
శంకుస్థాపన చేసి రెండేళ్లు..
● కాచాపూర్‌లోని మత్తడి వాగుపై వంతెన కలేనా?
కోహెడరూరల్(హుస్నాబాద్): మండలంలోని కాచాపూర్‌లో మత్తడి వాగుపై వంతెన నిర్మాణానికి రెండేళ్ల క్రితం శంకుస్థాపన చేశారు. టెండర్ ప్రకియ సైతం పూర్తయినా నేటికీ పనులు ప్రారంభం కాలేదు. అధికారులు, కాంట్రాక్టర్ నిర్లక్ష్యంతో వాహనదారులకు ఇబ్బందులు తప్పడం లేదు. తాత్కాలికంగా ఉన్న మట్టి రోడ్డుపై నుంచి చిన్న వర్షానికే నీరు ప్రవహిస్తుంది. దీంతో ప్రతిఏటా రాకపోకలకు అంతరాయం ఏర్పడుతోంది. గత బీఆర్‌ఎస్ ప్రభుత్వం రోడ్డుతో కలిపి వంతెన నిర్మాణానికి రూ.కోటి వ్యయంతో అప్పటి హుస్నాబాద్ ఎమ్మెల్యే సతీష్‌కుమార్ శంకుస్థాపన చేశారు. సదరు కాంట్రాక్టర్ కనీసం పిల్లర్లకు గుంతలు కూడా తీయలేదు. దీంతో వంతెనా నిర్మాణం కలగానే మిగిలిందని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎన్నికల హామీలే తప్ప అమలు చేయడం లేదని వాపోతున్నారు.