1:51 AM

19th season of IPL starts today

నేటినుంచి ఐపీఎల్‌ 19వ సీజన్‌

తొలి పోరులో హైదరాబాద్‌తో బెంగళూరు ఢీ 

టోర్నీలో మొత్తం 74 మ్యాచ్‌లు

మే 31న ఫైనల్‌ మ్యాచ్‌  

టి20 వరల్డ్‌ కప్‌లో భారత జట్టు జైత్రయాత్రను చూసి మూడు వారాలు గడిచాయి. వరుసగా రెండోసారి ప్రపంచ కప్‌ సాధించిన టీమిండియాకు మన అభిమానులంతా జేజేలు పలికారు. ఆ తర్వాత క్రికెట్‌ లేకుండా కాస్త స్తబ్దత. ఇప్పుడు మళ్లీ అందరిలో జోష్‌ నింపే వేసవి వినోదం వచ్చేసింది. కొద్ది రోజుల క్రితం వరకు ఒకే జట్టుగా టీమిండియాను చాంపియన్‌గా నిలిపిన సహచరులంతా ఇప్పుడు ప్రత్యర్థులుగా తలపడేందుకు సిద్ధమయ్యారు. 

ఆరో టైటిల్‌ వేటలో రెండు టీమ్‌లు పోటీ పడుతుండగా, నాలుగో ట్రోఫీపై మరో జట్టు గురి పెట్టింది. రెండోసారి విజేతగా నిలవాలని మరో నాలుగు టీమ్‌లు సిద్ధం కాగా... తొలిసారి కప్‌ను ముద్దాడేందుకు ఇంకో మూడు జట్లు తమ పోరాటాన్ని కొనసాగించనున్నాయి. రెండు నెలల పాటు జరిగే 74 మ్యాచ్‌లతో ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ (ఐపీఎల్‌) 19వ సీజన్‌ సమరానికి రంగం సిద్ధమైంది. ఇక పగలూ రాత్రీ అక్కడా ఇక్కడా ఎక్కడైనా ఐపీఎల్‌ స్కోర్లు, ఫలితాలు, విశ్లేషణలపైనే చర్చ షురూ కానుంది.  

బెంగళూరు:  ఐపీఎల్‌–2026కు నేటితో తెర లేవనుంది. చిన్నస్వామి మైదానంలో డిఫెండింగ్‌ చాంపియన్‌ రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు (ఆర్‌సీబీ), మాజీ చాంపియన్‌ సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ మధ్య జరిగే మ్యాచ్‌తో టోర్నీ మొదలవుతుంది. గత నాలుగు సీజన్ల తరహాలోనే ఈసారి కూడా మొత్తం 10 టీమ్‌లు బరిలోకి దిగుతున్నాయి. మే 24 వరకు లీగ్‌ దశలు పోటీలు జరుగుతాయి. వీటిలో 12 రోజుల్లో డబుల్‌ హెడర్‌ (ఒకే రోజు రెండు మ్యాచ్‌లు) ఉన్నాయి. ఆ తర్వాత ‘ప్లే ఆఫ్స్‌’ నిర్వహిస్తారు.

‘ప్లే ఆఫ్స్‌’ మ్యాచ్‌ల వేదికలను ఐపీఎల్‌ గవర్నింగ్‌ కౌన్సిల్‌ ఇంకా ప్రకటించలేదు. అయితే ఫైనల్‌ మ్యాచ్‌ మే 31న బెంగళూరులో నిర్వహిస్తారు. ప్రతీ ఏటా ప్రజాదరణలో, వాణిజ్యపరంగా కూడా స్థాయిని పెంచుకుంటూ వస్తున్న ఐపీఎల్‌ 19వ సీజన్‌ కూడా ఎప్పటిలాగే హోరాహోరీగా, ఆసక్తికరంగా సాగే అవకాశం ఉంది. దిగ్గజ క్రికెటర్లు ధోని, కోహ్లి, రోహిత్‌ ఈ సీజన్‌లో కూడా అభిమానులను అలరించేందుకు సిద్ధమయ్యారు. లీగ్‌లో మరో రసవత్తర వినోదానికి సన్నద్ధమవుతున్న తరుణంలో ఈ సీజన్‌కు సంబంధించి కొన్ని విశేషాలు.... 

» డిఫెండింగ్‌ చాంపియన్‌ ఆర్‌సీబీ ఈసారి తమ ఏడు హోం మ్యాచ్‌లలో ఐదింటిని చిన్నస్వామి స్టేడియంలో ఆడుతుంది. గత ఏడాది విజయోత్సవంలో జరిగిన విషాదం నేపథ్యంలో ఈసారి చిన్నస్వామిలో మ్యాచ్‌లు నిర్వహించేందుకు అనుమతి లభిస్తుందా లేదా అనే సందేహాల మధ్య హోం గ్రౌండ్‌ను రాయ్‌పూర్‌కు మార్చాలని ముందుగా నిర్ణయించింది. ఆ తర్వాత అనుమతి రాగా... ముందుగా ఇచి్చన మాట ప్రకారం రెండు మ్యాచ్‌లను రాయ్‌పూర్‌లో ఆడేందుకు సిద్ధమైంది.  

»  ఢిల్లీ క్యాపిటల్స్‌ గత రెండు సీజన్లలో రెండేసి మ్యాచ్‌లు విశాఖపట్నంలో ఆడింది. ఈసారి ఆ జట్టు వైజాగ్‌లో బరిలోకి దిగడం లేదు. తమ ఏడు హోం మ్యాచ్‌లు అన్నింటినీ ఢిల్లీలోనే ఆడనుంది. ప్రతీ సీజన్‌లాగే రాజస్తాన్‌కు గువాహటి, పంజాబ్‌కు ధర్మశాల ‘రెండో హోం గ్రౌండ్‌’గా ఉంటాయి.  

» ఐపీఎల్‌ జట్లకు ఈసారి కొత్త కోచ్‌లు వచ్చారు. రాహుల్‌ ద్రవిడ్‌ స్థానంలో కుమార్‌ సంగక్కర రాజస్తాన్‌ రాయల్స్‌ హెడ్‌ కోచ్‌గా వ్యవహరించనున్నాడు. కోల్‌కతా నైట్‌రైడర్స్‌ చంద్రకాంత్‌ పండిత్‌ స్థానంలో అభిõÙక్‌ నాయర్‌ను హెడ్‌ కోచ్‌గా ఎంచుకుంది. ఐపీఎల్‌కు రిటైర్మెంట్‌ ప్రకటించిన ఆండ్రీ రసెల్‌ను తమతోనే ఉంచుకున్న కేకేఆర్‌ ‘పవర్‌ కోచ్‌’ అనే కొత్త పదవిని సృష్టించి బాధ్యతలు అప్పగించింది. కేన్‌ విలియమ్సన్‌ను లక్నో ఫ్రాంచైజీ ‘వ్యూహాత్మక సలహాదారు’గా నియమించుకుంది. ఆసీస్‌ మాజీ స్టార్‌ మాథ్యూ హేడెన్‌ గుజరాత్‌కు బ్యాటింగ్‌ కోచ్‌గా బాధ్యతలు చేపట్టనుండగా, ఇంగ్లండ్‌ మాజీ ప్లేయర్‌ ఇయాన్‌ బెల్‌ను ఢిల్లీ క్యాపిటల్స్‌ అసిస్టెంట్‌ కోచ్‌గా తీసుకుంది.  

» ఆటగాళ్లపరంగా చూస్తే టి20 వరల్డ్‌ కప్‌ స్టార్‌ సంజు సామ్సన్‌ జట్టు మారడమే ఆసక్తికర అంశం. 11 సీజన్ల పాటు రాజస్తాన్‌ రాయల్స్‌కు ఆడిన సామ్సన్‌ ఇప్పుడు అద్భుతమైన ఫామ్‌తో చెన్నై సూపర్‌ కింగ్స్‌ తరఫున బరిలోకి దిగబోతున్నాడు. అదే తరహాలో 12 సీజన్ల పాటు చెన్నైతో అనుబంధం ఉన్న ఆల్‌రౌండర్‌ రవీంద్ర జడేజా తన తొలి జట్టు రాజస్తాన్‌ రాయల్స్‌ తరఫున ఈసారి ఆడబోతున్నాడు.  

» ఐపీఎల్‌లో మొదటి నుంచి భారత్‌ తర్వాత ఆ్రస్టేలియన్లదే ఆధిపత్యం. అటు ఆటగాళ్లు, ఇటు కోచింగ్‌ బృందంలో కూడా వారంతా పెద్ద సంఖ్యలో ఉన్నారు. ఈసారి వేలంలో రూ.25.20 కోట్లకు అమ్ముడుపోయిన కామెరాన్‌ గ్రీన్‌ ప్రధాన ఆకర్షణగా ఉన్నాడు. కోల్‌కతా నైట్‌రైడర్స్‌ తరఫున అతను ఏమాత్రం ప్రభావం చూపిస్తాడన్నదే ఆసక్తికరం. ముగ్గురు ఆసీస్‌ గ్రేట్‌ బౌలర్లు స్టార్క్, కమిన్స్, హాజల్‌వుడ్‌ మాత్రం లీగ్‌ ఆరంభంలో కనిపించకపోవచ్చు. 

గాయాల నుంచి పూర్తిగా కోలుకొని కమిన్స్‌ (సన్‌రైజర్స్‌), హాజల్‌వుడ్‌ (ఆర్‌సీబీ) తమ టీమ్‌లతో చేరినా... ఎప్పటి నుంచి మ్యాచ్‌లు ఆడతారనే సందేహం ఉంది. స్టార్క్‌ అయితే ఇంకా భారత్‌కే రాకపోగా, దీనిపై ఢిల్లీ మేనేజ్‌మెంట్‌కు ఇంకా స్పష్టత లేదు. వీరు కాకుండా ట్రావిస్‌ హెడ్, టిమ్‌ డేవిడ్, షార్ట్, స్పెన్సర్‌ జాన్సన్, మిచెల్‌ మార్‌‡్ష, ఇన్‌గ్లిస్, స్టొయినిస్, ఒవెన్, డ్వార్‌షుయిస్, కనోలీ, బార్త్‌లెట్‌ కూడా తమ ప్రభావం చూపించాలని పట్టుదలగా ఉన్నారు.  

మ్యాచ్‌ల ఫార్మాట్‌ మారింది... 
లీగ్‌లోకి పది టీమ్‌లు వచ్చిన తర్వాత ప్రతీ ఏటా అనుసరిస్తున్న ‘గ్రూపింగ్‌’ పద్ధతినే ఈసారి కూడా అనుసరించారు. ఆయా టీమ్‌లు సాధించిన ఐపీఎల్‌ టైటిల్స్‌ను బట్టి వీటిని రెండు గ్రూప్‌లుగా విభజించారు. దీని ప్రకారం గ్రూప్‌ ‘ఎ’లో చెన్నై (5), కోల్‌కతా (3), రాజస్తాన్‌ (1), బెంగళూరు (1), పంజాబ్‌ కింగ్స్‌ ఉన్నాయి. గ్రూప్‌ ‘బి’లో ముంబై (5), హైదరాబాద్‌ (1), గుజరాత్‌ (1), ఢిల్లీ, లక్నో ఉన్నాయి.

 గత సీజన్‌ వరకు ప్రతీ జట్టు తమ గ్రూప్‌లోని నాలుగు జట్లతో రెండేసి మ్యాచ్‌లు (మొత్తం 8), ప్రత్యర్థి గ్రూప్‌లోని నాలుగు జట్లతో ఒక్కో మ్యాచ్‌ (మొత్తం 4), ఒక టీమ్‌తో రెండుసార్లు (2) ఆడేవి. ఇలా ప్రతీ జట్టుకు 14 లీగ్‌ మ్యాచ్‌లు ఆడే అవకాశం దక్కింది. అయితే ఈసారి ఇదే ఫార్మాట్‌ను భిన్నంగా మార్చారు. ఈ సీజన్‌లో ప్రత్యర్థి గ్రూప్‌లోని ఐదు జట్లతో రెండేసి సార్లు (మొత్తం 10), తమ గ్రూప్‌లోని టీమ్‌లతో ఒక్కో మ్యాచ్‌ (4)లో తలపడాల్సి ఉంటుంది. దీని ప్రకారం ఐదుసార్లు చాంపియన్లు అయిన చెన్నై, ముంబైల మధ్య రెండు మ్యాచ్‌లు జరుగుతాయి.

27 స్పాన్సర్లతో ప్రకటనల జోరు! 
ఐపీఎల్‌ క్రేజ్‌ను దృష్టిలో ఉంచుకొని చూస్తే పెద్ద సంఖ్యలో స్పాన్సర్లు రావడం కొత్త కాదు. కానీ ఈసారి ప్రసారకర్తలు మరింత పెద్ద సంఖ్యలో భారీ మొత్తాలకు స్పాన్సర్లతో జత కట్టారు. తాజా సీజన్‌ కోసం స్టార్‌ స్పోర్ట్స్‌–జియో హాట్‌స్టార్‌లలో కలిపి ఏకంగా 27 సంస్థలు స్పాన్సర్లుగా వ్యవహరించనున్నాయి. వీటితో బ్రాడ్‌కాస్టింగ్‌ టీమ్‌కు ప్రకటనల పండగ ఖాయం. 

స్పాన్సర్ల జాబితాలో గూగుల్‌ సెర్చ్‌ ఏఐ, క్యాంపా ఎనర్జీ, హావెల్స్, లాయిడ్, బిర్లా ఒపస్, హీరో మోటో కార్ప్, అమెజాన్, ఏఎంఎఫ్‌ఐ, ఏషియన్‌ పెయింట్స్, విమల్‌ ఇలైచీ, సూపర్‌ మనీ, ఎంఆర్‌ఎఫ్, ఫ్లిప్‌కార్ట్, జిల్లెట్, వీడా, రూపే, మాండెలెజ్, మదర్‌ డెయిరీ, గ్రో, ర్యాపిడో, ముత్తూట్‌ ఫినాన్స్, సన్‌ఫీస్ట్, గూగుల్‌ పే, టీవీఎస్‌ ఈవీ, ఏంజెల్‌ వన్, క్యాంపా ష్యూర్, అమూల్‌ ఉన్నాయి.  

టాప్‌–4 సన్‌రైజర్స్‌వే... 
లీగ్‌లో జట్టు నమోదు చేసిన అత్యధిక స్కోరు జాబితాలో హైదరాబాద్‌ హవానే సాగింది. టాప్‌–4 స్కోర్లు వరుసగా 287, 286, 278, 277 సన్‌రైజర్స్‌ నమోదు చేసింది. ఈసారి 300 నమోదవుతుందా అనేది 
ఆసక్తికరం.

109 ఐపీఎల్‌ చరిత్రలో నమోదైన సెంచరీలు. 58 మంది క్రికెటర్లు సెంచరీలు చేశారు. 2024లో అత్యధికంగా 14 సెంచరీలు నమోదుకాగా ... 2009లో అత్యల్పంగా 2 సెంచరీలు వచ్చాయి.  

4 ఐపీఎల్‌ మొదలైనప్పటి నుంచి ఇప్పటి వరకు నలుగురు ప్లేయర్లు (ధోని, రోహిత్‌ శర్మ, విరాట్‌ కోహ్లి, మనీశ్‌ పాండే) మాత్రమే ప్రతి సీజన్‌లో బరిలోకి దిగారు. రోహిత్‌ శర్మ (డెక్కన్‌ చార్జర్స్, ముంబై ఇండియన్స్‌), ధోని (చెన్నై సూపర్‌ కింగ్స్, రైజింగ్‌ పుణే సూపర్‌ జెయింట్స్‌) రెండు జట్లకు ప్రాతినిధ్యం వహించగా... కోహ్లి ఐపీఎల్‌ ఆరంభం నుంచి ఒకే జట్టు (ఆర్‌సీబీ)కు ఆడుతున్నాడు. మనీశ్‌ పాండే మాత్రం ఏడు జట్లకు (ముంబై ఇండియన్స్, రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు, పుణే వారియర్స్‌ ఇండియా, సన్‌రైజర్స్‌ హైదరాబాద్, లక్నో సూపర్‌ జెయింట్స్, ఢిల్లీ డేర్‌డెవిల్స్‌) ప్రాతినిధ్యం వహించాడు.

278 ఐపీఎల్‌లో అత్యధిక మ్యాచ్‌లు ఆడిన ప్లేయర్‌ ధోని. వరుసగా 19వ సీజన్‌లో బరిలోకి దిగనున్న ధోని 278 ఐపీఎల్‌ మ్యాచ్‌లు ఆడాడు. రోహిత్‌ శర్మ (272), విరాట్‌ కోహ్లి (267) వరుసగా రెండు, మూడు స్థానాల్లో ఉన్నారు.

10 ఐపీఎల్‌లో కనీసం 200 మ్యాచ్‌లు ఆడిన క్రికెటర్లు. ఈ జాబితాలో ధోని, రోహిత్, కోహ్లి, దినేశ్‌ కార్తీక్‌ (257), రవీంద్ర జడేజా (254), శిఖర్‌ ధావన్‌ (222), రవిచంద్రన్‌ అశ్విన్‌ (221), సురేశ్‌ రైనా (205), రాబిన్‌ ఉతప్ప (205), అంబటి రాయుడు (204) ఉన్నారు. ఈ సీజన్‌లో అజింక్య రహానే (198), భువనేశ్వర్‌ కుమార్‌ (190), సునీల్‌ నరైన్‌ (189) ఈ జాబితాలో చేరే అవకాశం ఉంది.

ఐపీఎల్‌ రికార్డులు... 
ఐపీఎల్‌ చరిత్రలో కొందరు ఆటగాళ్లు తమదైన ప్రత్యేక ముద్ర వేశారు. వీరిలో కొందరు ఇప్పటికీ కొనసాగుతున్నారు. మరికొందరు ఆటనుంచి నిష్క్రమించినా వారు అందించిన వినోదం, మెరుపులు మర్చిపోలేనివి. ఇప్పుడు బరిలో ఉన్నా, లేకపోయినా 19వ సీజన్‌ నేపథ్యంలో కొన్ని ఘనతలను గుర్తు చేసుకోక తప్పదు. 

ఐపీఎల్‌లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా విరాట్‌ కోహ్లి (8661), అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా యుజువేంద్ర చహల్‌ (221) పేరిట రికార్డు ఉంది. అత్యధిక వ్యక్తిగత స్కోరు క్రిస్‌ గేల్‌ (175 నాటౌట్‌) నమోదు చేయగా, అత్యుత్తమ బౌలింగ్‌ ప్రదర్శన అల్జారి జోసెఫ్‌ (6/12) పేరిట ఉంది. అత్యధిక సిక్స్‌లు (357) క్రిస్‌ గేల్‌ బాదగా, ఒకే సీజన్‌లో ఎక్కువ పరుగులు చేసిన ఘనత (973–2016లో) కోహ్లి పేరు మీద చెక్కు చెదరకుండా ఉంది.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement