
కమీషన్ల కోసం పని చేస్తున్నారా?
చిన్నకోడూరు(సిద్దిపేట): ఇరిగేషన్ అధికారులు కాంట్రాక్టర్ల వద్ద కమీషన్లు తీసుకోవడానికే తప్ప రైతుల కోసం పని చేయడం లేదని, ఇకనైనా అధికారుల్లో మార్పు జరగకపోతే సహించేది లేదని మెదక్ ఎంపీ రఘునందన్‌రావు అధికారుల తీరుపై మండిపడ్డారు. బుధవారం మండల పరిధిలోని రంగనాయక సాగర్‌వద్ద ఇరిగేషన్ ఎస్‌ఈ కార్యాలయంలో మల్లన్నసాగర్ 12వ ప్యాకేజీ పనులపై ఇరిగేషన్ అధికారులు, మెగా కంపెనీ ప్రతినిధులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 18 నెలలు అయినా అధికారులు, ప్రజా ప్రతినిధులతో ఎందుకు సమీక్ష సమావేశం నిర్వహించలేదని, జీతాలు తీసుకోవడం లేదా అని ప్రశ్నించారు. నెల రోజుల్లో సిద్దిపేట, దుబ్బాక, గజ్వేల్ నియోజకవర్గాల్లో మిగిలిపోయిన పనులు పూర్తి చేసి రైతులకు సాగు నీరు అందించాలని ఆదేశించారు. 2022లో పనులకు శంకుస్థాపన చేసినా నేటి వరకు ఎందుకు సాగు నీరు ఇవ్వలేదని మండిపడ్డాడు. దుబ్బాక నియోజకవర్గంలో గురువారం నుంచి ఇరిగేషన్ అధికారులు పర్యటించాలని సూచించారు. దుబ్బాక నియోజకవర్గంలో రైతులు ఎక్కువగా ప్రాజెక్టుతో నష్టపోయారని ఎమ్మెల్యే ప్రభాకర్ రెడ్డి తెలిపారు. మెగా కంపెనీ తీరుపై అసహనం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో ఇరిగేషన్ ఎస్‌ఈ బస్వరాజు, అధికారులు పాల్గొన్నారు.
రైతుల ప్రయోజనాలు పట్టవా..
ఇరిగేషన్ అధికారులపై ఎంపీ రఘునందన్‌రావు ఫైర్