
రజకులను ఎస్సీలో చేర్చాలి
సిద్దిపేటరూరల్: రజకులను ఎస్సీ కమ్యూనిటీలో చేర్చేలా సీఎం రేవంత్‌రెడ్డి అసెంబ్లీలో తీర్మానం చేసి పార్లమెంట్‌కు పంపాలంటూ రాష్ట్ర చాకలి ఎస్సీ సాధన సమితి రాష్ట్ర కార్యదర్శి మల్లేశం డిమాండ్ చేశారు. ఈ మేరకు బుధవారం కలెక్టరేట్ ఏఓకు వినతిపత్రం అందించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రజక కులస్తులు ఎన్నో ఏళ్లుగా అన్యాయానికి గురవుతున్నామన్నారు. తమను కేవలం ఓటు బ్యాంకుగా మాత్రమే భావిస్తున్నారు తప్పా.. సంక్షేమాన్ని మరిచారన్నారు. రాష్ట్రంలో 26లక్షలకు పైగా జనాభా ఉన్నప్పటికీ సరైన ప్రాతినిధ్యం లేదన్నారు. దేశవ్యాప్తంగా 18 రాష్ట్రాల్లో ఎస్సీ వర్గంగా గుర్తింపు పొందిన క్రమంలో తమ రాష్ట్రంలో కూడా ఎస్సీలుగా గుర్తించాలన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు శ్రీనివాస్, ఉపాధ్యక్షులు సంతోష్, కార్యదర్శి కనకరాజు తదితరులు పాల్గొన్నారు.