పటాన్‌చెరు: అమీన్‌పూర్, పటాన్‌చెరు సర్కిళ్ల పరిధిలో చేపడుతున్న అభివృద్ధి పనులను నిర్దేశించిన గడువులోగా పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి సంబంధిత అధికారులను ఆదేశించారు. సోమ వారం స్థానిక డివిజన్ పరిధిలోని క్యాంపు కార్యాలయంలో అమీన్ పూర్, పటాన్ చెరు సర్కిల్ డిప్యూటీ కమిషనర్లు, ఇంజనీరింగ్ అధికారులతో అభివృద్ధి పనులపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా రెండు సర్కిళ్ల పరిధిలోని 9 డివిజన్లలో చేపడుతున్న అభివృద్ధి పనులను అధికారులు ఎమ్మెల్యేకు వివరించారు. ప్రధానంగా నూతన కాలనీల్లో శంకుస్థాపన చేసిన అభివృద్ధి పనులను గడువులోగా పూర్తి చేయాలని సూచించారు. నిరంతరం క్షేత్రస్థాయిలో పర్యటిస్తూ అభివృద్ధి పనులను పరిశీలించాలని సూచించారు. ప్రస్తుతం వర్షాకాలం ప్రారంభమైనందున.. పారిశుద్ధ్య సిబ్బంది నిరంతరం అందుబాటులో ఉండాలని సూచించారు. ముఖ్యంగా సీజనల్ వ్యాధులు ప్రబలకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. బొల్లారం స్టేడియం, పాటి వివేకానంద స్టేడియంల అభివృద్ధికి నిధులు మంజూరయ్యాయని.. త్వరలోనే పనులు ప్రారంభించనున్నట్లు అధికారులు తెలిపారు. రెండు సర్కిళ్లకు సంబంధించిన రూ.250 కోట్ల నిధులు తిరిగి డివిజన్లలో చేపట్టనున్న అభివృద్ధి పనులకు కేటాయించాలని ఇప్పటికే సైబరాబాద్ మున్సిపల్ కమిషనర్‌కు విన్నవించామని తెలిపారు. ఈ సమావేశంలో డిప్యూటీ కమిషనర్లు ప్రదీప్ కుమార్, జ్యోతి రెడ్డి, డీఈ వెంకటరమణ, ఏఈలు ఫైజాన్, లావణ్య పాల్గొన్నారు.
ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి


