
అయినవారి కోసం కుటుంబసభ్యుల పడిగాపులు
మూడు రోజులుగా నరకయాతన ● ‘సిగాచీ’ పేలుడు మిగిల్చిన పెనువిషాదం
అయినవారి కోసం ఆర్తనాదాలు కొనసాగుతూనే ఉన్నాయి. సిగాచీ పరిశ్రమ ఎదుట బాధిత కుటుంబసభ్యులు పడిగాపులు కాస్తున్నారు. చివరి చూపు దక్కక.. అంతిమ సంస్కారాలు సాగక దిక్కుతోచని స్థితికి గురవుతున్నారు. కనిపించిన వారినంతా.. ‘అయ్యా.. మా వాళ్లు ఏరీ? అంటూ దీనంగా వేడుకుంటున్నారు. ఈ పేలుడు ఘటన మిగిల్చిన విషాదం మూడు రోజులుగా కొనసాగుతుండటంతో బాధిత కుటుంబసభ్యులు నరకయాతన అనుభవిస్తున్నారు. ఉపాధి కోసం వందల కిలోమీటర్ల దూరం నుంచి పొట్ట చేతపట్టుకుని వస్తే.. ఉపాధి దేవుడెరుగు.. ఉసురు పోయిందని బాధితులు కన్నీరు మున్నీరవుతుండటం అందరినీ కలిచివేస్తోంది. – సాక్షిప్రతినిధి, సంగారెడ్డి
కొనసాగుతున్న సహాయక చర్యలు
● అందుబాటులో హెల్ప్‌డెస్క్
● కలెక్టర్ ప్రావీణ్య
పటాన్‌చెరు టౌన్: పాశమైలారంలోని సిగాచీ పరిశ్రమలో రిస్క్యూ ఆపరేషన్, సహాయక చర్యలు కొనసాగుతున్నాయని సంగారెడ్డి జిల్లా కలెక్టర్ ప్రావీణ్య తెలిపారు. సహాయక బృందాలకు మార్గదర్శనం చేస్తున్నామన్నారు. బాధిత కుటుంబాల కోసం ప్రత్యేక సహాయక కేంద్రం ఏర్పాటు చేశామన్నారు. వారి కుటుంబ సభ్యులకు భోజనం, తాత్కాలిక నివాసం, రవాణా వంటి సౌకర్యాలు ఏర్పాటు చేశామన్నారు. బాధితులు వారివారి స్వగ్రామాలకు వెళ్లేందుకు అవసరమైన రవాణా ఏర్పాట్లు చేశామన్నారు. ఒడిశా, బిహార్ రాష్ట్రాల అధికారులు కూడా సహాయక చర్యలు అందిస్తున్నారన్నారు.
18 మృతదేహాలు అప్పగింత
ఇప్పటి వరకు 18 మంది మృతదేహాలను అప్పగించామని కలెక్టర్ తెలిపారు. డీఎన్‌ఏ ఫలితాల కోసం 18 నమూనాలు పెండింగ్‌లో ఉండగా, ఇంకా సేకరించాల్సిన రెండు మృతదేహాల నమూనాలు ఉన్నాయని తెలిపారు. డీఎన్‌ఏ ద్వారా ఐదుగురు నమూనాలు వారి వారి కుటుంబ సభ్యులకు మృతదేహాలతో పాటు తక్షణ సాయం రూ.లక్ష అందజేశామన్నారు.
తాత్కాలిక ఆర్థిక సహాయం
18 మృతుల కుటుంబాలకు రూ.లక్ష చొప్పున, గాయపడిన 34 మందికి రూ.50 వేలు చొప్పున, మిస్సింగ్ అయిన 10 మంది కార్మికుల కుటుంబాలకు రూ.10 వేల చొప్పున తాత్కాలిక సహాయం అందించడం జరుగుతోందన్నారు. బాధిత కుటుంబాలు లేదా వారి బంధువులు సమాచారం కోసం సంగారెడ్డి కలెక్టరేట్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన హెల్ప్‌లైన్ నంబర్ 08455276155ను సంప్రదించవచ్చు. ఈ హెల్ప్ డెస్క్ ద్వారా వారి అవసరాలపై సత్వర స్పందించడానికి సిబ్బంది కార్యాలయ పని వేళల్లో అందుబాటులో ఉంటారని కలెక్టర్ తెలిపారు.
క్యాంపులో బిక్కుమంటూ..
బాధిత కుటుంబాల కోసం అధికారులు పాశమైలారం ఐలా కార్యాలయం వద్ద ప్రత్యేక సహాయ కేంద్రం ఏర్పాటు చేశారు. ఈ కేంద్రంలో బాధితులు బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు. తమ వారి ఆచూకీ కోసం అక్కడి హెల్ప్‌డెస్క్‌లో రక్త నమూనాలను ఇచ్చి తమ వారి మృతదేహాల కోసం వేచి చూస్తున్నారు. అధికారుల నుంచి ఎప్పుడు పిలుపు వస్తుందోనని ఆవేదనతో వేచి చూస్తున్నారు. ఆచూకీ తెలియగానే సమాచారం ఇస్తామని అధికారులు దాటవేస్తుండటంతో తీవ్ర నిరాశకు గురవుతున్నారు.
కుటుంసభ్యులు మరణిస్తే వేదన అంతా ఇంతా కాదు.. మరణించాడని తెలిసి చివరి చూపు కోసం.. అంతిమ సంస్కారాలైనా చేసుకుందామంటే మృతదేహం లభించకపోతే.. ఆ శోకం రెట్టింపవుతుంది. సరిగ్గా ఇలాంటి ఆవేదనే సిగాచీ పరిశ్రమ పేలుడు ఘటనలో మృతి చెందిన వారి కుటుంబాలు అనుభవిస్తున్నాయి. తమ వారి జాడ చెప్పాలని, లేదంటే మృతదేహాన్ని అయినా అప్పగించాలని వారి కుటుంబసభ్యులు పడుతున్న యాతన అందరినీ కలిచివేస్తోంది. ఘటన జరిగిన సిగాచీ పరిశ్రమ వద్దకు తరలివస్తున్న బాధిత కుటుంబసభ్యులు, బంధువులు, మిత్రులు.. తమ వారి ఆచూకీ కోసం అక్కడ ఉన్న అధికారులను వేడుకుంటున్నారు. హెల్ప్‌డెస్క్‌కు వెళ్లి ఆరా తీస్తున్నారు. మృతదేహాలను ఉంచిన పటాన్‌చెరు ప్రభుత్వాస్పత్రి మార్చురీ వద్ద అధికారులను సంప్రదిస్తున్నారు. గంటలు కాదు.. రోజులు గడుస్తున్నా తమ వారు కనిపించకపోవడంతో కన్నీరు మున్నీరవుతున్నారు.

అయినవారి కోసం కుటుంబసభ్యుల పడిగాపులు

అయినవారి కోసం కుటుంబసభ్యుల పడిగాపులు

అయినవారి కోసం కుటుంబసభ్యుల పడిగాపులు

అయినవారి కోసం కుటుంబసభ్యుల పడిగాపులు

అయినవారి కోసం కుటుంబసభ్యుల పడిగాపులు

అయినవారి కోసం కుటుంబసభ్యుల పడిగాపులు

అయినవారి కోసం కుటుంబసభ్యుల పడిగాపులు