
ఇన్‌చార్జీల పాలన ఇంకెన్నాళ్లు..?
మల్లన్న ఆలయంలో రెగ్యులర్ ఈవో ఎక్కడ..?
● వారంలో ఒకటి, రెండూ రోజులు మాత్రమే ఆలయానికి.. ● ఏడాదికి రూ.20 కోట్లకుపైగా ఆదాయం ● అయినా.. భక్తుల ఇబ్బందులు పట్టవా..?
కొమురవెల్లి(సిద్దిపేట): తెలంగాణతో ప్రసిద్ధి చెందిన కొమురవెల్లి మల్లికార్జున స్వామి రెగ్యులర్ ఈవో నియామకం కలగానే మిగిలిపోయింది. డిప్యూటీ కమిషనర్ క్యాడర్ కలిగిన ఆలయానికి అసిస్టెంట్ కమిషనర్లకు ఇన్‌చార్జీలు ఇచ్చి దేవాదా య శాఖ కాలం వెళ్లదీస్తోంది. 2020లో ఈవో వెంకటేశ్ బదిలీపై వెళ్లగా హైదరాబాద్ అసిస్టెంట్ కమిషనర్‌గా పని చేస్తున్న బాలాజీకి మల్లన్న ఆలయానికి ఇన్‌చార్జి ఈవోగా అదనపు బాధ్యతలు అప్పగించారు. బాలాజీ 2024 డిసెంబర్‌లో పదవీ విరమణ పొంవడంతో హైదరాబాద్ దేవాదాయశాఖ కార్యాలయంలో గెజిటెడ్ సూపరింటెండెంట్‌గా పని చేస్తున్న రామాంజనేయులుకు మల్లన్న ఆలయ ఈవోగా అదనపు బాధ్యతలు అప్పగించారు. 2025 ఏప్రిల్‌లో రామాంజనేయులు అదనపు బాధ్యతలు తొలగించి హైదరాబాద్‌లో చిక్కడపల్లి వెంకటేశ్వర్ల స్వామి ఆలయ ఈవో అన్నపూర్ణకు కొమురవెల్లి మల్లన్న ఈవోగా అదనపు బాధ్యతలు అప్పగించారు. కొమురవెల్లి మల్లికార్జున స్వామి ఆలయ ఇన్‌చార్జిగా ఈవోలుగా నియమితులైనవారు బహుముఖ బాధ్యతలు నిర్వహించలేక సతమతం అవుతున్నారు. వారంలో ఒకటి, రెండు రోజులు మత్రమే ఆలయానికి రావడంతో ఆలయంలో అభివృద్ధి పనులు కుంటు పడి భక్తులు ఇబ్బందులు పడుతున్నారు. తెలంగాణలో ప్రసిద్ధి చెందిన దేవాలయం కొమురవెల్లి మల్లికార్జున స్వామి ఆలయం ప్రతి యేటా స్వామి వారిని సుమారు రూ.కోటికిపై భక్తులు దర్శించుకుంటారు. ఎక్కడా లేని విధంగా స్వామి వారి బ్రహ్మోత్సవాలు నాలుగు నెలల పాటు కొనసాగుతాయి, దీంతో స్వామి వారికి సంవత్సరానికి సుమారు రూ.20 కోట్లకు పైగానే ఆదాయం వస్తుంది. ఇంతటి ప్రాధాన్యత గల ఆలయానికి రెగ్యులర్ ఈవో లేకపోవడం దురదృష్టకరమని భక్తులు వాపోతున్నారు. తమ సమస్యలు పరిష్కరించే నాథుడే లేడని అంటున్నారు.